కరెంట్ అఫైర్స్ జులై - 14

జులై - 14
ఆతిథ్య ఇంగ్లండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో సూపర్‌ ఓవర్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. నికోల్స్‌ (55), లేథమ్‌ (47) రాణించడంతో మొదట న్యూజిలాండ్‌ 8 వికెట్లకు 241 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ (84 నాటౌట్‌) అద్భుత పోరాటంతో 50 ఓవర్లలో ఇంగ్లండ్‌ కూడా 241 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా అది కూడా టైగా ముగియడంతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. స్టోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌: కేన్‌ విలియమ్సన్‌.       » ప్రపంచకప్‌ 2019 విజేతగా ఆవిర్భవించిన ఇంగ్లండ్‌ జట్టుకు రూ.27.42 కోట్లు, రన్నరప్‌ న్యూజిలాండ్‌కు 13.71 కోట్లు ప్రైజ్‌మనీ లభిస్తుంది. సెమీస్‌లో ఓడిన జట్టుకు రూ.5.48 కోట్లు ఇస్తారు.      » ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టై కావడం ఇదే తొలిసారి. ప్రపంచకప్‌ గెలిచిన ఆరో జట్టు ఇంగ్లండ్‌. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) విజేతగా నిలిచింది. వెస్టిండీస్‌ (1975, 1979), భారత్‌ (1983, 2011) రెండుసార్లు టైటిల్‌ సాధించాయి. పాకిస్థాన్‌ (1992), శ్రీలంక (1996) ఒక్కోసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి.      » 1975 జూన్‌ 7న ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో జరిగిన ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. తర్వాత 44 ఏళ్ల అనంతరం ఆ దేశ జట్టు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.       » అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌: రోహిత్‌ శర్మ (648)      » అత్యధిక సెంచరీలు: రోహిత్‌ శర్మ (5)      » అత్యల్ప స్కోరు చేసిన జట్టు: పాకిస్థాన్‌ (105)      » అత్యధిక స్కోరు చేసిన జట్టు: ఇంగ్లండ్‌ (397/6, అఫ్గానిస్థాన్‌పై)      » 2019 ప్రపంచకప్‌లో మొత్తం సిక్సర్లు: 358      » మొత్తం సెంచరీలు: 31      » అత్యధిక క్యాచ్‌లు: జోరూట్‌ (13)      » అత్యధిక అర్ధ సెంచరీలు: షకిబ్‌ అల్‌హసన్‌ (7)      » అత్యధిక స్కోరు: 166 (వార్నర్, బంగ్లాదేశ్‌పై)      » అత్యధిక వికెట్లు: మిచెల్‌ స్టార్క్‌ (27)      » అత్యధిక సిక్సర్లు: ఇయాన్‌ మోర్గాన్‌ (22)ప్రపంచకప్‌లో భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకోనున్నాడు. సెమీఫైనల్లో భారత్‌ నిష్క్రమించినా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అతడే అగ్రస్థానంలో ఉన్నాడు. గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకునే భారత మూడో ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించనున్నాడు. అతడి కంటే ముందు సచిన్‌ (1996, 2003), రాహుల్‌ ద్రావిడ్‌ (1999) ఈ ఘనత సాధించారు. ఈ ప్రపంచకప్‌లో 5 శతకాలు సాధించిన రోహిత్‌ 81 సగటుతో 648 పరుగులు చేశాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగానూ రోహిత్‌ రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ (647) రెండో స్థానంలో ఉండగా బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ (606) మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ 576 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. అయిదు, ఆరు స్థానాల్లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జో రూట్‌ (556), బెయిర్‌స్టో (532) ఉన్నారు.       » ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 2003లో సచిన్‌ నెలకొల్పిన రికార్డు అలాగే నిలిచింది. జర్మనీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్లు రెండు స్వర్ణాలు గెలుచుకున్నారు. మొత్తం ఆరు పతకాలు సాధించారు. పురుషుల 50మీ. పిస్టోల్‌ విభాగంలో గౌరవ్‌ రానా, అర్జున్‌ సింగ్‌ వరుసగా పసిడి, రజతాలు సొంతం చేసుకున్నారు. గౌరవ్, అర్జున్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు టీమ్‌ విభాగంలో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మహిళల 50మీ. పిస్టోల్‌లో ప్రియా రాఘవ్‌ (535), విభూతి (531) వరుసగా వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. టీమ్‌ విభాగంలో ప్రియా రాఘవ్, విభూతి, హర్షదలతో కూడిన భారత జట్టు రజతం నెగ్గింది. భారత షూటర్లు ఇప్పటి వరకు నాలుగు స్వర్ణాలు, అయిదు రజతాలు, రెండు కాంస్యాలు సొంతం చేసుకున్నారు. యూఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ కథ ముగిసింది. అమెరికాలోని ఫుల్లర్‌టాన్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో సౌరభ్‌ వర్మ 9-21, 18-21 తేడాతో తనోగ్సాక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు. మిగతా భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, అజయ్‌ జయరాం, లక్ష్యసేన్‌ ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించారు.లండన్‌లో జరిగిన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సెర్బియా క్రీడాకారుడు, ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్‌ ఫెదరర్‌పై విజయం సాధించాడు. రికార్డు స్థాయిలో నాలుగున్నర గంటలకు పైగా సాగిన ఈ తుది పోరులో జకోవిచ్‌ వింబుల్డన్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతడి కెరియర్‌లో ఇది అయిదో వింబుల్డన్‌ టైటిల్‌. మొత్తం మీద 16వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. విజేతగా నిలిచిన జకోవిచ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ.20 కోట్ల 26 లక్షలు), రన్నరప్‌ రోజర్‌ ఫెదరర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ.10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. ¤ టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన యాసర్‌ దాగు ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ పసిడి పతకం సాధించింది. మహిళల 53 కిలోల విభాగం ఫైనల్లో రష్యాకు చెందిన ఎకటరీనా పోలెషుక్‌ను ఓడించిన వినేశ్‌ స్వర్ణం దక్కించుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్‌లో రాహుల్‌ అవారె (61 కిలోలు) స్వర్ణం, ఉత్కర్ష్‌ కాలె (61 కిలోలు) కాంస్యం గెలుచుకున్నారు. 86 కిలోల విభాగంలో దీపక్‌ పూనియా రజతం సాధించాడు.జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో నల్గొండకు చెందిన చెరుపల్లి రమ్య తేజస్విని రెండు స్వర్ణాలు గెలుచుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఈ టోర్నీలో మహిళల కటా విభాగంలో ఛాంపియన్‌గా నిలిచిన రమ్య కుమిటీ కేటగిరీలోనూ టైటిల్‌ నెగ్గింది. ఈమె ప్రముఖ అంతర్జాతీయ కరాటే ఆటగాడు చెరుపల్లి వివేక్‌ తేజకు సోదరి.సిల్వర్‌స్టోన్‌లో జరిగిన బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రి టైటిల్‌ పోరులో ఫార్ములావన్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ సాధించాడు. మెర్సిడెస్‌ డ్రైవరైన హామిల్టన్‌ ఈ రేసును అగ్రస్థానంతో ముగించాడు. ఈ ఏడాది ఏడో విజయం సాధించిన హామిల్టన్‌కు ఇది కెరియర్‌లో 80వ విజయం.

No comments:

Post a Comment