RBI Annual Report: కట్టలు తెంచుకున్న కరెన్సీ.. ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడి.. వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలు..
చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ అలాగే పరిమాణం రెండూ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో (2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చి) వరుసగా 7.8 శాతం, 4.4 శాతం పెరిగాయి.
అయితే 2021–22లో ఈ పెరుగుదల (2020–21తో పోల్చి) వరుసగా 9.9 శాతం, 5 శాతంగా ఉన్నాయి. మొత్తంగా పరిస్థితి చూస్తే, డిజిటలైజేషన్ మార్గంలో ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యవస్థలో బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం పెరగడం గమనార్హం. అయితే పెరుగుదల శాతాల్లో తగ్గడమే ‘చెప్పుకోవడానికి’ కొంత ఊరటనిచ్చే అంశం. ఆర్‌బీఐ ఈ మేరకు విడుదల చేసిన వార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు..
♦ విలువ పరంగా చూస్తే, రూ. 500, రూ. 2,000 నోట్ల వాటా 31 మార్చి 2023 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 87.9 శాతం. 31 మార్చి 2022లో ఇది 87.1 శాతం.
♦ రూ. 500 డినామినేషన్ అత్యధికంగా 37.9% వాటాను కలిగి ఉంది. తరువాతి స్థానంలో రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోటు ఉంది. ఈ నోట్లు 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో రూ.10 నోట్ల పరిమాణం 19.2%గా ఉన్నాయి.
♦ 2023 మార్చి చివరి నాటికి రూ. 25,81,690 కోట్ల విలువ కలిగిన మొత్తం రూ. 500 డినామినేషన్ నోట్లు 5,16,338 లక్షలు. 2022 మార్చి చివరి నాటికి రూ. 500 నోట్ల సంఖ్య 4,55,468 లక్షలు. అంటే వ్యవస్థలో రూ.500 నోట్లు వార్షికంగా పెరిగాయన్నమాట.
♦ ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 డినామినేషన్‌లు ఉన్నాయి. చెలామణిలో ఉన్న నాణేలు 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 డినామినేషన్‌లను కలిగి ఉంటాయి.
♦ 2022–23 మధ్యకాలంలో ఆర్‌బీఐ లైవ్–పైలట్ ప్రాతిపదికన ఈ–రూపాయిని కూడా ప్రారంభించింది. 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న ఈ–రూపాయి–హోల్‌సేల్ అలాగే ఈ–రూపాయి–రిటైల్ విలువలు వరుసగా రూ. 10.69 కోట్లు రూ. 5.70 కోట్లుగా ఉన్నాయి.
♦ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు నోట్ల ఇండెంట్, సరఫరాలు రెండూ గత సంవత్సరంతో (2021–22) పోలిస్తే 1.6 శాతం స్వల్పంగా పెరిగాయి. రూ.2000 నోట్ల ప్రింటింగ్‌కు ఇండెంట్ లేదు.
రూ.2000 నోట్ల సంగతి ఇదీ..
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది.
తగ్గుతున్న మోసాల ‘విలువ’: 2022–23లో బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుంది. అయితే విలువ మాత్రం దాదాపు సగానికి తగ్గి రూ. 30,252 కోట్లుగా ఉంది. కార్డ్, ఇంటర్‌నెట్ డిజిటల్ పేమెంట్లలోనే మోసాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.
Latest News
RBI Annual Report: కట్టలు తెంచుకున్న కరెన్సీ.. ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడి.. వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment