కరెంట్ అఫైర్స్ జులై - 15

జులై - 15
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాబిల్లి యాత్ర ‘చంద్రయాన్‌-2' ఆగిపోయింది. వాహకనౌక ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3'లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది.
       » 
అంతా సజావుగా సాగి ఉంటే జులై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు షార్‌ నుంచి ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3-ఎం1' వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండేది. తర్వాత 16.13 నిమిషాల వ్యవధిలో చంద్రయాన్‌-2ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఉండేది.జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏ) మరిన్ని అధికారాలు కల్పించేలా ప్రస్తుత చట్టానికి చేసిన సవరణలను లోక్‌సభ ఆమోదించింది. దీని ప్రకారం - భారతీయులు, భారతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా దేశం వెలుపల ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా విచారణ చేపట్టే అధికారం ఎన్‌ఐఏకి ఉంది. నేరాలపై దర్యాప్తు చేసే పోలీసు అధికారులకు దేశంలో, బయటా ఎలాంటి అధికారాలు ఉంటాయో అవి ఎన్‌ఐఏ అధికారులకూ ఉంటాయి. ఎన్‌ఐఏఎ చట్టం కింద నమోదైన ఉగ్రవాద కేసుల సత్వర విచారణకు ఒకటి లేదా అంతకుమించిన సంఖ్యలో కోర్టులను ప్రత్యేక కోర్టులుగా ప్రకటించే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చింది. ఎప్పుడైనా ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయినప్పుడు తదుపరి జడ్జిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారం రోజుల్లోగా నియమించాలి. ఒకవేళ పదవీ విరమణ చేసే వయసు వచ్చినప్పటికీ కేసు విచారణ దృష్ట్యా దాన్ని పొడిగించే వెసులుబాటు ఉంది. అగ్రవర్ణ పేదల (ఈబీసీ) రిజర్వేషన్ల చట్టం అమలు కోసం దేశంలోని 158 కేంద్ర విద్యాసంస్థల్లో రెండేళ్లలో 1,18,983 అదనపు సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. ఇందుకోసం రూ.4,315.15 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా డిజిటల్‌ ఆరోగ్య వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో చేపట్టిన జాతీయ డిజిటల్‌ ఆరోగ్య బ్లూప్రింట్‌ (ఎన్‌డీహెచ్‌బీ)ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ విడుదల చేశారు. రోగుల వ్యక్తిగత సమాచార గోప్యతను, భద్రతను పరిరక్షిస్తూ విస్తృతమైన డేటా, మౌలిక సదుపాయాల ద్వారా సమర్థమైన, చవకైన ఆరోగ్య సేవలు అందించాలనేది ఎన్‌డీహెచ్‌బీ ప్రధాన ఉద్దేశం. .మోటారు వాహనాల చట్ట నిబంధనలకు మరింత పదును పెంచే లక్ష్యంతో రూపొందించిన సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వాహన ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగితే చెల్లించాల్సిన పరిహారాన్ని పెంచాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా, ప్రమాదానికి గురైన వ్యక్తులకు సహాయపడే పరోపకారులకు పోలీసుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా రక్షణ కల్పించే ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఈ సవరణ బిల్లుకు గత లోక్‌సభలోనే ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభలో గట్టెక్కలేకపోయింది. దీంతో కేంద్ర రోడ్డు రవాణాశాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్‌ తాజాగా బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టారు. కేవలం వ్యాపార కోణం, లాభాపేక్షతో మాత్రమే సాగే గర్భాన్ని అద్దెకు ఇచ్చే ప్రక్రియను అడ్డుకునేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సంతాన సాఫల్యత సమస్యను ఎదుర్కొంటున్న దంపతులు కేవలం సన్నిహిత బంధువుల నుంచి మాత్రమే అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం జాతీయ, రాష్ట్రస్థాయుల్లో ‘సరోగసీ బోర్డు'లు ఏర్పాటవుతాయి. కేవలం భారతీయ దంపతులకు మాత్రమే అద్దె గర్భం విధానం ద్వారా సంతానం పొందేందుకు అనుమతి ఉంటుంది. ఆ దంపతులు చట్టబద్ధంగా వివాహం చేసుకుని కనీసం అయిదేళ్ల కాలం పూర్తయి ఉండాలి. ఈ విధానంలో సంతానాన్ని కోరుకునే దంపతుల్లో భార్య వయసు 23-50 ఏళ్లు, భర్త వయసు 26-55 ఏళ్ల మధ్య ఉండాలి

No comments:

Post a Comment