Nobel Prize in Medicine 2022 : ఈ సారి వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి ఈయ‌న‌కే.. 40 ఏళ్ల కిందట తండ్రికి.. ఇప్పుడేమో కొడుకు

 ప్రముఖ జన్యుశాస్త్రవేత్త, ఫ్రొఫెసర్‌ స్వాంటే పాబో (Svante Paabo) 2022 ఏడాదికిగానూ వైద్య రంగంలో నోబెల్‌ బహుమతి విజేతగా నిలిచారు.

67 ఏళ్ల స్వాంటే పాబో.. పరిణామ జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ పేరుప్రఖ్యాతలు, ఎన్నో గౌరవాలు అందుకున్నారు. పాలియోజెనెటిక్స్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు పాబో. పురాతన జీవుల అవశేషాల నుంచి సంరక్షించబడిన జన్యు పదార్థాన్ని పరిశీలించడం ద్వారా గతాన్ని(ఒకప్పటి మనిషి జాతులు- ప్రాచీన ఆదిమతెగల గురించి) అధ్యయనం చేయడం పాలియోజెనెటిక్స్ ముఖ్యోద్దేశం.


జర్మనీ లెయిప్‌జిగ్ నగరంలోని మ్యాక్స్‌ ఫ్లాంక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో జన్యుశాస్త్ర విభాగానికి డైరెక్టర్ట్‌గా పాబో గతంలో విధులు నిర్వహించారు. జపాన్‌ ఒకినావా ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌ సైన్సెస్‌ & టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు.   

కుటుంబ నేప‌థ్యం ఇదే..
స్వాంటే పాబో(Svante Paabo) పుట్టింది స్టాక్‌హోమ్‌లో. ఈయన తల్లి ఎస్టోనియాకు చెందిన కెమిస్ట్‌ కరిన్‌ పాబో. తండ్రి స్వీడన్‌కు చెందిన ప్రముఖ బయోకెమిస్ట్‌ కార్ల్‌ సనె బెర్గ్‌స్ట్రోమ్‌. బెర్గ్‌స్ట్రోమ్‌ 1982లో వైద్య రంగంలోనే నోబెల్‌ బహుమతి అందుకోవడం గమనార్హం. స్వీడన్‌కే చెందిన బయోకెమిస్ట్‌ బెంగ్ట్‌ శ్యాముల్‌స్సన్‌, బ్రిటిష్‌ పార్మకాలజిస్ట్‌ జాన్‌ ఆర్‌ వేన్‌లతో కలిసి కార్ల్‌ సనె బెర్గ్‌స్ట్రోమ్‌ నోబెల్‌ బహుమతిని పంచుకున్నారు. ఇప్పుడు బెర్గ్‌స్ట్రోమ్‌ తనయుడు పాబో కూడా వైద్యరంగంలోనే నోబెల్‌ విజేతగా నిలిచారు. 

➤ 1997లో, పాబో తన సహచరులు కలిసి నియాండర్తల్ మైటోకాన్డ్రియల్ DNA (mtDNA) సీక్వెన్సింగ్‌ను విజయవంతంగా నివేదించారు. నియాండర్ లోయలోని ఫెల్‌హోఫర్ గ్రోటోలో కనుగొనబడిన ఒక నమూనా నుంచి ఉద్భవించింది.

➤ ఆగష్టు 2002లో.. పాబో డిపార్ట్‌మెంట్ ‘‘భాషా జన్యువు’’.. FOXP2 గురించి పరిశోధనలను ప్రచురించింది. భాషా వైకల్యం ఉన్న కొందరిలో ఈ జన్యువు లేకపోవడం లేదంటే దెబ్బతినడం గుర్తించారు.

➤ 2006లో..  నియాండర్తల్‌ల మొత్తం జన్యువును పునర్నిర్మించే ప్రణాళికను ప్రకటించారు పాబో. ఈ పరిశోధనకుగానూ.. 2007లో టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పాబో ఎంపికయ్యారు.

➤ నియాండర్తల్స్‌.. అంతరించిన మానవజాతి. యూరేషియాలో వేల సంవత్సరాల కిందట బతికిన అర్చాయిక్‌ ఉపజాతిగా కూడా భావిస్తుంటారు. 

➤ దాదాపు 70 వేల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతం అంతరించిపోయిన ఈ హోమినిన్‌ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని పాబో గుర్తించారు.

➤ ఫలితంగా.. ఈ తరం మానవుల్లోనూ ఈ పురాతన జన్యువుల ప్రవాహం కొనసాగుతోందని, ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, అంటువ్యాధులకు ప్రతిస్పందిస్తుందని ఆయన తన బృందంతో సాగించిన పరిశోధనల ఆధారంగా వెల్లడించారు. 

➤ 2014లో నియాండర్తల్‌ మ్యాన్‌: ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ జీనోమ్స్‌ అనే పుస్తకం పాబో కోణంలో మానవ పరిణామ క్రమాన్ని వివరించే యత్నం చేసింది.

➤ కరోనా టైంలోనూ ఆయన చేసిన పరిశోధనలు.. ఎంతో పేరు దక్కించుకున్నాయి. 

➤ స్వీడన్‌తో పాటు జర్మనీ నుంచి కూడా ఎన్నో ఉన్నత గౌరవాలు, బిరుదులు అందుకున్నారాయన. 

➤ బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్‌ బయాలజీలో పరిశోధనలకుగానూ..  ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌ సొసైటీ ‘ఎఫ్‌ఈబీఎస్‌’ థియోడోర్‌ బుచర్‌ మెడల్‌తో ఆయన్ని సత్కరించింది. డాన్ డేవిడ్‌ ప్రైజ్‌, మెస్రీ ప్రైజ్‌లు సైతం అందుకున్నారీయన. 

➤ వీటితో పాటు ఐర్లాండ్‌, ఆస్ట్రియా, జపాన్‌, తదితర దేశాల నుంచి కూడా విశేష గౌరవాలను సొంతం చేసుకున్నారు. 

➤ పాబోSvante Paabo తనను తాను బైసెక్సువల్‌ అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2014 వరకు ‘గే’గా ఉన్న ఈయన.. ఆపై సైంటిస్ట్‌ లిండా విజిలెంట్‌ను వివాహం చేసుకుని.. ఇద్దరు పిల్లల్ని కన్నారు.

➤ మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను పాబోకీ నోబెల్‌ బహుమతి లభించింది.

వారం రోజులు పాటు..ఇలా..

వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం  భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2022 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 10న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

ఈయ‌న పేరు మీద‌..
నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెల్సిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.



No comments:

Post a Comment