ఆత్మ నిర్భర్ పేరుతో 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ



కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Current Affairs
‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’పథకానికి రూపకల్పన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని మే 12న ప్రధాని మోదీ ప్రకటించారు. వైరస్‌ కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో ఈ ఉద్దీపన పథకాన్ని ప్రారంభించారు.

జీడీపీలో దాదాపు 10శాతం..
భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమలవారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10 శాతం అని ప్రధాని వెల్లడించారు. ఆర్బీఐ, ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో కలిపి ఇది రూ. 20 లక్షల కోట్లుగా ఉంటుందన్నారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా (చట్టం).. వీటిపై ప్రధానంగా ఈ ప్యాకేజీలో దృష్టి పెడతామన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజ్‌ పూర్తి వివరాలను రానున్న రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ వెల్లడిస్తారని చెప్పారు. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్న ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ దేశ ప్రజల నినాదం కావాలన్నారు. కరోనా సంక్షోభం కారణంగా అనుకోకుండానే స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేశామన్నారు.




మూడో సారి ప్రసంగం..
దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ మే 12న దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా మారిన పరిస్థితులను, కరోనా సంక్షోభాన్ని భారత్ సమర్ధంగా ఎదుర్కొన్న తీరును ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కరోనా నేపథ్యంలో దేశప్రజలనుద్దేశించి టీవీ మాధ్యమం ద్వారా ప్రధాని ప్రసంగించడం ఇది మూడో సారి.

No comments:

Post a Comment