UN report on India Poverty: భారత్‌లో తగ్గిన పేదరికం..ఐక్యరాజ్యసమితి నివేదిక!

 ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్‌ పేదరికంపై విజయం సాధించడంలో ముందంజలో ఉందని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.

 UN report on India Poverty
భారత్‌లో 2005/2006 నుంచి 2019/2021 దాకా, 15 సంవత్సరాల్లో ఏకంగా 41.4 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించింది. ఈ మేరకు యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌డీపీ) యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి గ్లోబల్‌ మల్టిడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌(ఎంపీఐ) నివేదికను తాజాగా విడుదల చేసింది.
గత 15 ఏళ్లలో పేదరికాన్ని అంతం చేయడంలో భారత్‌ సహా 25 దేశాలు మెరుగైన ఫలితాలు సాధించాయని పేర్కొంది. ఈ జాబితాలో కాంబోడియా, చైనా, కాంగో, హోండూరస్, ఇండోనేసియా, మొరాకో, సెర్బియా, వియత్నాం తదితర దేశాలు ఉన్నాయని తెలియజేసింది. ఇండియాలో 2005/2006లో 55.1 శాతం మంది పేదలు ఉండగా, 2019/2021 నాటికి వారి సంఖ్య 16.4 శాతానికి తగ్గిపోయిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.
దేశంలో 15 సంవత్సరాల క్రితం 64.5 కోట్ల మంది పేదలు ఉండగా, 2019/2021లో 23 కోట్ల మంది ఉన్నట్లు తేలిందని వివరించింది. ఇదే సమయంలో సరైన పౌష్టికాహారం అందుబాటులోని ప్రజల సంఖ్య 44.3 శాతం నుంచి 11.8 శాతానికి తగ్గిపోయిందని వెల్లడించింది.
శిశు మరణాలు 4.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గిపోయాయని పేర్కొంది. పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో లేని వారి సంఖ్య 50.4 శాతం నుంచి 11.3 శాతానికి తగ్గిందని తెలియజేసింది. ఎక్కువ మందికి తాగునీరు, విద్యుత్‌ వంటి సౌకర్యాలను కల్పించడంలో భారత్‌ గణనీయమైన ప్రగతి సాధించిందని కొనియాడింది.

No comments:

Post a Comment