శిక్షణ పొందితే లక్షల కొలువులు!

వేగంగా విజృంభిస్తున్న ఈ-కామర్స్‌
‘రానున్న అయిదేళ్లలో ఒక్క భారత్‌లోనే పది లక్షల ఉద్యోగాలను అందించనున్నా’మని ప్రకటించింది.. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌! ఇంటర్నెట్‌పై ఆధారపడి చేసే వ్యాపారాన్నే ఈ-కామర్స్‌గా వ్యవహరిస్తారు. ఇది కొనుగోళ్లు, అమ్మకాలను సులభతరం చేయడమే కాదు, ఎన్నో ఉద్యోగావకాశాలనూ తెచ్చిపెడుతోంది. రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాలను అందించే సత్తా ఉన్న రంగమిది. వీటిని చేజిక్కించుకునేలా విభిన్న కోర్సులు అందుబాటులోకి వచ్చాయి!
ఎప్పుడైనా నచ్చిన వస్తువును ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి తెప్పించుకున్నారా? ఉపయోగించిన ఏదైనా వస్తువును అవసరం తీరాక ఇంటర్నెట్‌ను ఉపయోగించి అమ్మేశారా? పోనీ ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేశారా? అయితే ఈ-కామర్స్‌ పరిచయం అయ్యిందన్నట్లే! ప్రముఖ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్లు, కోర్స్‌ ఎరా, ఎడ్‌ఎక్స్‌ వంటి విద్యా సంబంధ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌లో గ్రాసరీలను అందించేవి... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ-కామర్స్‌కు ఉదాహరణలెన్నో. నిత్యజీవితంలో ప్రతి అంశానికీ ఈ- కామర్స్‌పై ఆధారపడటం క్రమంగా పెరుగుతోంది.
ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే నాలుగు దుకాణాలు తిరిగి, ఎక్కడ తక్కువ ధర ఉందో కనుక్కొని కొనేవారు. అమ్మాలన్నా దాదాపుగా ఇదే పరిస్థితి. కొనుగోలుదారులను చూసుకుని, తగిన ధర దొరుకుతుందనుకున్నవారికి అమ్మేవారు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక ఈ రెండూ సులభతరమయ్యాయి. వ్యాపారులు, వినియోగదారులు ఎలక్ట్రానిక్‌ మాధ్యమాన్ని ఉపయోగించి జరిపే కొనుగోళ్లు, అమ్మకాలు, సేవలను ఈ-కామర్స్‌/ ఎలక్ట్రానిక్‌ కామర్స్‌గా చెబుతారు.
గత కొంతకాలంగా స్టార్టప్‌లు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి ఈ-కామర్స్‌ రంగానికి పెద్దపీట వేస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం ఈ-కామర్స్‌ ప్రమేయంతో కొన్ని లక్షల ఉద్యోగాలు రానున్నాయి. మై హైరింగ్‌క్లబ్‌, సర్కారీనౌకరీ వెబ్‌సైట్లూ ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ‘ఎంప్లాయ్‌మెంట్‌ ట్రెండ్స్‌ సర్వే’ పేరిట ఈ వెబ్‌సైట్లు సంయుక్తంగా ఒక సర్వేను నిర్వహించాయి. దీని ప్రకారం 1.12 లక్షల కొలువులు రిటైల్‌, ఈ-కామర్స్‌ రంగాల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయని నివేదిక తెలియజేస్తోంది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 2025 నాటికి ఈ రంగంలో పది లక్షల కొలువులు కల్పించనుంది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ జఫె్‌ బెజోస్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇంటర్నెట్‌ అభివృద్ధి జరిగేకొద్దీ ఈ-కామర్స్‌కు భవిష్యత్‌ ఉంటూనే ఉంటుంది.



ఎన్నో ప్రముఖ సంస్థలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, తగిన కోర్సులను అందిస్తున్నాయి. ఇవి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, ఈ-కామర్స్‌ రంగంపై ఆసక్తి ఉన్నవారు, నిలకడగల రంగంలో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించేవారూ వీటివైపు దృష్టి సారించవచ్చు.
ఎన్నో కోర్సులు
దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఈ-కామర్స్‌లో నేరుగా కోర్సులను అందిస్తున్నాయి. సర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
* కోర్సును బట్టి నేర్చుకునే అంశాల్లో మార్పులుంటాయి. సాధారణంగా బిజినెస్‌ ఎకనామిక్స్‌, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌, స్టాటిస్టిక్స్‌ ఫండమెంటల్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ప్రొఫెషనల్‌ కమ్యూనికేషన్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మొదలైనవాటితోపాటు కొన్ని కంప్యూటర్‌ అప్లికేషన్లు- ప్రోగ్రామింగ్‌, డీబీఎంఎస్‌ అంశాలను కోర్సులో భాగంగా నేర్పుతారు.
* కొన్ని విద్యాసంస్థలు గత కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నాయి. చాలావరకూ సంస్థలు మాత్రం ప్రత్యేకంగా ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రవేశపరీక్షతోపాటు గ్రూప్‌డిస్కషన్‌, ఇంటర్వ్యూలనూ నిర్వహిస్తున్నాయి. సాధారణంగా వీటి నోటిఫికేషన్లు ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ విడుదలవుతుంటాయి. మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మ్యాట్‌, క్యాట్‌, సీమ్యాట్‌, గ్జాట్‌, ఎన్‌మ్యాట్‌, జీమ్యాట్‌ వంటి ఉమ్మడి ప్రవేశపరీక్షల ద్వారా కూడా ప్రవేశాలు జరుపుతున్నారు.
* సర్టిఫికెట్‌ కోర్సుల కాలవ్యవధి ఆరు నెలలు. కామర్స్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. డిప్లొమా కోర్సుల కాలవ్యవధి ఏడాది. డిప్లొమా కోర్సులకు ఇంటర్‌లో ఏదేని గ్రూపును కనీసం 50% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు. అడ్వాన్స్‌డ్‌, పీజీ డిప్లొమా కోర్సులకు కామర్స్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
* డిగ్రీ స్థాయిలో బీకాం (ఈకామర్స్‌), బీఎస్‌ఈ, బీబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. సెమిస్టర్ల విధానం ఉంటుంది. ఏదేని గ్రూపుతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు.
* పీజీ స్థాయిలో ఎంఎస్‌సీ, ఎంకాం, ఎంబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. కామర్స్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారు ఈ కోర్సులకు అర్హులు.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఈ-కామర్స్‌ (ఐఐఈసీ), బెంగళూరు
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఐఐబీఎంఎస్‌), ముంబయి
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ (ఐఏఎన్‌టీ), గుజరాత్‌
* అమిటీ యూనివర్సిటీ, నోయిడా
* జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి
* లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, జలంధర్‌
* సావిత్రీభాయి పూలే పుణె యూనివర్సిటీ, పుణె
* డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరాట్వాడా యూనివర్సిటీ (బీఏఎంయూ), ఔరంగాబాద్‌
ఉద్యోగావకాశాలు
ఈ-కామర్స్‌ వేగంగా, స్థిరంగా అభివృద్ధి చెందుతున్న రంగం. అర్హత ఉన్నవారికి దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ రంగంలో మూడు విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
అవి:
1. సృజనాత్మకం: ప్రొడక్ట్‌ రూపకల్పన, కస్టమర్‌ అనుభవం, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ మొదలైనవి.
2. ఆపరేషన్స్‌: కేటగిరీ మేనేజ్‌మెంట్‌, సప్లయి చైన్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌజ్‌, ఇన్వెంటరీ మొదలైనవి.
3. అనుబంధ అంశాలు: ఫైనాన్స్‌, పేమెంట్స్‌, లీగల్‌, హెచ్‌ఆర్‌ మొదలైనవి.
సంబంధిత విభాగంలో డిగ్రీ ఉన్నవారిని ఈ-బిజినెస్‌ కన్సల్టెంట్‌, కస్టమర్‌ రిలేషన్‌ ఆఫీసర్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, సప్లయి చైన్‌ మేనేజర్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఈక్విటీ రిసెర్చ్‌ అనలిస్ట్‌, కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌, స్టాక్‌ అనలిస్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అనలిస్ట్‌, ఆపరేషన్‌ మేనేజర్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, వెబ్‌ కన్సల్టెంట్‌ మొదలైన హోదాలకు ఎంచుకుంటారు.
ఈ-కామర్స్‌ సంస్థలు, ట్రావెలింగ్‌, రిటైల్‌ అండ్‌ మార్కెటింగ్‌, ఎడ్యుకేషన్‌, ఆన్‌లైన్‌ ఆక్షన్‌ సర్వీసులు, సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థలు, ఈ-బిజినెస్‌ సొల్యూషన్స్‌ సంస్థలు, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌, బ్యాంకులు, ఛారిటీ అసోసియేషన్స్‌ మొదలైన సంస్థలు వీరిని నియమించుకుంటాయి. ఉద్యోగాలు ఇస్తున్న సంస్థల్లో ప్రముఖమైనవి: ఈ-బే, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, శ్నాప్‌డీల్‌, అలీబాబా, మింత్రా, పేటీఎం, యాహూ, నోకియా, అడొబ్‌, యాక్సెంచర్‌, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌. ఈ రంగంపై మంచి పరిజ్ఞానం, అనుభవం ఉన్నవారు సొంతంగా వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు.
జీతభత్యాలు
హోదానుబట్టి వేతనాల్లో మార్పులుంటాయి. సాధారణంగా ప్రారంభ వేతనం దేశంలో ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఉంటుంది. విదేశాల్లో ఇంకా మెరుగైన వేతనాన్ని పొందే వీలుంది. అనుభవం, నైపుణ్యాల్లో మెరుగుదలను బట్టి భవిష్యత్తులో మంచి జీతాన్ని అందుకునే వీలుంటుంది.