కరెంట్ అఫైర్స్ జులై - 19

జులై - 19
మైనార్టీ వర్గాలను ఏ విధంగా గుర్తించి, నిర్వచించాలో సలహాలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ను కోరింది. దేశ జనాభా ఆధారంగా కాకుండా ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికగా మైనార్టీ వర్గాలను గుర్తించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. భాజపా నాయకుడు అశ్విన్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది.
నగదు డిపాజిట్ల అక్రమ సేకరణను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘అనియంత్రిత డిపాజిట్ల పథకాల నిషేధ బిల్లు-2019'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డిపాజిట్లు సేకరిస్తే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి కనీసం ఏడాది నుంచి రెండు, మూడు, అయిదు, ఏడు, పదేళ్ల వరకు శిక్షలు ఉంటాయి. రూ.2 లక్షల నుంచి రూ.25 కోట్ల వరకుగానీ, ఎగవేసిన సొమ్ముకు మూడు రెట్లుగానీ జరిమానా విధించవచ్చు.
సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్లతో సమాన హోదాను ఉపసంహరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనికింద సమాచార కమిషనర్ల వేతనాలు, సర్వీసు నిబంధనలను నిర్ధరించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. సమాచార హక్కు (సవరణ) బిల్లు-2019ను ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రవేశపెట్టారు. ముఖ్య సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల పదవీకాలం, వేతనాలు, భత్యాలు, ఇతర అంశాలు, నిబంధనలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో ఉండాలని తాజా సవరణ చెబుతోంది. ప్రస్తుతం ముఖ్య సమాచార కమిషనర్‌ వేతనాలు, భత్యాలు, ఇతర నిబంధనలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ స్థాయిలో ఉన్నాయి. సమాచార కమిషనర్ల వేతనాలు ఎన్నికల కమిషనర్ల స్థాయిలో ఉన్నాయి.
పేద మహిళలకు ఉచితంగా వంటగ్యాస్‌ కనెక్షన్లు అందించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఉజ్వల' పథకానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ప్రశంసలు లభించాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో, మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పథకం భారీ విజయాన్ని సాధించిందని ఐఈఏ ప్రశంసించింది. ‘దేశంలో అందరికీ 2020 నాటికి వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడం కేవలం ఇంధనానికి సంబంధించిన అంశమే కాదు. అది ఆర్థిక, సామాజిక అంశం' అని ఐఈఎ కార్యనిర్వాహక సంచాలకుడు ఫెతీ బిరోల్‌ అన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై తొమ్మిది నెలల్లో తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు లఖ్‌నవూలోని ప్రత్యేక న్యాయస్థానం జడ్జిని ఆదేశించింది. సాక్ష్యాల నమోదును ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేక న్యాయమూర్తి సెప్టెంబరు 30న పదవీ విరమణ చేయనున్నందున కేసు విచారణ పూర్తయ్యేవరకు ఆయన సేవలను పొడిగిస్తూ నాలుగు వారాల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన సేవల పొడిగింపు కేవలం ఈ కేసుకు మాత్రమే పరిమితం కావాలని సూచించింది. విచారణ గడువును ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ ప్రత్యేక న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసుపై రెండేళ్లుగా రోజువారీ విచారణ జరుగుతోంది.
ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువుల్లో కొలిస్టిన్‌ మందు, దాని ఫార్ములేషన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆహారంగా వినియోగించే జంతువులు, కోళ్లు, మత్స్య ఉత్పత్తుల పెంపకంలో, వాటి ఆహారం కోసం ఉపయోగించే ఉప ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించడానికి వీల్లేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాల్లో న్యూమోనియా, బ్యాక్టెరిమియా ఇన్‌ఫెక్షన్స్‌తో చికిత్స పొందే రోగులకు చివరి అవకాశంగా కొలిస్టిన్‌ ఇస్తుంటారు. ఇప్పుడు దీన్ని పశువుల్లో విరివిగా వాడుతుండటంతో ఆహార ఉత్పత్తుల్లో దాన్ని ఎదుర్కొని నిలిచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడం వల్ల కొలిస్టిన్‌ మనుషులపై సమర్థంగా పని చేయడం లేదని గుర్తించారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చట్టానికి చేసిన సవరణలను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ప్రవేశపెట్టారు. ఈ మేరకు జాతీయ, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమిషన్ల ఛైర్‌పర్సన్ల పదవీ కాలం ప్రస్తుతం అయిదేళ్లు ఉండగా, దాన్ని మూడేళ్లకు తగ్గించారు. ఇంతవరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్లుగా సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులను, రాష్ట్రాల కమిషన్ల ఛైర్‌పర్సన్లుగా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులను మాత్రమే నియమించే అవకాశం ఉంది. దానికి బదులు సుప్రీంకోర్టు, హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తులను కూడా నియమించే అవకాశం కల్పించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్ల ఛైర్‌పర్సన్లు ఇంతవరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీలో సభ్యులుగా ఉండగా, ఇకపై ఓబీసీ, బాలల హక్కులు, దివ్యాంగుల కమిషన్ల ఛైర్‌పర్సన్లు కూడా సభ్యులుగా ఉంటారు. పౌర సమాజం నుంచి కూడా సభ్యులను నియమిస్తారు. కమిషన్‌కు మరిన్ని ఆర్థిక, పరిపాలనపరమైన అధికారాలు కల్పించారు.

No comments:

Post a Comment