గ్రూప్స్ లో‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ ప్రాధాన్యత...

త్వరలో జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలోనూ, తెలంగాణలో రానున్న గ్రూప్ 1, 2 పరీక్షల్లోనూ, ఇతర అనేక పోటీ పరీక్షల్లోనూ సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం అంశాల ప్రాధాన్యత పెరుగుతోంది. ఏపీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలోని రెండో పేపర్‌లో సుమారు 30 మార్కులకు గాను ఈ అంశాలకు సంబంధించి అయిదు యూనిట్లు ఉన్నాయి.
Career Guidanceతొలుత బేసిక్స్‌పై పట్టు సాధించి, తర్వాత సమకాలీన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చదివితే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించొచ్చు. అంతేకాకుండా గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించిన అంశాలపైనా పట్టు లభిస్తుంది. గ్రూప్ 1, 2 పరీక్షల్లో ప్రశ్నల సరళి మారుతున్న నేపథ్యంలో ఇలాంటి సబ్జెక్టులను ఎలా చదవాలి? అనే అంశంపై అభ్యర్థులు అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం.
  • కేవలం సమాచారం ఆధారంగా (ఇన్‌ఫర్మేషన్ ఓరియెంటెడ్) ప్రశ్నలు అడుగుతారు అనే ఆలోచనలో మార్పు రావాలి. సమాచారం ఆధారంగా అడిగినప్పటికీ.. కొన్ని ప్రశ్నల సరళిలో మార్పు వచ్చింది. సివిల్స్ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలోపెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి.

పర్యావరణ అంశాలు కూడా..ఏపీ గ్రూప్-1 ప్రిలిమినరీ రెండో పేపర్‌లో పార్ట్ బిలో 5 యూనిట్లలో సిలబస్‌ను పొందుపరిచారు. వీటిలో మొదటి 4 యూనిట్లు సైన్స్, టెక్నాలజీకి సంబంధించినవి. చివరిది పర్యావరణం, జీవ వైవిధ్యం, కాలుష్యం, శీతోష్ణ స్థితి మార్పులు, విపత్తుల నిర్వహణ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యావరణ అంశాలకు సంబంధించినవి.
  • సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను నాలుగు యూనిట్లలో పొందుపరిచారు. మొదటి యూనిట్లో సైన్స్, టెక్నాలజీ అంటే ఏమిటి; దాని పరిధి-దైనందిన జీవితంలో ఉపయోగాలు, దేశ సైన్స్ విధానాలు, నవీకరణ, దేశ పరిశోధన సంస్థలు, ప్రముఖ భారత శాస్తవేత్తలు అనే అంశాలున్నాయి. వీటికోసం తొలుత సైన్స్, టెక్నాలజీ విభాగాలు, వాటి నిర్వచనాలు, మనిషికి చేకూరే ప్రయోజనాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన వాటిపై కూడా దృష్టిసారించాలి. ఉదాహరణకు బయోటెక్నాలజీలో ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న జీన్ ఎడిటింగ్, చైనాలో దానిపై నెలకొన్న వివాదం; బయో సిమిలర్స్, మూల కణాల చికిత్స (కార్డ్ బ్యాంకింగ్), దేశంలోకి అందుబాటులోకి వచ్చిన రోటా వ్యాక్సిన్ వంటి దేశీయ టీకాలు, బయో ఇన్ఫర్మేటిక్స్ వంటి వాటిపై దృష్టిపెట్టాలి. ఇదే విధానాన్ని ఐటీ, స్పేస్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, అణుశక్తి, ఎలక్ట్రానిక్స్, బయోనిక్స్, రక్షణ రంగ టెక్నాలజీకి కూడా వర్తింపజేయాలి.
  • దైనందిన జీవితంలో మనం ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లు, వైద్య రంగ డయాగ్నస్టిక్ పరికరాలు (ఎంఆర్‌ఐ, సిటీ, యూఎస్ స్కానింగ్‌లు), వ్యాధి నిర్ధారణ పద్ధతులు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు వంటి వాటిపై సమాచారాన్ని సేకరించుకోవాలి.
  • 1958, 1983, 2003, 2013లో భారత్ విడుదల చేసిన సైన్స్ విధానాలతోపాటు బయోటెక్నాలజీ, ఐటీ, నానో టెక్నాలజీ విధానాలను, వాటి లక్ష్యాలను అధ్యయనం చేయాలి. నవీకరణ అంటే ఏమిటి? దాని విధానాలు, నవీకరణను ప్రోత్సహించేందుకు భారత్ ఇప్పటికే నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవాలి. జాతీయ నవీకరణ నిధి, ఐఐజీపీ 2.0, ఇంప్రింట్ నిధి, ప్రయాస్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, మిషన్ ఇన్నోవేషన్ లాంటి కార్యక్రమాలను చదవాలి.
  • ప్రాచీన కాలం నాటి శుశ్రుతుడు, చరకుడు, ఆర్యభట్ట మొదులుకొని... అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయి, సి.వి.రామన్ వరకూ... అదే విధంగా ప్రస్తుత కాలం నాటి టెస్సీ థామస్, వాలార్మతీ వరకూ భారత శాస్త్రవే త్తలు, భారత్ సాధించిన కీలక విజయాలను చదువుకోవాలి. నోబెల్ పురస్కారం పొందిన భారతీయ శాస్త్రవేత్తలు, ఇటీవల కాలంలో భట్నాగర్ అవార్డులు, అంతర్జాతీయ సైన్స్ అవార్డులు పొందిన భారత శాస్త్రవేత్తల సమాచారం తెలుసుకోవాలి.

ఐసీటీ అంశాలు : రెండో యూనిట్‌లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అంశాలు ఉన్నాయి. వ్యవసాయం, వైద్యం, విద్య, పారిశ్రామిక, వాణిజ్య, సాంకేతిక పరిశోధన, నెట్‌వర్కింగ్, విపత్తు నిర్వహణ రంగాల్లో ఐసీటీ ద్వారా పొందుతున్న సేవల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ-నామ్, డిజిటల్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల ఈ-గవర్నెన్స్ కార్యక్రమాల (మీసేవ, మీకోసం, ఈ-ప్రగతి)పై అవగాహన పెంపొందించుకోవాలి. ఇక్కడే ప్రస్తుతం వార్తల్లో ఉన్న బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఐవోటీ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. దేశ ఐటీ, బీపీఎం రంగాల ప్రగతికి సంబంధించి నాస్‌కామ్ నివేదికలను చదవాలి. దేశ ఐటీ విధానంలో సైబర్ భద్రత విధానంపై దృష్టిసారించాలి. ఇటీవల కాలంలో సైబర్ ముప్పుగా వార్తల్లో ఉన్న ఫిషింగ్, రాన్సమ్‌వేర్ (పెట్యా, వన్నాక్రై) వంటి వాటిపై సమాచారం సేకరించుకోవాలి. బ్లాక్‌చైన్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్స్ తెలుసుకోవాలి. అంతర్జాల నియమావళిగా నెటికెట్ గురించి అవగాహన అవసరం.

అంతరిక్ష కార్యక్రమం : మూడో యూనిట్‌లో భారత అంతరిక్ష కార్యక్రమాన్ని సిలబస్‌లో పొందుపరిచారు. భారత అంతరిక్ష కార్యక్రమం ప్రారంభ దశ, వ్యవస్థాపక అంశాలను, పరిశోధనలను, మొదటి ప్రయోగాలను చదువుకోవాలి. కార్యాచరణ దశలో భాగంగా.. ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్, నావిక్, గగన్ వ్యవస్థలను; పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ నౌకల అభివృద్ధి, నిర్మాణం, రకాలు, గత రెండేళ్ల ప్రయోగాల సమాచారాన్ని తెలుసుకోవాలి. రోదసీ అన్వేషణలో భాగంగా చంద్రయాన్-1, చంద్రయాన్-2, మంగళయాన్, ఆస్ట్రోశాట్, ఆదిత్య ఎల్-1, గగన్‌యాన్‌ల గురించి అవగాహన పెంచుకోవాలి. గత రెండేళ్లలో భారత్ ఏఏ దేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించిందన్న అంశంపై దృష్టిపెట్టాలి. కీలక ప్రయోగాలైన పీఎస్‌ఎల్‌వీ-సీ37, జీశాట్-29, జీశాట్-11ల గురించి అవగాహన పెంచుకోవాలి. సమకాలీన విదేశీ అంతరిక్ష కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ హెవీ, నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్, చైనాకు చెందిన చాంగే 4 వంటి వాటిని ఏమాత్రం విస్మరించకూడదు.
  • ఇదే యూనిట్‌లో డీఆర్‌డీవో కార్యకలాపాలను ప్రస్తావించారు. దేశంలో ఇప్పటి వరకూ అభివృద్ధి చేసిన క్షిపణులు, వాటి పరిధి, పేలోడ్ సామర్థ్యం, గత రెండేళ్ల పరీక్షలు, ఇతర ప్రయోగాల గురించి చదువుకోవాలి.ముఖ్యంగా అగ్ని 4, అగ్ని 5, అస్త్ర, బ్రహ్మోస్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వంటి వాటిపై దృష్టిసారించాలి. అదనంగా దేశ నావికా దళానికి సంబంధించిన వివిధ యుద్ధ నౌకలు, జలాంతర్గాములపై సమాచారం సేకరించుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో అనుబంధ సంస్థల గురించి తెలుసుకోవాలి.

శక్తి వనరులు : నాలుగో యూనిట్‌లో పూర్తిగా శక్తి వనరులు అంశాలను ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో శక్తి వనరుల వర్గీకరణ, వాటి లభ్యత, స్థాపిత సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. దేశం పూర్తిస్థాయి విద్యుదీకరణ దిశగా విజయం సాధించిన నేపథ్యంలో.. విద్యుదీకరణ కార్యక్రమాలు, ఉదయ్, సౌభాగ్య, కుసుం, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనపై సమాచారం అవసరం. దేశ శక్తి విధానాలు, మార్పులు, డిమాండ్‌లు, కొరత, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన అంశాలను వీలైనంత విస్తృతంగా చదువుకోవాలి. పునరుత్పాదక, నవీన శక్తి వనరులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. సౌర, పవన, జీవశక్తి, చిన్నతరహా జల విద్యుత్, వ్యర్థాల నుంచి విద్యుత్‌తో పాటు జియోథర్మల్, ఓషన్ థర్మల్, టైడల్, హైడ్రోజన్ శక్తి వంటి నవీకరణ శక్తి వనరుల గురించి తెలుసుకోవాలి. ఇదే తరుణంలో ఫ్యూయెల్ సెల్, బ్యాటరీ వాహనం ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. జాతీయ సౌర మిషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. జీవ ఇంధనాలు, రకాలు, జాతీయ బయోడీజిల్ కార్యక్రమం గురించి తెలుసుకోవాలి.

అణుశక్తి : అణుశక్తి మరో ముఖ్యమైన అంశం. దేశంలో అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోని కేంద్రాల సమాచారాన్ని సేకరించి, అధ్యయనం చేయాలి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఎక్కడ రియాక్టర్లు ఉన్నాయి? వాటి సామర్థ్యం ఎంత? తదితరాల గురించి తెలుసుకోవాలి. కొత్తగా ప్రణాళిక పూర్తయిన రియాక్టర్లను ఏఏ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారో తెలుసుకోవాలి. దేశ అణుశక్తి విధానం, వాసెనార్ ఒప్పందం, సీటీబీటీ, ఎన్‌పీటీ, ఎంటీసీఆర్, ఐఏఈఏ, ఐసీఎఎన్, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, అణు పరిహార చట్టం గురించి తెలుసుకోవాలి.

No comments:

Post a Comment