కేంద్ర బడ్జెట్ - 2020



ఇస్రోకు ఇంధనం
శ్రీహరి కోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కి కేంద్ర బడ్జెట్‌లో రూ.13,479.47 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది. ఇస్రో గగన్‌యాన్‌, చంద్రయాన్‌-3, చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్‌ఎస్‌ఎల్‌సీ) అభివృద్ధితోపాటు తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో కొత్త అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు చేశారు. దీంతో ఈ ఏడు బడ్జెట్‌ పెరిగింది. 2018-19లో రూ.11,200 కోట్లు కేటాయించగా, 2019-20లో బడ్జెట్‌ కేటాయింపు రూ.12,473.26 కోట్లు కేటాయించారు. తాజా కేటాయింపుల్లో ప్రధానంగా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం (రూ.9,761.50 కోట్లు), అనువర్తనాలు (రూ.1,810 కోట్లు) అంతరిక్ష శాస్త్రాలు (రూ.265 కోట్లు), ఇన్సాట్‌ ఉపగ్రహాల కోసం (రూ.750.50 కోట్లు) కేటాయించారు. 

స్వచ్ఛ గాలి..
దిల్లీ: దేశంలోని పెద్ద నగరాల్లో వాయు కాలుష్య నియంత్రణకు కేంద్రం రూ.4,400 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది. 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో ప్రజలకు శుభ్రమైన గాలి అందించేందుకు రాష్ట్రాలు రూపొందించే ప్రణాళికలకు ఈ నిధులను విడుదల చేస్తారు. అంతేకాకుండా అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న పాతకాలం నాటి తాప విద్యుత్కేంద్రాలను(థర్మల్‌ పవర్‌ ప్లాంటులు) మూసివేయాలని నిర్మల ప్రతిపాదించారు. కొత్త పథకం జనవరి 1, 2021 నుంచి అమల్లోకి రానుందని ఆమె తెలిపారు. 

రక్షణ బలం



దిల్లీ: రక్షణ రంగానికి నిధుల కేటాయింపు స్వల్పంగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి రూ.3.37లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో (2019-20)లో రక్షణ రంగానికి రూ.3.18లక్షల కోట్లు కేటాయించారు. నాటితో పోలిస్తే ఇప్పుడు 5.63 శాతం మేర కేటాయింపులు పెరిగాయి.
తాజా బడ్జెట్‌లో రక్షణ రంగానికి చేసిన కేటాయింపుల్లో రూ.1.13 లక్షల కోట్లను కొత్త ఆయుధాలు, యుద్ధనౌకలు, విమానాలు ఇతర ఆయుధ సంపత్తి  కొనుగోలు కోసం వెచ్చిస్తారు. గత ఏడాదితో పోలిస్తే ఈ పద్దు కింద రూ.10,340 కోట్లు పెరిగాయి.
పింఛన్లకు రూ.1.33లక్షల కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని బడ్జెట్‌లో చూపలేదు. ఈ పద్దును కూడా కలిపితే రక్షణ బడ్జెట్‌ రూ.4.71 లక్షల కోట్లుగా ఉంది.

కొలువుల కేళీ
దిల్లీ: రెండేళ్ల(2019-21)లో వివిధ విభాగాల్లో 2,62,480 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది. ‘‘మార్చి 1, 2019 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 32,62,908 కాగా.. 2021 మార్చికల్లా ఆ సంఖ్య 35,25,388కి పెరగనుంది’’ అని బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.
2019-21 మధ్య ప్రధాన విభాగాల్లో రాబోయే ఉద్యోగాలు ఇలా..
పోలీసు 79,353,
రక్షణ 22,046
హోంశాఖ 8,200,
సాంస్కృతిక శాఖ 3,886
అంతరిక్షం 3,903,
రెవెన్యూ 3,243
భూవిజ్ఞానశాస్త్రం2,581,
విదేశాంగశాఖ 2,167
పర్యావరణ, అటవీ 2,136,
ఎలక్ట్రానిక్స్‌, ఐటీ 1,347
అణుశక్తి 2,300,
వ్యవసాయం 1,766
సమాచార, ప్రసార  1,600

‘ఎగ్జిట్‌’ పరీక్ష
ఈనాడు, హైదరాబాద్‌: మీ పిల్లలు బీటెక్‌ చదువుతున్నారా?.. అది పూర్తయిన తర్వాత ఆ డిగ్రీకి విలువ ఉండాలంటే ‘ఎగ్జిట్‌’ పరీక్ష పాసవ్వాల్సిందే!. కేంద్ర మానవ వనరుల శాఖ బడ్జెట్‌లో ఈ ప్రతిపాదన చేసింది. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఉండటం లేదని పరిశ్రమలు కొన్నేళ్లుగా చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంచి.. ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి    (ఏఐసీటీఈ) ఆలోచన.  దేశవ్యాప్తంగా ఏటా 7.20 లక్షల మంది బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ సంఖ్య సుమారు 1.50 లక్షల వరకు ఉంది.

న్యూస్‌ప్రింట్‌పై కరుణ
న్యూస్‌ప్రింట్‌పై ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గించింది. గత బడ్జెట్‌లో న్యూస్‌ప్రింట్‌తో పాటు మ్యాగజైన్లకు వాడే తేలికపాటి కోటెడ్‌ కాగితంపై 10 శాతం సుంకాన్ని విధించింది. తాజాగా ఈ రెండింటిపైనా సుంకం తగ్గించింది. న్యూస్‌ప్రింట్‌ దిగుమతిపై కస్టమ్స్‌ సుంకం ప్రింట్‌ మీడియాకు అదనపు భారంగా మారినట్లు అనేక విజ్ఞప్తులు అందాయని.. ఈమేరకు దీన్ని తగ్గించడానికి నిర్ణయించినట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. న్యూస్‌ప్రింట్‌, తేలికపాటి కోటెడ్‌ కాగితంపై విధించిన 10 శాతం సుంకాన్ని రద్దు చేయాలంటూ గతంలో ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

ఎన్‌ఆర్‌ఐకీ పన్ను
ఇప్పటివరకు ఇండియాతోసహా ఏదేశంలోనూ పన్ను చెల్లించని ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐ)లు ఇకపై భారత్‌లో పన్నులు చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈమేరకు ఆదాయ పన్ను చట్టంలో మార్పులు చేసినట్లు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వారికి వచ్చే ఆదాయంపై పన్ను వేస్తామన్నారు.

హోంశాఖకు బోలెడు
కేంద్ర హోంశాఖకు రూ.1,67,250 కోట్ల కేటాయింపు జరిగింది. ఇందులో సింహ భాగం పారామిలటరీ దళాలకు వెళ్లింది. రూ.92,054.53 కోట్లను దీనికోసం కేటాయించారు. జాతీయ విపత్తు సహాయ నిధి కోసం రూ.25వేల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు మాత్రమే ప్రతిపాదించడం గమనార్హం. కేంద్ర మంత్రి మండలి ఖర్చుల కోసం రూ.1140.38 కోట్లు ఇచ్చారు.

అంతటా జన్‌ ఔషధి
పేదలకు నాణ్యమైన మందులను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచేందుకు ఉద్దేశించిన జన్‌ ఔషధి కేంద్రాల పథకాన్ని దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఔషధి కేంద్రాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు వేలు ఉన్నాయి. 2024 నాటికి అన్ని జిల్లాలకు ఈ కేంద్రాలను విస్తరించాలని నిర్ణయించారు. 

ఏసీలూ ప్రియం!
ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, వాషింగ్‌ మెషీన్లు వంటివాటి ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కంప్రెసర్లు, మోటార్లు వంటి విడిభాగాలపై ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకాన్ని పెంచిన నేపథ్యంలో సంబంధిత గృహోపకరణాల ధరలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. 

కశ్మీర్‌పై కనకవర్షం
ఆర్టికల్‌ 370 రద్దుతో కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చూపింది. తాజా బడ్జెట్‌లో రూ.30,757 కోట్లు కేటాయించింది. ఇందులో మౌలిక వసతుల కొరతను తీర్చడానికి రూ.30,478 కోట్లు ఇచ్చింది. మిగిలిన రూ.279 కోట్లను కేంద్రపాలిత ప్రాంత విపత్తు నిర్వహణ నిధికి కేటాయించింది.  లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు కేటాయించింది. 

సీబీఐకి అరకొర పెంపే
ఇప్పటికే పరిమిత సిబ్బందితో ఇబ్బంది పడుతున్న సీబీఐకి నామమాత్రపు పెంపే లభించింది. గత బడ్జెట్‌లో రూ.798 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.802.19 కోట్లతో సరిపెట్టారు. పెంపు కేవలం అర(0.50) శాతం మాత్రమే. 

స్వల్పంగా రాయితీల పెంపు
ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీల కోసం కేటాయించే నిధులను స్వల్పంగా పెంచారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రాయితీల కోసం రూ.2,27,793.89 కోట్లు కేటాయించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను రాయితీపై ప్రజలకు అందించేందుకు రూ.1,15,569.68 కోట్ల కేటాయింపు.
వంట గ్యాసు (ఎల్‌పీజీ), కిరోసిన్‌ తదితర ఇంధనాలపై ఇచ్చే రాయితీ కోసం రూ.40,915.21 కోట్ల కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన అంచనా కంటే ఇది 6శాతం ఎక్కువ. 

జోరుగా సాగిపో..
దిల్లీ: దేశ వ్యాప్తంగా 15,500 కి.మీ. మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని, 9,000 కి.మీ. ఎకనామిక్‌ కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖకు 2020-21లో రూ.91,823.22 కోట్లు కేటాయించింది. 2033 నాటికి దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే, మరో రెండు ప్యాకేజీల నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపడతామన్నారు. 6,000 కిలోమీటర్ల మేర 12 జాతీయ రహదారులను కుదువ పెట్టడం ద్వారా 2024 నాటికి నిధులు సేకరించాలని ప్రతిపాదించారు. 

థర్మల్‌కు మంగళం
దిల్లీ: పునరుత్పాదక ఇంధనాలు, విద్యుత్‌ రంగానికి 2020-21 బడ్జెట్‌లో కేంద్రం రూ.22 వేల కోట్లను కేటాయించింది. ఉద్గారాల కట్టడి నిబంధనలను అందుకోని పాత థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారాలను మూసివేయాలని నిర్ణయించింది. క్రమంగా ‘డీజిల్‌-రహిత వ్యవసాయాన్ని’ సాధించేందుకు ‘పీఎం కుసుమ్‌’ పథకాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. దీనికింద సౌర విద్యుత్‌ను రైతులు ఒడిసిపట్టేలా సాయం చేస్తారు. బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి సంబంధించిన ముఖ్యాంశం.. కర్బన ఉద్గారాలను భారీగా విడుదల చేస్తున్న పాత థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారాలను మూసేయాలి.

బీమా ధీమా కాసింతే
ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి పంటల బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పరిధి రైతుల్లో 28శాతం మందికే పరిహారం అందుతున్నట్లు బడ్జెట్‌లో కేంద్రం వెల్లడించింది. బీమా చేసే విస్తీర్ణం వచ్చే ఏడాది మరో 10% అదనంగా పెంచాలని నిర్ణయించింది. పథకానికి 2019-20లో రూ.13640.85 కోట్లను కేటాయించగా వచ్చే ఏడాది రూ.15695 కోట్లకు పెంచింది. రైతులు కట్టే ప్రీమియం కాకుండా కేంద్రం భరించాల్సిన రాయితీ కింద ఈ నిధులు విడుదల చేయనుంది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న పంటరుణాలపై రాయితీ సొమ్ము చెల్లించేందుకు రూ.21,175 కోట్లను తాజా బడ్జెట్‌లో కేటాయించింది.

ఆధార్‌తో ‘పాన్‌’!
దిల్లీ: పాన్‌ పొందడం ఇక మరింత సులభతరం కానుంది. ఆధార్‌ వివరాలతో తక్షణం ఆన్‌లైన్‌లో పాన్‌ను కేటాయించే విధానాన్ని త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు ఎలాంటి సమగ్ర దరఖాస్తులను పూర్తిచేయాల్సిన అవసరం ఉండదు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

అహ్మదాబాద్‌లో ఐఐహెచ్‌సీ
దిల్లీ: అహ్మదాబాద్‌లో ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్సర్వేషన్‌’(ఐఐహెచ్‌సీ)ను ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఎనిమిది మ్యూజియంల ఏర్పాటుకు రూ.109కోట్లను కేటాయించారు. ప్రస్తుత మ్యూజియాల అభివృద్ధికి రూ.180 కోట్లు కేటాయించారు. రాంచీలో గిరిజన మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదించారు.