కరెంట్ అఫైర్స్ జులై - 16

జులై - 16
ఆకలితో అల్లాడుతున్న వారి సంఖ్య 2018లో 82 కోట్లకు పైగా చేరిందని ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార పరిస్థితి 2019' పేరిట న్యూయార్క్‌లో విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో 100 కోట్ల మందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ‘ఆకలి' క్రమేపీ తగ్గినా 2015లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితులన్నీ 2030 నాటికి ఆకలి లేకుండా చేయాలనే సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి పెద్ద సవాల్‌గా ఐరాస పేర్కొంది. గత మూడేళ్లుగా ఆకలితో అలమటిస్తున్న వారు 11 శాతానికి అటూ ఇటూగా ఉన్నారు. ఆహార భద్రత లేని చోట క్షుద్బాధ పడేవారు ఎక్కువగా ఉండగా ఒక మాదిరిగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఆహార నాణ్యత విషయంలో రాజీ పడాల్సి వస్తోంది. ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మంది ఒక మాదిరి లేదా తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారిలో 51.3 కోట్ల మంది ఆసియాలో, 25.6 కోట్ల మంది ఆఫ్రికాలో ఉన్నారు. » భారత్‌లో ఆకలి సమస్య 12 ఏళ్లలో తగ్గుముఖం పట్టింది. 2004-06 మధ్యకాలంలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడే వారి సంఖ్య 25.39 కోట్లు (జనాభాలో 22.2 శాతం). ఆ సంఖ్య 2016-18 నాటికి 19.44 కోట్లకు (14.5 శాతం) తగ్గింది. అదే సమయంలో ఊబకాయుల (18 ఏళ్లకు పైబడిన వారు) సంఖ్య పెరిగింది. 2012లో ఇలాంటి వారు 2.41 కోట్ల మంది ఉంటే 2016 నాటికి ఆ సంఖ్య 3.28 కోట్లకు పెరిగింది. 2018 నాటికి అధిక బరువుతో బాధపడుతున్న పిల్లలు 29 లక్షల మంది ఉన్నారు. » ఊబకాయం, అధిక బరువు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మరణాలకు కారణమవుతున్నాయి. ఊబకాయ సమస్య ఉన్న బడిఈడు పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు 33.8 కోట్లు. పెద్దలు 67.2 కోట్ల మంది. » ఆఫ్రికా, ఆసియా ఖండాల కంటే మిగతా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వేగంగా పెరుగుతున్న ‘అధిక బరువు' ప్రపంచానికి ఆరోగ్య సమస్యగా మారుతోంది. » బడిఈడు పిల్లల్లో చాలామంది తగినంతగా పళ్లు, కూరగాయలు తినకపోవడం; తరచూ ఫాస్ట్‌ఫుడ్, కార్బొనేటెడ్‌ పానీయాలు తాగడంతో పాటు, రోజువారీ శారీరక శ్రమ లేకపోవడం లాంటివి ఊబకాయానికి దారితీస్తున్నాయి. దేశంలో అత్యధిక సంఖ్యలో దంపతులున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందు వరసలో నిలిచాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో, తెలంగాణ అయిదో స్థానంలో ఉన్నాయి. తెలంగాణకు చెందిన మగవారిలో 48.1%, ఆడవారిలో 52.1% మంది వివాహితులు ఉన్నారు. అత్యధికంగా వివాహితులున్న ఆంధ్రాలో జీవిత భాగస్వామిని కోల్పోయినవారు, లేక వారి నుంచి ఎడబాటుకు గురైనవారు (డబ్ల్యూడీఎస్‌) కూడా ఎక్కువే. దేశ జనాభాలో ఇలాంటివారు 3.7% కాగా ఆంధ్రప్రదేశ్‌లో 5.1%, తెలంగాణలో 4.7% మంది ఉన్నారు. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌)-2017 గణాంకాల విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2021 జనాభా లెక్కలకు ముందస్తుగా చేపట్టిన ఈ సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలుశాఖ ఇటీవల విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు » దేశ జనాభాలో 46.8% మంది వివాహితులు ఉన్నారు. అన్ని రాష్ట్రాల కంటే అధికంగా 54% మంది వివాహితులతో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాలను వరుసగా కేరళ (51.5%), తమిళనాడు (51.2%), పశ్చిమ్‌ బంగ (51.1%) ఆక్రమించాయి. తెలంగాణ అయిదో స్థానంలో నిలిచింది. » ఎస్‌ఆర్‌ఎస్‌ 2017 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుషుల్లో 52.5% మంది, మహిళల్లో 55.6% మంది వివాహితులు. తెలంగాణకు చెందిన మగవారిలో 48.1%, ఆడవారిలో 52.1% మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. దేశంలోనే అత్యంత తక్కువగా బిహార్‌ జనాభాలో 41.2% మంది మాత్రమే వివాహితులు ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే డబ్ల్యూడీఎస్‌ బాధితుల్లో ఎక్కువమంది తమిళనాడు (5.7%), కేరళ (5.6%)కు చెందినవారే! జాతీయ స్థాయిలో చూసినా భాగస్వామిని కోల్పోయి లేదా ఎడబాటుకు గురైనవారిలో మహిళలే ఎక్కువ. ఇలాంటి బాధితులు మగవారిలో సగటున 1.7% మంది ఉంటే, ఆడవారిలో 5.9% మంది ఉన్నట్టు ఎస్‌ఆర్‌ఎస్‌ విశ్లేషించింది.

No comments:

Post a Comment