జులై - 23
|
కర్ణాటకలో 14 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ - జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. 204 మంది సభ్యులు సభకు హాజరు కాగా విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 105 ఓట్లు, అనుకూలంగా 99 ఓట్లు నమోదవడంతో పాలకపక్షం సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించారు. సీఎం కుమారస్వామి తన రాజీనామాను గవర్నర్ వజూభాయి వాలాకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లాలపై ఆధిపత్యానికి మొదలైన అసమ్మతి చివరకు ప్రభుత్వ పతనానికి దారి తీసింది. గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్ఖిహొళితో మొదలైన అసమ్మతి జులై 1న తీవ్రరూపం దాల్చింది. హొసపేట ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ రాజీనామా తరువాత కాంగ్రెస్- జేడీఎస్ సభ్యులు 14మంది రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగే పరిస్థితి కనిపించలేదు. 2018 మే 23న ఏర్పాటైన ప్రభుత్వం 2019 జులై 23న వైదొలగాల్సి వచ్చింది. 2018 మే 15న కర్ణాటక విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ ఆధిక్యం దక్కలేదు. 104 స్థానాలు సాధించిన భాజపా మే 17 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నా తర్వాత మిత్రపక్షాల పొత్తుకు తలొగ్గింది. 78 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, 37 స్థానాలతో ఉన్న జేడీఎస్, ఇద్దరు స్వతంత్రులు, బీఎస్పీ సహకారంతో సంకీర్ణ కూటమి ఏర్పాటైంది.
దేశంలో 2001-11 మధ్య 80 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 12.7 కోట్ల మంది రైతులుండగా 2011 నాటికి 11.8 కోట్లకు తగ్గినట్లు మంత్రి వివరించారు. వీరంతా ఏ రంగానికి మళ్లారన్నది తెలియదని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, అసోంలలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయదారులు తగ్గినట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2001లో రైతుల సంఖ్య 70.86 లక్షలు ఉండగా 2011 నాటికి 60.49 లక్షలకు తగ్గిపోయింది. మహారాష్ట్రలో ఈ పదేళ్లలో 7.6 లక్షల మంది రైతులు పెరిగారు. కార్మిక సంస్కరణల్లో భాగంగా కేంద్రం లోక్‌సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. ఇవి చట్టరూపం దాలిస్తే ప్రస్తుతమున్న 17 చట్టాలు వీటిలో కలిసిపోతాయి. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య, పనిచేసే పరిస్థితుల (ఓఎస్‌హెచ్) బిల్లును, వేతనాల బిల్లును కార్మికమంత్రి సంతోష్ గంగ్వార్ ప్రవేశపెట్టారు. ప్రధానాంశాలు: » సినిమా, థియేటర్లలో డిజిటల్ దృశ్య-శ్రవణ కార్మికులు, అన్నిరకాల ఎలక్టాన్రిక్ మీడియా ఉద్యోగుల పని పరిస్థితులు ఒకే గూటికి వస్తాయి. ఈ-పేపర్, రేడియో, ఇతర మీడియాలలో పనిచేసే పాత్రికేయులను కూడా ఎలక్టాన్రిక్ మీడియాలోకి చేరుస్తుంది. » కుటుంబ యజమాని మీద ఆధారపడిన తాత/అవ్వలను కూడా కుటుంబంలో భాగంగానే గుర్తిస్తారు. » ఉద్యోగులకు వార్షిక ఆరోగ్య పరీక్షలను యజమాని ఉచితంగా చేయించాలి, ప్రతి ఉద్యోగికి నియామకపత్రం తప్పనిసరిగా ఇవ్వాలి. » పిల్లల సంరక్షణ కేంద్రం, క్యాంటీన్, ప్రాథమిక చికిత్స, సంక్షేమాధికారి మొదలైనవన్నీ ఒకే చట్టంలోకి తెస్తారు. » మహిళా ఉద్యోగులు రాత్రిపూట కూడా పనిచేయవచ్చు. అందుకు వారి అనుమతి, భద్రత, సెలవులు, పనిగంటల లాంటి నిబంధనలుంటాయి. » కనీస వేతనాలు ప్రస్తుతమున్న 40% మందికి కాకుండా 100% మందికీ వర్తిస్తాయి.
పిల్లలపై అత్యాచారానికి మరణశిక్ష, ఇతర నేరాలకు కఠిన శిక్షలు విధించేలా పోక్సో చట్టానికి సవరణలు ప్రతిపాదించే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణలతో పిల్లలపై అత్యాచారాలు, ముఖ్యంగా సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష తప్పదని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. బాలల నీలిచిత్రాలను అరికట్టేందుకు జరిమానాలు, జైలుశిక్షలను కూడా ఈ సవరణ ప్రతిపాదిస్తుంది.
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభలో తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ 2018 జులై 17న శాసనసభ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఎన్డీఏ-2 ప్రభుత్వంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పార్లమెంట్ ఆమోదించింది. ద్రవ్యవినియోగ బిల్లు, ఆర్థిక బిల్లులు ఇంతకుముందే లోక్‌సభ ఆమోదం పొందగా, రాజ్యసభ తాజాగా మూజువాణి ఓటుతో ఆమోదించింది. |
Latest News
కరెంట్ అఫైర్స్ జులై - 23
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment