నవంబరు - 2018 అంతర్జాతీయం నవంబరు 1 |
¤ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య సంబంధ అంశాలపై కఠిన నిర్ణయాన్ని ప్రకటించారు. » 50 రకాల భారతీయ వస్తువుల దిగుమతులపై సుంకం లేకుండా కల్పించిన వెసులుబాటును రద్దు చేశారు. ఇందులో ఎక్కువగా చేనేత, వ్యవసాయ రంగాలకు చెందిన వస్తువులే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటిదాకా ‘జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్' (జీఎస్పీ) నిబంధనల కింద ఉన్నాయి. అంటే వీటిపై ఇప్పటివరకు సుంకం విధించడం లేదు. ¤ మహిళా ఉద్యోగులపై లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడిన ఉన్నతాధికారులపై గూగుల్ చూసీచూడనట్లు ఉందని ఆరోపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది విధులను బహిష్కరించారు. » భారత్, టోక్యో, సింగపూర్, లండన్, జ్యూరిచ్, అమెరికా, డబ్లిన్ కార్యాలయాల నుంచి సిబ్బంది పెద్ద ఎత్తున వాకౌట్ చేశారు. » ఆండ్రాయిడ్ ఓఎస్ సృష్టికర్త ఆండీ రూబిన్, డైరెక్టర్ రిచర్డ్ డివొల్ సహా కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై గూగుల్ దశాబ్ద కాలంపాటు మౌనం వహించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల సంచలన కథనాన్ని ప్రచురించింది. » ఈ నేపథ్యంలో వేధింపులపై కోర్టును ఆశ్రయించేలా నిబంధనల్లో సవరణ, స్త్రీ, పురుషులకు సమాన వేతనం, కంపెనీ బోర్డులో తగిన ప్రాధాన్యం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. |
నవంబరు 2 |
¤ హెచ్-1బి వీసాలపై ఆధారపడే ఉద్యోగ సంస్థలే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్-1బి కింద వచ్చే కొత్త విదేశీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టతరమయ్యేలా వీటిని సిద్ధం చేశారు. » నూతన నిబంధనల ప్రకారం ప్రస్తుతం తమ దగ్గర పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల లెక్కలు తప్పనిసరిగా ఉద్యోగ సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ కోరుతున్న తాజా సమాచారం అత్యంత కీలకంగా మారనుంది. దీని ఆధారంగానే కొత్తగా హెచ్-1బి వీసాదారులను తీసుకొనేందుకు ఉద్యోగ సంస్థలకు అనుమతిస్తారు. దేశీయంగా ఆ ఉద్యోగానికి ఎవరూ అందుబాటులో లేరని శాఖ ధృవీకరించిన తర్వాతే విదేశీ నిపుణుల నియామకాలకు సంస్థలకు అవకాశం కల్పిస్తారు. దీనికి అనుగుణంగా కార్మిక నిబంధనల దరఖాస్తులో మార్పులు చేశారు. ¤ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 8 దేశాలకు తాత్కాలికంగా అనుమతిచ్చినట్లు అమెరికా తెలిపింది. ఇరాన్ నుంచి ఇప్పటికే చమురు దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంకా కోత విధిస్తే మార్కెట్‌లో ఇంధన ధరలు పెరిగే ముప్పు ఉన్నందునే అమెరికా తన వైఖరిని సడలించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. » ఇరాన్‌తో లావాదేవీల వ్యవహారంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన 8 దేశాల జాబితాలో భారత్‌తో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా కూడా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థ వెల్లడించింది. » ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. |
నవంబరు 4 |
¤ ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి దాదాపు 18 వేల కి.మీ. దూరంలో ఉండి ఆ దేశంలోనే భాగంగా ఉన్న పసిఫిక్ మహాసముద్ర ద్వీప సమూహం న్యూకెలెడోనియా ప్రజలు ఫ్రాన్స్‌తోనే కలిసి ఉంటామని తేల్చి చెప్పారు. » న్యూకెలెడోనియాకు స్వాతంత్య్రం కావాలా?వద్దా?అని జరిపిన రిఫరెండం ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు 70 శాతానికి పైగా ఓట్లను లెక్కించగా వాటిలో 59.5 శాతం ఓట్లు స్వాతంత్య్ర ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నాయని స్థానిక ఎన్నికల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రిఫరెండంలో 1.75 లక్షల మంది ఓటేశారు. » ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి సుదూరంగా ఉన్న ఈ ప్రాంతం నికెల్ లోహానికి ప్రసిద్ధిచెందింది. ప్రపంచం మొత్తం నికెల్ ఉత్పత్తిలో పావుశాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. |
నవంబరు 5 |
¤ వ్యవసాయ కార్మికుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అందజేసే వర్కింగ్ హాలీడే వీసా లేదా బ్యాక్ ప్యాకర్ వీసాల గడువును మూడేళ్ల కాలానికి పొడిగించింది. » యువతీ యువకులు ఎవరైనా ఉత్తర ఆస్ట్రేలియాలోని వ్యవసాయ క్షేత్రాల్లో 6 నెలల పాటు పనిచేస్తే వారికి మూడేళ్ల పాటు దేశంలో ఉండే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. » సాధారణంగా ఏడాది కాలానికి ఈ వీసాను జారీ చేస్తారు. ఈ ఏడాది కాలంలో ఆరు నెలల పాటు ఉత్తర ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తే వీసా గడువును మరో ఏడాది అదనంగా పొడిగించేవారు. తాజాగా ఈ రెండేళ్ల వీసా గడువును మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చెప్పారు. » ఈ నిర్ణయం 2019, జులై నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ వీసాలకు 45 దేశాలకు చెందిన పౌరులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ¤ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్, చైనా సహా ఎనిమిది దేశాలకు తాత్కాలిక మినహాయింపులను ఇస్తున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌తో ఇంధన లావాదేవీలను గణనీయంగా తగ్గించుకున్నందుకే ఈ ఊరట కల్పిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాండియో వెల్లడించారు. » మినహాయింపు పొందిన దేశాల జాబితాలో జపాన్, ఇటలీ, గ్రీస్, దక్షిణ కొరియా, తైవాన్, టర్కీ కూడా ఉన్నాయి. ¤ అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ బ్యాంకింగ్, ఇంధన రంగాలపై అత్యంత కఠినమైన ఆంక్షలను విధించింది. » ఇరాన్‌కు చెందిన 600 కంపెనీలు, వ్యక్తులతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. వీరితో వ్యాపార లావాదేవీలు నడిపే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలు విధిస్తామని తేల్చిచెప్పింది. » 2015లో ఇరాన్‌తో రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల సమక్షంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని 2018 మే లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. |
నవంబరు 6 |
¤ బ్రిటన్‌లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసుకునేందుకు విదేశీయులను అనుమతించాలని ఆ దేశ ప్రభుత్వానికి అక్కడి అఖిలపక్ష పార్లమెంటరీ బృందం సిఫార్సు చేసింది. » స్థానిక విశ్వవిద్యాలయాల్లో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఈ బృందం 12 సిఫార్సులు చేసింది. » గతంలో విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక బ్రిటన్‌లోనే రెండేళ్లపాటు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉండేది. 2012లో బ్రిటన్ ఈ విధానాన్ని రద్దు చేసింది. ¤ శత్రువుల రాడార్లకు చిక్కకుండా తిరిగే కొత్తతరం మానవరహిత యుద్ధ విమానాన్ని (యుసీఏవీ) చైనా తయారు చేసింది. ఇప్పటివరకు ఆ దేశం అభివృద్ధి చేసిన డ్రోన్లలో ఇదే అధునాతనమైంది. ఝూహైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించిన దీనికి సీహెచ్7 అని పేరు పెట్టారు. » కొన్ని విషయాల్లో ఇది అమెరికాలోని ఆర్‌క్యూ - 170 యూసీఏవీ కంటే చాలా మెరుగ్గా పనిచేస్తుందని సీహెచ్‌శ్రేణి యూసీఏవీల రూపకర్త షివెన్ తెలిపారు. » సీహెచ్7 తయారీ ద్వారా అత్యంత ఎత్తులో సుదీర్ఘంగా పనిచేసే మానవరహిత యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసిన రెండో దేశంగా చైనా ఘనత సాధించింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. » సీహెచ్7 పొడవు - 10 మీటర్లు, రెక్కలతో సహా వెడల్పు - 22 మీటర్లు. గరిష్ఠంగా 13 వేల కిలోల బరువును మోసుకెళ్లే ఈ యూసీఏవీ 15 గంటల పాటు ఏకబిగిన ప్రయాణించగలదు. ¤ పాకిస్థాన్ - చైనాల మధ్య విలాసవంతమైన బస్సు సర్వీసును పాకిస్థాన్ అధికారులు ప్రారంభించారు. » పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గుండా బస్సును నడపకూడదని భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ లాహోర్‌లోని గుల్బర్గ్ నుంచి చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులోని కాష్గర్ నగరానికి బస్సు బయలుదేరింది. » దాదాపు రూ.4.38 లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపట్టిన చైనా - పాక్ ఆర్థిక కారిడార్ (సీపెక్)లో భాగంగా ఈ బస్సు సర్వీసులను ప్రారంభించారు. » ‘ఘాజీ ఎక్స్‌ప్రెస్' అనే ప్రైవేటు సంస్థ ఈ మార్గంలో లగ్జరీ బస్సులను నడపనుంది. కేవలం 15 మంది ప్రయాణికులు మాత్రమే ఉండే ఈ బస్సు 36 గంటలపాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటుంది. |
నవంబరు 7 |
¤ భారత్ ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను మోహరించడం పట్ల పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ప్రయోగానికి సిద్ధమైన అణు వార్‌హెడ్లను దక్షిణాసియాలో తొలిసారిగా రంగంలోకి దించినట్లయిందని, దీనివల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలకే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా ముప్పు పొంచి ఉందని పాక్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ¤ బాస్కెట్ బాల్ చరిత్రలో తొలిసారిగా ఓహియోలో బాస్కెట్‌బాల్ క్రీడ ప్రారంభ వేడుకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. » క్విక్కెన్‌లోన్ ఎరీనా మైదానంలో క్లీవ్‌ల్యాండ్ క్వావలియర్స్, డెన్వర్ నగ్గెట్స్ జట్ల మధ్య జరిగిన పోటీల సందర్భంగా ‘ఇండియన్ హెరిటేజ్ సైట్' పేరుతో ఈ ప్రదర్శనలను నిర్వహించారు. |
నవంబరు 8 | |
¤ అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌ను ‘న్యాయశాఖ అధిపతి' బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. » దీంతో 2016 అధ్యక్ష ఎన్నికల్లో విదేశాల జోక్యం, రష్యాతో తన సంబంధాలపై దర్యాప్తును దాదాపుగా ట్రంప్ నియంత్రణలోకి తీసుకున్నట్లయింది. » ప్రస్తుతం రిపబ్లికన్లకు విశ్వాసపాత్రుడైన మాథ్యూ విటేకర్‌కు తాత్కాలికంగా అటార్నీ జనరల్ బాధ్యతలు అప్పగించారు.¤ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్‌ఏంజెలిస్ శివార్లలో ఉన్న థౌజెండ్ ఓక్స్ ప్రాంతంలోని ‘బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్'లో నౌకాదళ మాజీ ఉద్యోగి ఇయాన్ డేవిడ్ లాంగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఒక పోలీసు అధికారి సహా 12 మంది మరణించారు. » పోలీసులు రావడంతో హంతకుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. రెండువారాల లోపు అమెరికాలో ఊచకోత జరగడం ఇది రెండోసారి. |
నవంబరు 9 |
¤ భారత్‌కు పొరుగునే ఉన్న మయన్మార్‌లోని బంగాళాఖాతం తీరం వద్ద చైనా కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ రేవును నిర్మించబోతోంది. » ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఉభయదేశాలు నవంబరు 8న సంతకాలు చేశాయి. ఈ రేవు నిర్మాణానికి చైనా ఏకంగా 70శాతం నిధులను సమకూరుస్తోంది. మిగిలిన 30శాతాన్ని మాత్రమే మయన్మార్ భరిస్తోందని ‘గ్లోబల్ టైమ్స్' వెల్లడించింది.¤ శ్రీలంక పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ప్రకటించారు. తమ పార్టీ (యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయెన్స్- యూపీఎఫ్‌ఏ) ప్రతిపాదించిన ప్రధానమంత్రి అభ్యర్థికి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. » 225 మంది సభ్యులుండే పార్లమెంటు అర్ధరాత్రి నుంచే రద్దవుతుందని పేర్కొన్నారు. వాస్తవంగా ప్రస్తుత పార్లమెంటు గడువు 2020 ఆగస్టు వరకు ఉంది. » 2019 జనవరి ప్రారంభంలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ సింఘేను ఆకస్మికంగా తొలగించి, ఆయన స్థానంలో మహింద రాజపక్సేను సిరిసేన నియమించిన తర్వాత సింహళ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది.¤ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో బౌర్క్‌స్ట్రీట్‌లో ఓ ఉగ్రవాది బీభత్సం సృష్టించాడు. తానున్న కారుకే నిప్పంటించి బయటకు దిగాడు. అనంతరం కత్తితో అక్కడున్న ప్రజలపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు దుండగుడిపై కాల్పులు జరిపారు. ఆయన మృతి చెందినట్లు విక్టోరియా పోలీసు చీఫ్ కమిషనర్ గ్రాహమ్ ఆస్టన్ తెలిపారు. ఈ దాడిని ఉగ్రవాదచర్యగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. » ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రకటించుకుంది. విదేశీయులు లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు చెప్పింది. |
నవంబరు 11 |
¤ మొదటి ప్రపంచ యుద్ధం విరమణకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్‌లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్, జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. » ఫ్రాన్స్ సాయుధ దళాల మాజీలు సహా 3400 మందికి పైగా హాజరయ్యారు. సుమారు 70 దేశాల ప్రభుత్వాధినేతలు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. » మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల పాత్రను స్మరించుకుంటూ ఫ్రాన్స్‌లోని లవెంటీ పట్టణంలో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. భిన్న విశ్వాసాల అమరుల స్మారక సంఘం (ఐఎఫ్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయదలచిన 57 విగ్రహాల్లో భారత్‌కు చెందిన ఏడడుగుల కాంస్య విగ్రహం మొదటిది. 39వ రాయల్ గాడ్వాల్ రైఫిల్స్ దళానికి చెందిన ఇద్దరు సైనికుల అవశేషాలను గుర్తించిన నేపథ్యంలో లవెంటీలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్‌లో భారతీయ సైనికులను ఖననం చేసిన అన్ని స్మశానాల వద్ద ఈ తరహాలో 57 విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు విశ్రాంత కల్నల్ దీపక్ దహియా పేర్కొన్నారు. భారత సైన్యంలో పనిచేసిన దీపక్ ప్రస్తుతం పారిస్‌లో ఐఎఫ్‌ఎస్‌సీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. » పారిస్ శాంతి వేదిక ప్రారంభ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆయన సతీమణి ఉష పాల్గొన్నారు. శాంతి భద్రతలు, పర్యావరణం, అభివృద్ధి, డిజిటల్, వినూత్న సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాల్లో అంతర్జాతీయ సహకారం, పాలన మెరుగుపరిచే నిమిత్తం పారిస్ శాంతి వేదిక పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భారత్ తరఫున ఉపరాష్ట్రపతి వెంకయ్య హాజరయ్యారు. ¤ ‘శ్రీలంక ఫ్రీడం పార్టీ' (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో యాభై ఏళ్ల అనుబంధాన్ని మహింద రాజపక్సే తెంచుకున్నారు. తన మద్దతుదారులు కొత్తగా నెలకొల్పిన ‘శ్రీలంక పీపుల్స్ పార్టీ' (ఎస్‌ఎల్‌పీపీ)లో ఆయన చేరారు. » ప్రధానిగా రణిల్ విక్రమసింఘే స్థానంలో రాజపక్సేను నియమిస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత వివిధ పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు రద్దు అయ్యింది. » ఈ నేపథ్యంలో జనవరి 5న జరిగే ముందస్తు ఎన్నికల్లో కొత్తపార్టీ తరఫునే రాజపక్సే పోటీ చేయనున్నారు. |
నవంబరు 12 |
¤ చట్ట విరుద్ధంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన దాదాపు 2400 మంది భారతీయులు వివిధ అమెరికన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నట్లు ‘ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్' గణాంకాల ప్రకారం ఉత్తర అమెరికా పంజాబీ సంఘం (నాపా) వెల్లడించింది. |
నవంబరు 13 |
¤ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చేసిన పార్లమెంటు రద్దు చెల్లదని, 2019 జనవరిలో ఎన్నికలు జరిపేందుకు చేస్తున్న ఏర్పాట్లను నిలిపివేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు పేర్కొంది. » సిరిసేన తీసుకున్న అనేక నిర్ణయాలపై దాఖలైన 13 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. పార్లమెంటును రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వులను డిసెంబరు 7 వరకు అమలు చేయరాదని, ఇందుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను ఆలోగా విచారించి తుది ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. |
నవంబరు 14 |
¤ శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించింది. » మహింద రాజపక్సే సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్ జయసూర్య ప్రకటించారు. రాజ్యాంగానికి లోబడి తదుపరి చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు లేఖ రాశారు. ¤ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన, అరుదైన 18.96 క్యారెట్ల బరువైన పింక్ వజ్రం రికార్డు ధరకు అమ్ముడు పోయింది. హ్యారీ విల్సన్ అనే అమెరికా కంపెనీ రూ.362 కోట్లకు దీన్ని సొంతం చేసుకుంది.¤ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమీ రావ్ (45)ను ‘డి.సి (డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా) సర్క్యూట్ అప్పీళ్ల న్యాయస్థానం' న్యాయమూర్తిగా నామినేట్ చేశారు. » అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత శక్తిమంతమైన న్యాయస్థానంగా ‘డి.సి. సర్క్యూట్'ను పరిగణిస్తారు. » నియోమీ రావ్ ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో ‘సమాచార క్రమబద్ధీకరణ వ్యవహారాల కార్యాలయం (ఓఐఆర్‌ఏ)' పాలనాధికారిగా ఉన్నారు. » డి.సి. సర్క్యూట్‌కు నియోమీ రావ్ నామినేషన్‌ను సెనేట్ ఆమోదిస్తే ఆమె శ్రీనివాసన్ తర్వాత ఆ కోర్టులో నియమితులైన రెండో భారతీయ అమెరికన్ న్యాయమూర్తిగా నిలుస్తారు.¤ శ్వేత సౌధంలో ఏటా నిర్వహించే దీపావళి సంబరాల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా పాల్గొన్నారు. » ట్రంప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. |
నవంబరు 15 |
¤ ఐరోపా యూనియన్ (ఈయూ) నుంచి బయటికొచ్చేందుకు రూపొందించుకుంటున్న ప్రతిపాదిత బ్రెగ్జిట్ ముసాయిదా సరిగా లేదంటూ బ్రెగ్జిట్ మంత్రి డొమినిక్ రాబ్, భారత సంతతికి చెందిన మంత్రి శైలేష్ వర, మరో ఇద్దరు మంత్రులు ఎస్తేర్ మెఖ్‌వే, సుయెల్లా బ్రాబెర్మన్, ఎంపీ హెన్రీ స్మిత్ రాజీనామా చేశారు. శైలేష్ వర ఉత్తర ఐర్లాండ్ మంత్రిగా ఉన్నారు. » బ్రెగ్జిట్ అంశంపై మరో ప్రముఖ బ్రెగ్జిట్ సమర్థకుడు, కన్జర్వేటివ్ నేత జాకబ్ రీస్-మాగ్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధాని థెరిసా మే పై అవిశ్వాస తీర్మానం లేఖను సమర్పించడం ద్వారా థెరిసాకు నేరుగా సవాలు విసిరారు.¤ దక్షిణ కొరియాలో నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షను వినూత్నంగా నిర్వహించారు. » ఈ పరీక్ష కోసం మొత్తం దేశం, ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజమే కదిలింది. విద్యార్థులకు ఎక్కడా చిన్న అడ్డంకి ఏర్పడకుండా సగర్వంగా పక్కకు తప్పుకుంది. విద్యకు తామిచ్చే ప్రాధాన్యాన్ని చాటి చెప్పింది. సుమారు 5.95 లక్షల మంది ఈ పరీక్షను రాశారు. » పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను, దుకాణాలను గంట ఆలస్యంగా తెరిచారు. » ఈ జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షను సన్యుంగ్/కాలేజ్ స్కాలస్టిక్ అబిలిటీ టెస్ట్ (సీఎస్‌ఏటీ) గానూ పిలుస్తారు. » ఏటా నవంబరు మూడో గురువారం ఈ పరీక్షను నిర్వహిస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.40 నుంచి సాయంత్రం 5.40 దాకా తొమ్మిది గంటలపాటు వరుస పరీక్షలు నిర్వహిస్తారు. » ఈ పరీక్ష విద్యార్థుల 12 ఏళ్ల పాఠశాల విద్యకు ముగింపు పలుకుతూ, మలి దశకు ఆరంభాన్నిస్తుంది. ¤ శ్రీలంక ప్రధాని రాజపక్సేకు వ్యతిరేకంగా ఆమోదం పొందిన అవిశ్వాస తీర్మానాన్ని తాను తిరస్కరించినట్లు స్పీకర్ జయసూర్యకు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సమాచారం అందించారు. ప్రధానికి పార్లమెంట్‌లో మెజారిటీ ఉండాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. |
నవంబరు 16 |
¤ కాంబోడియాలో 1975-79 కాలంలో పోల్‌పాట్ నేతృత్వంలో జరిగిన ఖ్మేర్‌రోజ్ సామూహిక హత్యాకాండకు సంబంధించి నాడు అధికారంలో ఉన్న ఇద్దరు కీలక నేతలకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. » నాటి ప్రధాని పోల్‌పాట్ నేతృత్వంలోని ఖ్మేర్‌రోజ్ పార్టీ అనేక దారుణాలకు ఒడిగట్టింది. నాటి జనాభాలో దాదాపు పాతిక శాతం (20 లక్షలు) మందిని చంపేసింది. కార్మికుల చేత విశ్రాంతి లేకుండా పనిచేయించడం వల్ల కొందరు, ఆకలితో మరికొందరు, ప్రభుత్వం విధించిన ఉరిశిక్షలకు ఇంకొంతమంది మరణించారు. » ఈ దారుణాలకు సూత్రధారులుగా అప్పటి ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న ఖీయూ సంఫన్ (87), నువోన్ చియా (92)కు ప్రస్తుతం కోర్టు శిక్షలు విధించింది. |
నవంబరు 19 |
¤ శ్రీలంక పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను శ్రీలంక రాజకీయ పార్టీలు అంగీకరించాయి. అక్టోబరు 26న ప్రధాని విక్రమ సింఘేను తొలగిస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. సుప్రీంకోర్టు జోక్యంతో పార్లమెంటులో బల పరీక్ష జరుపగా కొత్త ప్రధాని రాజపక్సే అందులో ఓడిపోయారు. ఈ పరిణామం అనంతరం పార్లమెంటు కార్యకలాపాలు గందరగోళంగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. |
నవంబరు 20 |
¤ మెక్సికో నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఆశ్రయాన్ని నిరాకరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. |
నవంబరు 18 |
¤ ఫ్రాన్స్‌లో చమురు సుంకం పెంపుపై నిరసనలు పెల్లుబికాయి. వీటిలో 400 మందికి పైగా గాయపడ్డారు. మొత్తంగా 2,034 ప్రాంతాల్లో జరిగిన ఈ నిరసనల్లో 2,88,000 మంది పాల్గొన్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి క్రిస్పోఫ్ కెస్టెనే తెలిపారు. |
నవంబరు 21 |
¤ ఉగ్రవాదులపై పోరాటంలో పాకిస్థాన్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏటా అమెరికా నుంచి పాక్‌కు అందే సుమారు రూ.9350 కోట్ల నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. |
నవంబరు 24 |
¤ భారత్‌కు రఫేల్ యుద్ధ విమానాల సరఫరా వ్యవహారంపై ఫ్రాన్స్‌లోనూ ఫిర్యాదు దాఖలైంది. ఆ ఒప్పందంలోని షరతులపై స్పష్టత ఇవ్వాలని ఫ్రాన్స్‌కి చెందిన స్వచ్ఛంద సంస్థ షెర్పా ఆ దేశ ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని కోరింది. వ్యాపార భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంచుకోవడానికి కారణాలను తెలియజేయాలని అడిగింది. వీటిపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. » ఆర్థిక నేరాలు, ప్రపంచీకరణతో ముడిపడ్డ అక్రమాలపై షెర్పా సంస్థ పోరాడుతుంటుంది. » రఫేల్ ఒప్పందంలో భారత ప్రధాని నరేంద్రమోదీ కొందరికి అనుచిత లబ్ధి కలిగించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేంద్ర మాజీ మంత్రి, అవినీతిపై పోరాడే ఒక న్యాయవాది సీబీఐకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించినట్లు షెర్పా పేర్కొంది. ¤ చమురు సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో వారం రోజులుగా నిరసనలు చేపడుతున్న వారిపై పోలీసులు బాష్ప వాయు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు. » దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ రాజీనామా చేయాలంటూ సెంట్రల్ పారిస్‌లో వేల మంది ఆందోళనకారులు నిరసనలు మొదలు పెట్టిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. |
నవంబరు 25 |
¤ చరిత్రాత్మకమైన బ్రెగ్జిట్ ఒప్పందానికి ఐరోపా యూనియన్ (ఈయూ) నేతలు ఆమోదముద్ర వేశారు. దీంతో 28 దేశాల ఈయూ ఆర్థిక కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు మార్గం సుగమమైంది. » బ్రస్సెల్స్‌లో జరిగిన సమావేశంలో మిగిలిన 27 దేశాల నేతలు వివాదాస్పద బ్రెగ్జిట్ ఉపసంహరణ ఒప్పందంపై సంతకం చేశారు. » స్పెయిన్ తీరంలో ఉండే బ్రిటన్ విదేశీ భూభాగం జిబ్రాల్టర్ విషయంలో స్పెయిన్ కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా తర్వాత ఉపసంహరించుకోవడంతో ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపారు. |
నవంబరు 28 |
¤ భారత్, పాకిస్థాన్‌ల వైపు ఉన్న గురుద్వారాల్ని అనుసంధానించే చారిత్రక కర్తార్‌పూర్ నడవా నిర్మాణానికి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాక్ సైనికాధిపతి జనరల్ జావేద్ బజ్వా, ప్రభుత్వాధికారులు, భారత కేంద్ర మంత్రులు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, హర్‌దీప్ సింగ్ పురి తదితరులు పాల్గొన్నారు.నవంబరు - 2018 రాష్ట్రీయం
|
No comments:
Post a Comment