వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఉత్తర్వులు

* ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్‌ జారీ
* మే 1 నాటికి నియామక ప్రక్రియ పూర్తి

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వాలంటీర్ల నియామకాల సందర్భంగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు వాలంటీర్ల, సచివాలయ విభాగ ప్రత్యేక కార్యదర్శి కె.కన్నబాబు ఏప్రిల్ 18న‌ సూచించారు. కొవిడ్‌-19 నియంత్రణ కార్యక్రమాలకు గైర్హాజరైన వారితోపాటు రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి ఏప్రిల్ 20న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఏప్రిల్ 24లోగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25న పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి.. ఏప్రిల్ 27-29 తేదీల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
* 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు పూర్తయి 35 ఏళ్ల నిండని వారంతా ఆన్‌లైన్‌లో https://gswsvolunteer,apcfss.in/ దరఖాస్తు చేసుకోవాలి.
* ఖాళీల భర్తీలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తారు. మిగతా యాభై శాతం పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యమిస్తూ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ (ఆర్‌వోఆర్‌) అమలు చేయనున్నారు.
* ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పరిజ్ఞానం, అవగాహనకు సంబంధించి 25 మార్కులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లయితే 25, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు 25, ఇతర నైపుణ్యాలకు 25 మార్కులు చొప్పున కేటాయిస్తారు.

No comments:

Post a Comment