పాత పద్ధతిలోనే గ్రూప్‌–2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ

పాత పద్ధతిలోనే గ్రూప్‌–2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలకు మోక్షం లభించనుంది.
  Education Newsగ్రూప్‌–2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌–1లో కలిపి భర్తీచేసేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతోంది. 2016లోనూ ఇవే ప్రతిపాదనలు రాగా నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్పట్లో గ్రూప్‌–1లో విలీనం చేయకుండా పాత పద్ధతిలో గ్రూప్‌–2లోనే ఆ పోస్టులను ఉంచి ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షలతోనే నియామకాలు చేశారు. ఈసారి మళ్లీ అదే ప్రతిపాదనలు కమిషన్‌ నుంచి ప్రభుత్వానికి వెళ్లాయి. ప్రస్తుతమున్న జీఓల ప్రకారం గ్రూప్‌–2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు గ్రూప్‌–1లో కలిపి నోటిఫికేషన్‌ ఇవ్వవలసి ఉంటుందని, ఆ మాదిరిగానే నోటిఫికేషన్‌ ఇవ్వాలా? లేదా అన్న అంశాలను స్పష్టంచేయాలని కమిషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. దీనికోసం నోటిఫికేషన్ల విడుదల కూడా నిలిచిపోయింది. కమిషన్‌ ప్రతిపాదనల ప్రకారం గ్రూప్‌–2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌–1లో కలిపి గ్రూప్‌–1బీ కింద భర్తీచేయాల్సి ఉంటుంది. దీనికి నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కమిషన్‌ ప్రతిపాదనలను తిరస్కరించింది. అదే విధంగా గ్రూప్‌–2లోనే ఈ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీచేసేలా నోటిఫికేషన్‌ ఇచ్చినా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కమిషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, దీనిపై కూడా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. గ్రూప్‌–2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌–1లో విలీనం చేయకుండా పాత పద్ధతిలోనే యథాతథంగా భర్తీచేయాలని స్పష్టంచేస్తూ కమిషన్‌కు ఉత్తర్వులిచ్చింది. అదే విధంగా ఇంటర్వ్యూలకు కూడా అనుమతించలేదు. దీంతో ఎంతోకాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్‌–2 పోస్టుల నోటిఫికేషన్‌కు మార్గం సుగమమైంది. దీంతో పాటు గ్రూప్‌–1 పోస్టుల నోటిఫికేషన్‌ కూడా వెలువడనుంది. గ్రూప్‌–2 పోస్టులకు యథాతథంగా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆన్‌లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్యూలు లేకుండానే పోస్టులు భర్తీచేయనున్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్‌–2, గ్రూప్‌–1 పోస్టుల నోటిఫికేషన్లు డిసెంబర్‌ 26, లేదా 27 తేదీల్లో విడుదల కావచ్చని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. గ్రూప్‌–1 పోస్టులు 182 ఉండగా గ్రూప్‌–2 పోస్టులు 337 ఉన్నాయి.

No comments:

Post a Comment