కరెంట్ అఫైర్స్ - అంతర్జాతీయం :డిసెంబరు - 2018 అంతర్జాతీయం

డిసెంబరు - 2018 అంతర్జాతీయం

డిసెంబరు - 2
¤ మెక్సికో నూతన అధ్యక్షుడిగా వామపక్షనేత ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఓబ్రడార్‌ డిసెంబరు 1న ప్రమాణం చేశారు.        » ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌లు హాజరయ్యారు.
డిసెంబరు - 3
¤ అరబ్‌ దేశం ఖతార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్‌) నుంచి 2019 జనవరిలో వైదొలగనున్నట్లు ప్రకటించింది        » సౌదీ అరేబియా, ఖతార్‌ మధ్య విభేదాల నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఒపెక్‌ నుంచి వైదొలుగుతున్న తొలి మధ్యప్రాచ్య దేశం ఖతార్‌.        » ఖతార్‌లో ఇంధన నిల్వలు పుష్కలం. ప్రపంచంలో ద్రవీకృత సహజ వాయువును అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం ఇదే. ప్రపంచంలో తమ దేశంలో చమురు నిల్వల్ని పెంచే ప్రణాళికల్లో భాగంగానే ఒపెక్‌ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది.        » 1960లో ఒపెక్‌ను స్థాపించారు. ఆ మరుసటి ఏడాది ఖతార్‌ అందులో భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం ఖతార్‌తో కలిపి ఒపెక్‌లో మొత్తం 15 సభ్యదేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ విపణిలో చమురు ధరల నియంత్రణకు వీలుగా తమ సభ్య దేశాలకు ఈ సంఘం ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తుంటుంది.        » ప్రస్తుతం ఏటా 7.7 కోట్ల టన్నులుగా ఉన్న సహజవాయువు ఎగుమతులను 11 కోట్ల టన్నులకు పెంచాలని భావిస్తున్నట్లు ఖతార్‌ ఇంధన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సాద్‌ షెరిదా అల్‌-కాబి వెల్లడించారు. ఇప్పుడు రోజుకు 48 లక్షల బ్యారళ్లుగా ఉన్న చమురు ఉత్పత్తిని 65 లక్షల బ్యారళ్లకు పెంచాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.        » ఒపెక్‌లో సౌదీ అరేబియా ఆధిపత్యం ఎక్కువ. ఆ దేశంతో ఖతార్‌కు పొసగడం లేదు. రాజకీయ విభేదాల కారణంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈజిప్టు 2017 జూన్‌లో ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. ఆ దేశంపై ఆర్థిక బహిష్కరణ విధానాన్ని ప్రయోగిస్తున్నాయి. తమ గగనతలంలోకి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానాలను అనుమతించడం లేదు. ఖతార్‌కు సౌదీతో మాత్రమే కొంత భూతల సరిహద్దు ఉంది. దాన్ని కూడా సౌదీ మూసేసింది. ఖతార్‌ నౌకలు తమ ఓడరేవులను వినియోగించుకోకుండా సౌదీ నిషేధం విధించింది.
డిసెంబరు - 5
¤ విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ భగవంతుడు, మతానికి సంబంధించి తన అభిప్రాయాలను వ్యక్తపరిచిన ఓ అపురూపమైన లేఖ న్యూయార్క్‌లో క్రిస్టీస్‌ సంస్థ నిర్వహించిన వేలంలో రూ.20.39 కోట్ల ధర పలికింది.        » ఐన్‌స్టీన్‌ మరణించడానికి సుమారు ఏడాది ముందు జర్మనీ తత్వవేత్త ఎరిక్‌ గట్‌కిండ్‌కు ఈ లేఖ రాశారు. ¤ ఇండోనేషియాలోని పపువా ప్రావిన్సులో వేర్పాటువాదులు రెండు రోజుల్లో 31 మంది నిర్మాణరంగ కార్మికులను కాల్చి చంపారు.        » ఎండుగా జిల్లాలోని మారుమూల పర్వత ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన వంతెన నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులపై ముష్కరులు ఈ ఘటనకు పాల్పడ్డారు.
డిసెంబరు - 6
¤ దలైలామా వారసుడి ఎంపికలో చైనా ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తాము వ్యతిరేకిస్తామని అమెరికా స్పష్టం చేసింది.        » టిబెట్‌లోని బౌద్ధ మతస్థుల అత్యున్నత అధినేతనే దలైలామా అని పిలుస్తారు. ప్రస్తుత దలైలామా వయసు 83 సంవత్సరాలు కావడంతో ఆయన వారసుడిగా తనకు విధేయుడిగా ఉండే వ్యక్తిని నియమించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది.
డిసెంబరు - 10
¤ బ్రెగ్జిట్‌పై పార్లమెంట్‌లో డిసెంబరు 11న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ప్రకటించారు.
        » బ్రెగ్జిట్‌పై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో తాను కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలపై ఎంపీల్లో విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు
.
¤ విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆయనపై తప్పుడు కేసు పెట్టినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించట్లేదని వ్యాఖ్యానించింది. భారత్‌కు పంపినంత మాత్రాన ఆయన మానవ హక్కులకు భంగం కలగదని స్పష్టం చేసింది
.
        » రూ.9000 కోట్ల రుణాలు ఎగవేసిన మాల్యా 2016లో బ్రిటన్‌కు పరారయ్యారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను నడపడంతోపాటు భిన్న వ్యాపారాలు చేసిన ఆయనపై అక్రమ నగదు చెలామణి, ఇతర అవసరాలకు రుణాల నిధులు మళ్లింపు ఆరోపణలూ ఉన్నాయి
.
        » ఆయన్ను అప్పగించాలన్న భారత్‌ అభ్యర్థనపై లండన్‌లోని వెస్ట్‌ మిన్‌స్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ జడ్జి ఎమ్మా ఆర్బత్‌నాట్‌ ఏడాదిపాటు విచారణ అనంతరం తీర్పు ఇచ్చారు
.
        » తీర్పు అనంతరం జడ్జి ఎమ్మా ఈ కేసును హోంమంత్రి సాజిద్‌ జావిద్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో తుది నిర్ణయం తీసుకునేది హోంమంత్రే. తీర్పు ఆధారంగా ఆయన తన నిర్ణయాన్ని రెండు నెలల్లోగా వెల్లడిస్తారు. ఈ తీర్పుపై హైకోర్టులో మాల్యా అప్పీలు చేసుకోవచ్చు.
డిసెంబరు - 12
¤ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధానిగా తొలగించిన రణిల్‌ విక్రమసింఘేపై పార్లమెంటు విశ్వాసం ప్రకటించింది.
        »
 మొత్తం 225 మంది సభ్యులకుగాను తీర్మానానికి అనుకూలంగా 117 మంది ఓటు వేశారు. గతంలో సిరిసేన వ్యక్తిగత కారణాలతో విక్రమ సింఘేను తొలగించి మహింద రాజపక్సను ప్రధానిగా నియమించారు. రాజపక్స ఇప్పటివరకు పార్లమెంటులో మెజార్టీ నిరూపించుకోలేదు.¤ భారతీయులు సహా ప్రపంచ కుబేరులకిచ్చే గోల్డెన్‌ వీసాలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని బ్రిటన్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.        » టైర్‌-1 మదుపరుల వీసాను గోల్డెన్‌ వీసాగా పిలుస్తుంటారు. బ్రిటన్‌లో శాశ్వత నివాస హక్కులను వేగంగా పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది.        » రూ.18.06 కోట్లు (2 మిలియన్‌ పౌండ్లు)కు పైగా పెట్టుబడులు పెట్టేవారికి ఈ వీసాలు జారీ చేస్తారు.
డిసెంబరు - 13
¤ శ్రీలంక పార్లమెంటును రద్దు చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది.        » పార్లమెంటు కాల పరిమితి అయిదేళ్లు కాగా, కనీసం నాలుగున్నరేళ్లపాటు కొనసాగాల్సి ఉంది. ఆ కాలపరిమితి పూర్తికాకుండా రద్దు చేయడం తగదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది.¤ మాలిలోని ఈశాన్య ప్రాంతమైన మెనకలో సాయుధులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 47 మంది పౌరులు మరణించారు.        » ఇక్కడ టౌరెగ్, పియూల్, పులానీ సంచార తెగలు నివాసం ఉంటాయి. నీరు, భూముల కోసం వీరి మధ్య ఎప్పటికప్పుడు ఘర్షణలు జరుగుతుంటాయి. మరో వైపు ఇక్కడ ఉగ్రవాదులూ దాడులకు తెగబడుతుంటారు. ప్రస్తుతం ఉగ్రవాదులు టౌరెగ్‌ తెగను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.¤ బ్రెగ్జిట్‌ ఒప్పందం నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరిసా మే తన నాయకత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. 2022లో జరిగే సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీకి నాయకత్వం వహించబోనని చెప్పి తమ పార్టీలోని తిరుగుబాటు సభ్యుల్ని తనవైపు ఉండేట్లు చేసి ఆమె గెలుపును సాధించారు.        » కన్జర్వేటివ్‌ పార్టీకి 317 మంది ఎంపీలు ఉండగా, ఆమెకు అనుకూలంగా 200 మంది, వ్యతిరేకంగా 117 మంది ఓటేశారు. గెలిచేందుకు కనీసం 159 ఓట్లు అవసరం.
డిసెంబరు - 14
¤ భారత కరెన్సీలోని పెద్దనోట్ల వినియోగాన్ని నేపాల్‌ ప్రభుత్వం నిషేధించింది. రూ.2000, రూ.500 రూ.200 నోట్లను వాడొద్దని స్పష్టం చేసింది.        » రూ.100 కంటే ఎక్కువ విలువైన భారతీయ కరెన్సీని నేపాల్‌ ప్రభుత్వం చట్టబద్ధం చేయలేదు. అందుకే ఈ నోట్లను నిషేధించినట్లు నేపాల్‌ సమాచార, ప్రసార శాఖ మంత్రి గోకుల్‌ ప్రసాద్‌ ప్రకటించారు.
డిసెంబరు - 15
¤ ఆరోగ్య బీమా కోసం మునుపటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ‘అఫర్డ్‌బుల్‌ కేర్‌ చట్టం' (ఒబామా కేర్‌)ను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ టెక్సాస్‌లోని ఒక ఫెడరల్‌ జడ్జి కొట్టేశారు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రాజకీయంగా పెద్ద విజయం లభించినట్లయ్యింది. ఆ చట్టానికి ముగింపు పలకాలని చాలా కాలంగా ఆయన కోరుకుంటున్నారు.
¤ శ్రీలంకలో వివాదాస్పద రీతిలో ప్రధానిగా నియమితులైన మహింద రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి
.
        » వ్యక్తిగత కారణాలతో అక్టోబరు 26న విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆ పదవిలో రాజపక్సేను నియమించారు. పార్లమెంటులో రాజపక్సేకు బలం లేకపోవడంతో ఏకంగా పార్లమెంటునే రద్దు చేసి ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు. అయితే పార్లమెంటును రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజపక్సే పదవిలో కొనసాగడం తగదని సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. దీనికి అనుగుణంగా రాజపక్సే పదవి నుంచి వైదొలిగారు.
డిసెంబరు - 16
¤ శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘె ప్రమాణస్వీకారం చేశారు. అక్టోబరు నెలలో రాజకీయ కారణాలతో అధ్యక్షుడు సిరిసేన.. సింఘెను తొలగించి, ప్రధానిగా మహింద రాజపక్సేను నియమించారు. ఆ తర్వాత పార్లమెంటును కూడా రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయాలను సుప్రీంకోర్టు రద్దు చేసి, విక్రమసింఘెను తిరిగి నియమించాలని ఆదేశించింది.
డిసెంబరు - 18
¤ చైనా ఆర్థిక సంస్కరణలు చేపట్టి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బీజింగ్‌లోని ‘గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌'లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.        » అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని 80 నిమిషాల పాటు ప్రసంగించారు.        » 1978లో చైనా సంస్కరణలు, సరళీకృత ఆర్థిక విధానాలను ప్రారంభించింది. అప్పటివరకూ పేదరికంలో ఉన్న ఈ దేశం ఆ తర్వాత ప్రపంచ ఆర్థికశక్తిగా మారింది.        » జిన్‌పింగ్‌ తన ప్రసంగంలో దివంగత నేత డెంగ్‌ జియావోపింగ్‌ హయాంలో సంస్కరణలు చేపట్టిన నాటి నుంచి చైనా ప్రజల కృషి, ప్రదర్శించిన తెలివితేటలు, ధైర్యసాహసాలు వివరించారు.
డిసెంబరు - 20
¤ ముంబయిలో మొహమ్మద్‌ అలీ జిన్నా నివసించిన భవనం తమకే చెందుతుందని పాకిస్థాన్‌ ఉద్ఘాటించింది. జిన్నా హౌస్‌ను నియంత్రణలోకి తీసుకునేందుకు భారత్‌ చేసే ప్రయత్నాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది.        » జిన్నా ఇంటిని నవీకరించి దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ తరహాలో తీర్చిదిద్దాలని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఆదేశించిందని ఇటీవల విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్‌) నుంచి ఆ భవనాన్ని తమ శాఖకు బదిలీ చేసుకున్నట్లు తెలిపారు.        » ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పాకిస్థాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహమ్మద్‌ ఫైజల్‌ పైవిధంగా స్పందించారు. జిన్నా హౌస్‌ పాక్‌దేనని భారత్‌ గతంలో అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
డిసెంబరు - 21
¤ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి తమ సైనికులను గణనీయంగా వెనక్కి రప్పించనున్నట్లు ప్రకటించారు.        » ట్రంప్‌ నిర్ణయాలపై అమెరికాలో త్రీవ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన విధానాలతో విభేదిస్తూ ఏకంగా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ రాజీనామా చేశారు.        » అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో మన దేశంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అగ్రరాజ్య సైనికులు వెళ్లిపోతే తాలిబన్లు, ఇతర పాకిస్థాన్‌ ఉగ్రసంస్థలు అఫ్గాన్‌లో తిరిగి బలం పుంజుకుంటాయి. అదే జరిగితే అక్కడ భారత్‌ అస్థిత్వానికి ముప్పు ఏర్పడుతుంది. అఫ్గాన్‌లో మనదేశం పెడుతున్న పెట్టుబడులు, చేపడుతున్న ప్రాజెక్టులు వృథా అవుతాయి.
డిసెంబరు - 22
¤ అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ సంక్షోభం తలెత్తింది. ఫెడరల్‌ వ్యయ బిల్లును ఆమోదించకుండానే కాంగ్రెస్‌ వాయిదా పడటంతో ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది. డిసెంబరు 21 అర్ధరాత్రి నుంచి పలు కీలక సంస్థల కార్యకలాపాలు స్తంభించాయి        » మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సుమారు రూ.35 వేల కోట్లు (5 బిలియన్‌ డాలర్లు) కేటాయించాలంటూ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టుబట్టడం, దాన్ని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో తాజా సంకటస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మూతపడటంతో దాదాపు ఎనిమిది లక్షల మంది ఫెడరల్‌ ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశం లేకుండాపోయింది        » ఈ ఏడాది అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూతపడటం ఇది మూడోసారి.
డిసెంబరు - 24
¤ పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు అల్‌ అజీజియా స్టీల్‌ మిల్స్‌ ముడుపుల కేసులో అవినీతి నిరోధక కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించిన ఫ్లాగ్‌షిప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అవినీతి కేసులో మాత్రం విముక్తి ప్రసాదించింది.
డిసెంబరు - 29
¤ ఈజిప్టులో ఉగ్రవాదులపై పోలీసులు భారీ ఎత్తున దాడులు జరిపారు. ఈ దాడుల్లో 40 మంది ముష్కరులను మట్టుబెట్టారు.
డిసెంబరు - 30
¤ బంగ్లాదేశ్‌ ఎన్నికల ప్రాథమిక ఫలితాలు అధికారపార్టీ అవామీ లీగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది.        » ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 151 స్థానాలను అవామీ లీగ్‌ తేలికగా అధిగమించినట్లు ఓ ప్రైవేట్‌ ఛానెల్‌ తెలిపింది.
డిసెంబరు - 31
¤ ఉక్కు మహిళగా పేరుగాంచిన బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా (71) తాజా ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్నిఅధిరోహించనున్నారు. మొత్తంగా హసీనా నాలుగోసారి ప్రధాని పదవిని చేపట్టనున్నారు        » 11వ సాధారణ ఎన్నికల్లో హసీనా పార్టీ అవామీ లీగ్‌ నేతృత్వంలోని మహాకూటమి 300 స్థానాలకుగాను 288 స్థానాలను సాధించినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి హెలాలుద్దీన్‌ అహ్మద్‌ ప్రకటించారు. మొత్తం పోలైన ఓట్లలో 82 శాతం మహాకూటమికే దక్కాయి.        » 2008లో జరిగిన ఎన్నికల్లో 263 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన హసీనా ఈసారి 288 స్థానాలతో ఆ రికార్డును తిరగరాశారు.        » ఈ ఎన్నికల్లో ప్రధాని హసీనాకు 2,29,539 ఓట్లురాగా, ఆమెపై పోటీచేసిన ఎన్‌యూఎఫ్‌ అభ్యర్థికి కేవలం 123 ఓట్లు వచ్చాయి.        » హసీనా 1996లో మొదటిసారి ప్రధాని పదవిని చేపట్టారు. ఆమె హయాంలోనే బంగ్లాదేశ్‌ పౌరుల తలసరి ఆదాయం మూడురెట్లు పెరిగింది. 2017లో దేశ జీడీపీ 250 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

నవంబరు - 2018 రాష్ట్రీయం






No comments:

Post a Comment