ఇప్పటికే బైజూస్ ద్వారా స్మార్ట్ ఫోనుల్లో, ట్యాబుల్లో ఈ–కంటెంట్ అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి ఈ–పాఠశాలను ప్రవేశపెడుతోంది.
ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ను అందించనుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకంగా ఈ–పాఠశాల యాప్‌ను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, కింది తరగతుల్లో స్మార్ట్ టీవీల ద్వారా ప్రభుత్వం డిజిటల్ విద్యాబోధన అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతులకు అవసరమైన ఈ–కంటెంట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా 4వ తరగతి నుంచి ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది.
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా..
లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ–కంటెంట్‌ను రూపొందించే పనిలో ఎస్‌సీఈఆర్‌టీ నిమగ్నమైంది. ప్రస్తుతం 4వ తరగతి నుంచి నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు బైజూస్ సంస్థ ద్వారా కంటెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎస్‌సీఈఆర్‌టీ అదే తరహాలో ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు మాత్రమే కాకుండా లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో కూడా రూపొందిస్తోంది. పాఠ్యప్రణాళికలను రూపొందించేది ఎస్సీఈఆర్టీయే కాబట్టి భవిష్యత్తులో బైజూస్ సంస్థ ఉన్నా, లేకున్నా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా ఈ– కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది.
దీన్ని ఏపీ ఈ–పాఠశాల, యూట్యూబ్, దీక్షా ప్లాట్‌ఫారం, ఐఎఫ్‌బీ ప్లాట్‌ఫారం, పీఎం ఈ–విద్య (డీటీహెచ్ చానెల్)లో అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో ఒకే రకమైన కంటెంట్ ఉండేలా.. ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరికి నచ్చినట్లు వారు ఈ–కంటెంట్‌ను రూపొందించి యూట్యూబ్‌లో పెడుతున్నారు. దీనివల్ల విద్యార్థులు కొంత సంశయానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే అన్ని అధికారిక చానళ్లలో ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన ఈ–కంటెంట్‌ను అందుబాటులో ఉంచనుంది.
ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగానే పాఠ్యాంశాలు
ఏపీలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా రాష్ట్రంలోనూ పాఠ్యాంశాలు ఉండేలా ఎస్‌సీఈఆర్‌టీ చర్యలు చేపట్టింది. కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే విద్యార్థి నేర్చుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో వెనుకబడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం నీట్, జేఈఈ వంటి పరీక్షలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అలాంటి పరీక్షల్లోనూ మంచి విజయాలు సాధించేలా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ఈ–కంటెంట్ రూపకల్పనలో యథాతథంగా అనుసరిస్తున్నారు. జాతీయ కరిక్యులమ్‌ను అనుసరించి జాతీయ అంశాలను బోధించేటప్పుడు మన రాష్ట్ర అంశాలను ఆసరాగా చేసుకొని చెప్పేలా టీచర్లకు సూచనలు సైతం చేశారు.
Latest News
E-Schools: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఈ–పాఠశాల’.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యాంశాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment