కరెంట్ అఫైర్స్ జులై - 19

జులై - 19
రాష్ట్రీయం (టీఎస్‌)ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోని వ్యవసాయ వర్సిటీల్లో మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 6వ ర్యాంకు లభించింది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) రెండేళ్లకొకసారి వర్సిటీల పనితీరును మొత్తం 33 అంశాల్లో మదింపు వేసి, ర్యాంకులను ప్రకటిస్తుంది. గతేడాదికి (2018) సంబంధించిన ర్యాంకులను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ దిల్లీలో విడుదల చేశారు. 2016లో దేశవ్యాప్తంగా 12వ ర్యాంకులో ఉన్న జయశంకర్‌ వర్సిటీ స్థాయి రెండేళ్లలోనే 6 కు పెరిగింది.
రాష్ట్రీయం (ఏపీ
ఆంధ్రప్రదేశ్‌లో రూ.100కోట్ల పైన విలువజేసే పనులకు సంబంధించిన టెండర్లన్నింటినీ న్యాయ పరిశీలన పరిధిలోకి తీసుకురానున్నారు. దీనికోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది. హైకోర్టు జడ్జి లేదా విశ్రాంత జడ్జి నేతృత్వంలో టెండర్లను పరిశీలిస్తారు. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ నవోదయం కింద కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలవారీగా 86 వేల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేలా రూ.4వేల కోట్లతో రుణాలను వన్‌టైం రీస్టక్చ్రర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) చట్టాన్ని రద్దు చేసి దాని స్థానే కొత్త చట్టం తీసుకొచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయించింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, పర్యవేక్షణ, ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్య నియంత్రణ దీని లక్ష్యాలు.
రాష్ట్రంలో 11,114 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు కొత్తగా 91,652 ఉద్యోగుల నియామకానికి అనుమతించింది. పంచాయతీ కార్యాలయాన్ని ఇక గ్రామసచివాలయంగా పరిగణిస్తారు. రెండు వేల జనాభాకు మించి నాలుగువేల కంటే తక్కువ ఉన్న గ్రామపంచాయతీని ఒక సచివాలయంగా గుర్తిస్తారు. ఇంతకుమించి జనాభా ఉన్న గ్రామపంచాయతీల్లో రెండు నుంచి మూడు సచివాలయాలను ఏర్పాటుచేస్తారు. రెండువేల జనాభాకంటే తక్కువ ఉంటే ఒకటి, రెండు కలిపి ఒక సచివాలయంగా ఏర్పాటుచేస్తారు. ఉద్యోగుల నియామక ప్రక్రియపై నిర్ణయాలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ ఛైర్మన్‌గా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరిస్తారు. జులై 23 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఉద్యోగుల నియామకం చేపడతారు. సెప్టెంబరు 16 నుంచి 28 మధ్య ఎంపికైన ఉద్యోగులకు శిక్షణనిస్తారు. 20నాటికి తగిన సౌకర్యాలతో సచివాలయాలను సిద్ధం చేస్తారు. ఉద్యోగులకు 30న సచివాలయాలను కేటాయిస్తారు. అక్టోబరు 2 నుంచి సచివాలయాలు అమల్లోకివస్తాయి.

No comments:

Post a Comment