ఆర్‌బీఐ పాలసీ రేట్లు పావు శాతం తగ్గింపు

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది.
Current Affairsదీంతో రెపో రేటు 5.15 శాతానికి, రివర్స్ రెపో రేటు 4.9 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 4న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయాలతో గృహ, వాహన, కార్పొరేట్ రుణాలు మరింత చౌక అవుతాయి. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా ఐదోసారి రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు నికరంగా 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం జరిగింది.

పాలసీ సమీక్ష ముఖ్యాంశాలు... 
Current Affairs

  • ఆర్‌బీఐ ఎంపీసీలో ఉన్న ఆరుగురు సభ్యులు కూడా పాలసీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఐదుగురు సభ్యులు పావు శాతం తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, రవీంద్ర ధోలాకియా మాత్రం 0.40 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటేశారు.
  • ఆర్‌బీఐ తన ప్రస్తుత విధానమైన సర్దుబాటు ధోరణిని అలాగే కొనసాగించింది. అంటే పరిస్థితులకు అనుగుణంగా రేట్ల తగ్గింపు నిర్ణయాలకు ఇది వీలు కల్పిస్తుంది.
  • తాజా రేట్ల తగ్గింపు తర్వాత రెపో రేటు 5.15 శాతానికి, రివర్స్ రెపో రేటు 4.9 శాతానికి చేరాయి.
  • క్రితం నాలుగు ఎంపీసీ భేటీల్లో వడ్డీ రేట్లను 110 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, కస్టమర్లకు రుణాలపై ఈ ప్రయోజన బదలాయింపు అస్థిరంగా, అసంపూర్ణంగా ఉందని ఆర్‌బీఐ పేర్కొంది.
  • రెపో రేటు 2010 తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. 2010 మార్చిలో రెపో రేటు 5 శాతంగా ఉంది.
  • దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని తాజాగా పేర్కొంది. గత పాలసీ సమావేశంలో వృద్ధి రేటును ఆర్‌బీఐ 6.9 శాతంగా అంచనా వేసింది.
  • 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పుంజుకుంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
  • అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో పడిపోతున్న వృద్ధిని నిలు వరించేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు (అమెరికా ఫెడ్ సహా) వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
  • 2019-20 రెండో త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అంచనాలను 3.4 శాతానికి ఆర్‌బీఐ ఎంపీసీ సవరించింది. అలాగే, ద్వితీయ ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.5-3.7 శాతం మధ్య ఉంటుందన్న గత అంచనాలనే కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 4 శాతానికే పరిమితం చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం.
  • వ్యవసాయ రంగ పరిస్థితులు ఆశాజనకంగా మారాయని ఎంపీసీ పేర్కొంది. తిరిగి ఉపాధి కల్పనకు, ఆదాయానికి, దేశీయ వృద్ధికి సానుకూలించనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
  • తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 3-5 తేదీల్లో జరుగుతుంది.
రెపో రేటు అంటే... బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు తన వద్ద ఉంచిన నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు.

No comments:

Post a Comment