కరెంట్ అఫైర్స్ జులై - 17

జులై - 17
నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారాన్ని పాకిస్థాన్‌ పునఃసమీక్షించే వరకు మరణశిక్షను నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఐసీజేలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చారు. భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే, జాదవ్‌ను విడుదల చేయాలన్న భారత్‌ అభ్యర్థనను ఐసీజే తిరస్కరించింది. జాదవ్‌ను అప్పగించాలనే వాదనలను తోసిపుచ్చింది. 2016లో పాకిస్థాన్‌ భద్రతా దళాలకు చిక్కిన 49 ఏళ్ల కుల్‌భూషణ్‌ గూఢచర్యం, ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ ఆ దేశ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే ఏడాది మే 8న ఐసీజేను ఆశ్రయించింది. ఆయన ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అక్రమంగా నిర్బంధించినట్లు తెలిపింది. న్యాయమూర్తి అబ్దుల్‌ఖవి అహ్మద్‌ యూసుఫ్‌ నేతృత్వంలోని పది మంది సభ్యుల ధర్మాసనం తాము తుది తీర్పు ఇచ్చేవరకూ మరణశిక్ష అమలును నిలిపివేయాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గత ఫిబ్రవరిలో విచారణ చేపట్టి, ఉభయ దేశాల వాదనలు వింది. తాజాగా మళ్లీ విచారణ చేపట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్‌ మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది.

No comments:

Post a Comment