జులై - 22
|
జాతీయ, వివిధ రాష్ట్రాల మానవహక్కుల కమిషన్లలో ఛైర్‌పర్సన్లు, సభ్యుల నియామక ప్రక్రియను వేగవంతం చేసే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లోక్‌సభ జులై 19న ఆమోదించిన మానవహక్కుల పరిరక్షణ (సవరణ) బిల్లు తాజాగా రాజ్యసభ ఆమోదం పొందింది. ప్రస్తుతం ఛైర్‌పర్సన్ల పదవీకాలం అయిదేళ్లుగా ఉండగా, దీన్ని మూడేళ్లకు తగ్గించారు. ప్రస్తుతం జాతీయ మానవహక్కుల కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఛైర్‌పర్సన్‌గా ఉండేందుకు అర్హులు కాగా, సవరణ అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా అందుకు అర్హులు కానున్నారు.
సమాచార హక్కు చట్టానికి చేసిన సవరణలను మూజువాణి ఓటు ద్వారా లోక్‌సభ ఆమోదించింది. సమాచార కమిషనర్లకు ప్రస్తుతం ఎన్నికల సంఘం కమిషనర్లతో సమానమైన హోదా ఉండగా దాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది. వారి జీతభత్యాలు, సర్వీసు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడిగా రూపొందించనుంది. ప్రతి ఇంటికీ 2024 నాటికి మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రకటించిన ‘హర్ ఘర్ జల్' పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు సగం నిధులను సమకూర్చనున్నాయి. ఈ పథకం అమలుకు రానున్న అయిదేళ్లలో రూ.3,60,000 కోట్లు ఖర్చు కానుండగా, అందులో సగం అంటే రూ.1,80,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 నిష్పత్తి మేరకు నిధులు సమకూర్చనున్నాయి. 8 ఈశాన్య రాష్ట్రాలు, 3 హిమాలయ రాష్ట్రాలు (ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్ము-కశ్మీర్)లకు మాత్రం దీన్నుంచి మినహాయింపు కల్పించారు. ఆ రాష్ట్రాల్లో 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు ఇస్తే సరిపోతుంది. జాతీయ వైద్యకమిషన్ అమల్లోకి వచ్చిన మూడేళ్లలోపు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్) అమల్లోకి రానుంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో జాతీయ వైద్యకమిషన్ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలో వైద్యవిద్య క్రమబద్ధీకరణ కోసం భారతీయ వైద్యమండలి చట్టం స్థానంలో జాతీయ వైద్యకమిషన్ ఏర్పాటుకు ఈ బిల్లును ఉద్దేశించారు. కొత్త బిల్లు ప్రకారం ఎంబీబీఎస్, పీజీ వైద్యకళాశాలల్లో 50% సీట్లకు ఫీజులను ప్రభుత్వం నియంత్రిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీబీఎస్ విద్యార్థులకు చివరి సంవత్సరం నెక్స్ట్ ఉమ్మడిపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి వైద్యులుగా పనిచేసే లైసెన్సు, పీజీ ప్రవేశార్హత, జాతీయ, రాష్ట్ర రిజిస్టర్‌లో పేర్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. అలాగే విదేశాల్లో వైద్యవిద్య చదివినవారు దేశంలో వైద్యులుగా పనిచేయాలన్నా ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్లలోపు ఇది కార్యరూపంలోకి వస్తుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత వైద్యవిద్య, వైద్యవృత్తి, వైద్య విద్యాసంస్థల నియంత్రణకు కేంద్రం జాతీయ వైద్యమండలిని ఏర్పాటుచేస్తుంది. వైద్యరంగంలో 25 ఏళ్ల అనుభవం, పదేళ్లపాటు వైద్యవ్యవస్థకు నాయకత్వం వహించిన వ్యక్తిని ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమిస్తారు. పదిమంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 14 మంది పార్ట్‌టైమ్ సభ్యులతో ఇది పనిచేస్తుంది. కొత్త వైద్యకళాశాలలు, పీజీ కోర్సుల ప్రారంభం, కళాశాలల్లో సీట్లపెంపు అధికారాలన్నీ కమిషన్‌కే ఉంటాయి. వైద్యులుగా పనిచేయడానికి అర్హత సాధించినవారి పేర్లు, చిరునామాలు, విద్యార్హలతో కూడిన జాతీయ రిజిస్టర్‌ను ఇదే నిర్వహిస్తుంది. దీనికింద నాలుగు స్వయంప్రతిపత్తి పాలకమండళ్లు ఉంటాయి. యూజీ, పీజీ వైద్యవిద్య ప్రమాణాల నిర్ధారణ కోసం వేర్వేరు వైద్యవిద్య బోర్డులు ఉంటాయి. వైద్యకళాశాలలను తనిఖీచేసి పరిస్థితులను పరీక్షించడానికి మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఉంటుంది. వైద్యనిపుణుల ప్రవర్తన నియంత్రణతో పాటు, వారిలో వైద్యవిలువలను ప్రోత్సహించడం, లైసెన్స్ పొందిన మెడికల్ ప్రాక్టీషనర్ల పేర్లతో కూడిన జాతీయ రిజిస్టర్ నిర్వహణకు ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటవుతుంది. ఈ చట్టం అమల్లోకి రాగానే భారతీయ వైద్యమండలి చట్టం-1956 రద్దవుతుంది. ఆధునిక వైద్యవృత్తితో సంబంధం ఉన్నవారు కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లుగా పనిచేసేందుకు ఈ కమిషన్ లైసెన్సులు ఇస్తుంది. వైద్యుల సంఖ్యలో మూడింట ఒక వంతుకు మించకుండా వీరికి లైసెన్సులిస్తారు. |
చిన్న వ్యాపారుల పింఛను పథకాన్ని కేంద్ర కార్మిక శాఖ ప్రారంభించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎల్‌ఐసీ నేతృత్వంలో పింఛను నిధిని ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్నవారు దేశవ్యాప్తంగా కేంద్ర ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 3.50 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. రూ.1.5 కోట్లలోపు వార్షిక వ్యాపార టర్నోవర్ ఉన్న వ్యాపారులంతా ఇందులో చేరొచ్చు. వ్యాపారి చెల్లించే చందాకు సమానంగా కేంద్రం కూడా పింఛను నిధికి జమ చేస్తుంది. 60 ఏళ్ల నుంచి ఆ వ్యక్తి జీవించి ఉన్నంత కాలం నెలకు రూ.3వేల పింఛను అందుకోవచ్చు. మరణానంతరం జీవిత భాగస్వామికి 50% మొత్తం చెల్లిస్తారు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కరూ తమకు 60 ఏళ్లు వచ్చేంత వరకూ నెలవారీ చందా చెల్లించినప్పుడే రూ.3వేల కుటుంబ పింఛను అందుకునేందుకు (60 ఏళ్ల తర్వాత) అర్హులవుతారు. సొంతంగా వ్యాపారాలు చేస్తున్నవారు, దుకాణ యజమానులు, రిటైల్ వ్యాపారులు, రైస్‌మిల్లు, ఆయిల్ మిల్లు, వర్క్‌షాప్ ఓనర్లు, కమీషన్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, చిన్నచిన్న హోటల్, రెస్టారెంట్ల యజమానులు, ఇతర చిన్న వ్యాపారులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. |
No comments:
Post a Comment