శాసనశాఖ నిర్మాణం
* రాష్ట్ర పాలనలో కీలకం* శాసన నిర్మాణ శాఖ
* తెలుగు రాష్ట్రాల్లో 2 సభలు
శాసనశాఖ నిర్మాణం
రాష్ట్ర శాసనశాఖలో - గవర్నర్, ఒకటి లేదా రెండు సభలు ఉంటాయి. గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. కానీ శాసనసభలో అంతర్భాగం. ఏకసభా విధానం ఉన్న రాష్ట్రాల్లో విధానసభ (శాసన సభ) మాత్రమే ఉంటుంది. ద్విసభా విధానం ఉన్న రాష్ట్రాల్లో విధానసభతో పాటు, విధానపరిషత్తు (శాసన మండలి) కూడా ఉంటుంది.
విధానసభ
రాష్ట్ర శాసనశాఖలో విధానసభను శాసనసభ లేదా అసెంబ్లీ లేదా దిగువసభ లేదా ప్రజాప్రతినిధుల సభ అంటారు. విధానసభ సభ్యులను ఎమ్మెల్యేలు (శాసనసభ్యులు) అంటారు. ఆర్టికల్ 170 ప్రకారం రాష్ట్ర విధానసభలో సభ్యుల సంఖ్య 500కి మించకుండా, 60కి తగ్గకుండా ఉండాలి. విధానసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉంటుంది.
శాసనసభ్యుల ఎన్నిక
విధానసభ సభ్యులను విధానసభ ప్రాదేశిక నియోజవర్గాల ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఆర్టికల్ 333 ప్రకారం ఆంగ్లో-ఇండియన్ వర్గానికి ప్రాతినిధ్యం లేదని గవర్నర్ భావిస్తే (అంటే ఆంగ్లో ఇండియన్ వర్గానికి చెందినవారెవరూ ఎన్నికల్లో గెలుపొందక పోతే) ఒక ఆంగ్లో-ఇండియన్‌ని విధానసభకు గవర్నర్ నామినేట్ చేయవచ్చు.
అర్హతలు: విధానసభకు ఎన్నిక కావాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలుండాలి.
ప్రమాణ స్వీకారం: విధానసభ సభ్యులు గవర్నర్ సమక్షంలో లేదా గవర్నర్ నియమింంచిన ప్రతినిధి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.
కాలపరిమితి: విధానసభ సాధారణ కాల పరిమితి 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాల లోపల ముఖ్యమంతి సలహా మేరకు గవర్నర్ ఎప్పుడైనా అర్ధంతరంగా విధానసభను రద్దు చేయవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో విధానసభ పదవీ కాలాన్ని పార్లమెంటు ఒక సంవత్సరం పొడిగించవచ్చు.
అధ్యక్షత: విధానసభ సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఆర్టికల్ 178 ప్రకారం విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. అంటే స్పీకర్‌గా ఎన్నికవ్వాలంటే విధానసభ సభ్యుడై ఉండాలి.
స్పీకర్ అధికారాలు
విధానసభ స్పీకర్ అధికారాలు, విధులు లోక్‌సభ స్పీకర్ అధికారాలు, విధులను పోలి ఉంటాయి. అవి..
1. స్పీకర్ విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
2. విధానసభ సమావేశాలు సక్రమంగా, హుందాగా జరగడానికి చర్యలు తీసుకుంటారు.
3. సభలో సభ్యులు ప్రసంగించడానికి, బిల్లులు ప్రవేశపెట్టడానికీ అనుమతి ఇస్తారు. బిల్లులపై ఓటింగ్ పెడతారు. ఏదైనా బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్ఠంభన (సమాన ఓట్లు వస్తే) ఏర్పడినప్పుడు తన నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు) వేసి బిల్లు భవిష్యత్తును నిర్ణయిస్తారు.
4. సభలో ప్రవేశపెట్టే బిల్లు సాధారణ బిల్లా లేదా ఆర్థిక బిల్లా అని నిర్ణయించే అధికారం స్పీకర్‌కి మాత్రమే ఉంటుంది.
5. కోరం లేని సందర్భాల్లో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తారు.
6. విధానసభలో నియమ నిబంధనల గురించి వివరిస్తారు.
7. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడితే సభను వాయిదా వేస్తారు.
8. విధానసభ సభ్యుల రాజీనామాలను ఆమోదించే, తిరస్కరించే అధికారం స్పీకర్‌కు ఉంది.
సమావేశాలు
ఆర్టికల్ 174(1) ప్రకారం విధానసభ సంవత్సరానికి కనీసం రెండు సార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య కాల వ్యవధి 6 నెలలకు మించరాదు. సాధారణంగా విధానసభ సంవత్సరంలో మూడు సార్లు సమావేశం అవుతుంది. అవి..
1. బడ్జెట్ సమావేశాలు
2. వర్షాకాల సమావేశాలు
3. శీతాకాల సమావేశాలు
రాష్ట్ర విధానసభ రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు రూపొందిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు రూపొందించవచ్చు. అయితే ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్ర విధానసభ రూపొందించే చట్టం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే పార్లమెంటు రూపొందించిన చట్టం మాత్రమే అమల్లో ఉంటుంది.
విధానసభ సమావేశంలో లేని సమయంలో గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్‌లను విధానసభ ఆమోదిస్తుంది. సాధారణ బిల్లులను రాష్ట్ర విధానసభలో లేదా రాష్ట్ర విధానపరిషత్‌లో ప్రవేశపెట్టవచ్చు. కానీ సాధారణంగా విధానసభలోనే ముందుగా బిల్లులను ప్రవేశపెడతారు. రెండు సభలూ ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. ఒకవేళ ఏదైనా ఒక బిల్లును విధాన పరిషత్ తిరస్కరించినా, గరిష్ఠంగా 4 నెలలకు మించి కాలయాపన చేసినా అలాంటి బిల్లులను విధాన పరిషత్ ఆమోదంతో సంబంధం లేకుండా గవర్నర్ ఆమోదానికి పంపించవచ్చు. ఇక్కడ విధానసభ నిర్ణయమే అంతిమంగా చెలామణి అవుతుంది. పార్లమెంట్‌లోలాగా ఉభయ సభల సంయుక్త సమావేశ ఏర్పాటుకు అవకాశం లేదు.
కార్యనిర్వాహక అధికారాలు
ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి విధానసభకు వ్యక్తిగతంగా, సమష్టిగా బాధ్యత వహిస్తుంది. విధానసభ విశ్వాసం ఉన్నంత వరకు రాష్ట్ర మంత్రిమండలి అధికారంలో కొనసాగుతుంది. విధానసభ తీర్మానాలు, ప్రశ్నోత్తరాల ద్వారా రాష్ట్ర మంత్రిమండలిని నియంత్రిస్తుంది.
ఆర్థిక అధికారాలు
ఆర్థిక (ద్రవ్య) బిల్లులను ముందుగా విధానసభలోనే ప్రవేశపెట్టాలి. ఆర్థిక బిల్లులను విధానసభ తిరస్కరిస్తే రాష్ట్ర మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
విధాన పరిషత్ ఆర్థిక బిల్లులను 14 రోజుల లోపల ఆమోదించాలి. లేకపోతే విధాన పరిషత్ ఆర్థిక బిల్లులు ఆమోదించినట్లుగా భావించి స్పీకర్ వాటిని గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు.
ఎన్నికల అధికారాలు
రాష్ట్ర విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) రాష్ట్రపతి ఎన్నికల గణంలో సభ్యులు. విధాన పరిషత్‌కు 1/3వ వంతు సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు.
ఇతర విధులు
కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలంటే పార్లమెంటు ఆమోదంతోపాటు రాష్ట్రాల విధానసభల ఆమోదం కూడా అవసరం.
రాష్ట్ర విధానపరిషత్
రాష్ట్ర విధానపరిషత్‌ని శాసనమండలి లేదా ఎగువసభ అంటారు. విధానపరిషత్ సభ్యులను ఎమ్మెల్సీలు అంటారు. ఆర్టికల్ 171 ప్రకారం విధానపరిషత్‌లో సభ్యుల సంఖ్య కనీసం 40కి తగ్గకుండా, రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్యలో 1/3వ వంతుకు మించకుండా ఉండాలి.
ఎన్నిక
ఆర్టికల్ 171(3) ప్రకారం విధాన పరిషత్ సభ్యులను 5 రకాలుగా ఎన్నుకుంటారు.
1. 1/3వ వంతు సభ్యులను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.
2. 1/3వ వంతు సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థల (నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, జిల్లా పరిషత్ ప్రజాప్రతినిధులు) ప్రతినిధులు ఎన్నుకుంటారు.
3. 1/12వ వంతు సభ్యులను ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు.
4. 1/12వ వంతు సభ్యులను రాష్ట్రంలోని పట్టభద్రులు ఎన్నుకుంటారు.
5. 1/6వ వంతు సభ్యులను గవర్నర్ వివిధ రంగాల (సాహిత్యం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ) నిపుణులను నామినేట్ చేస్తారు.
అర్హతలు
విధానపరిషత్‌కు ఎన్నిక కావాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలుండాలి.
కాలవ్యవధి: విధాన పరిషత్ శాశ్వత సభ. ప్రతి రెండు సంవత్సరాలకోసారి మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మంది పదవీ విరమణ చేస్తారు. తిరిగి 1/3వ వంతు మంది ఎన్నికవుతారు. కాబట్టి ఈ సభ నిరంతరం కొనసాగుతుంది. అయితే ఒక్కో సభ్యుడి పదవీ కాలం 6 సంవత్సరాలు.
అధ్యక్షత: విధాన పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి విధాన పరిషత్ సభ్యులు తమలో ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.
ఛైర్మన్ అధికారాలు
1. విధానపరిషత్ ఛైర్మన్ విధానపరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
2. విధాన పరిషత్ సమావేశాలు సక్రమంగా, హుందాగా జరిగేలా చర్యలు తీసుకుంటారు.
3. సభలో సభ్యులు ప్రసంగించడానికి, బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు.
గమనిక: ఒక బిల్లు సాధారణ బిల్లా, ఆర్థిక బిల్లా అని నిర్ణయించే అధికారం విధాన పరిషత్ ఛైర్మన్‌కి ఉండదు.
విధాన పరిషత్ అధికారాలు
రాష్ట్ర విధానసభతో పోలిస్తే.. విధాన పరిషత్‌కు తక్కువ అధికారాలు ఉంటాయి. సాధారణ బిల్లులను విధాన పరిషత్‌లో కూడా ముందుగా ప్రవేశ పెట్టవచ్చు. ఉభయసభల ఆమోదంతో సాధారణ బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. విధానసభ ఆమోదించిన సాధారణ బిల్లులను విధానపరిషత్ 3 నెలల్లోగా ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా పునఃపరిశీలన చేయమని విధానసభకు తిరిగి పంపవచ్చు. అప్పుడు విధానసభ ఆ బిల్లును మళ్లీ ఆమోదించి విధానపరిషత్‌కు నివేదిస్తే నెలలోగా తన నిర్ణయాన్ని తెలియజేయాలి. విధానపరిషత్ దాన్ని ఆమోదించినా, తిరస్కరించినా ఆ బిల్లు ఉభయసభల ఆమోదం పొందినట్లవుతుంది. దీన్నిబట్టి విధాన పరిషత్ సాధారణ బిల్లులను గరిష్ఠంగా 4 నెలల వరకు నిలిపి ఉంచగలదు.
విధాన పరిషత్‌కు రాష్ట్ర మంత్రిమండలిని తొలగించే అధికారం ఉండదు. ఆర్థిక బిల్లులను విధానపరిషత్‌లో ముందుగా ప్రవేశపెట్టకూడదు, ఇది ఆ బిల్లులను తిరస్కరించలేదు. విధానసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను 14 రోజులలోపు విధాన పరిషత్ ఆమోదించాలి.
* భారతదేశంలోని 29 రాష్ట్రాలకు, 22 రాష్ట్రాల్లో (ఆకుపచ్చ రంగు) ఏకసభా విధానం అమల్లో ఉంది. 7 రాష్ట్రాల్లో (నీలి రంగు) మాత్రం ద్విసభావిధానం అమల్లో ఉంది.
* ద్విసభా విధానం అమల్లో ఉన్న రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూకశ్మీర్.
మాదిరి ప్రశ్నలు
1. రాష్ట్ర శాసనమండలిని ఎవరు రద్దు చేయవచ్చు?
ఎ) గవర్నర్ బి) ముఖ్యమంత్రి సి) రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల ఆమోదం, పార్లమెంటు ఆమోదం డి) రాష్ట్రపతి
జ: (సి)
2. కిందివాటిలో శాసనమండలి లేని రాష్ట్రం ఏది?
ఎ) రాజస్థాన్ బి) మహారాష్ట్ర సి) కర్ణాటక డి) బిహార్
జ: (ఎ)
3. రాష్ట్ర శాసనశాఖ అంటే ఏది?
ఎ) విధాన సభ బి) విధాన పరిషత్ సి) విధాన సభ + విధాన పరిషత్ డి) గవర్నర్ + విధాన సభ + విధాన పరిషత్
జ: (డి)
4. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఏకసభా విధానం అమల్లో ఉంది?
ఎ) 20 బి) 21 సి) 22 డి) 29
జ: (సి)
5. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ద్విసభా విధానం అమల్లో ఉంది?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
జ: (సి)
6. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 116 బి) 117 సి) 118 డి) 119
జ: (డి)
7. రాష్ట్ర శాసనశాఖ ఏ అంశాలపై చట్టాలు చేయవచ్చు?
ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్ర జాబితా సి) ఉమ్మడి జాబితా డి) రాష్ట్ర జాబితా + ఉమ్మడి జాబితా
జ: (డి)
8. రాష్ట్ర శాసనశాఖలో సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు?
ఎ) 400 బి) 200 సి) 500 డి) 600
జ: (సి)
9. రాష్ట్ర విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) ఎంతమందిని విధాన పరిషత్‌కు ఎన్నుకుంటారు?
ఎ) 1/4వ వంతు బి) 1/3వ వంతు సి) 1/12వ వంతు డి) 1/6వ వంతు
జ: (బి)
10. ఆర్థిక బిల్లులను మొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి?
ఎ) విధానపరిషత్‌లో మాత్రమే బి) విధానసభ లేదా విధానపరిషత్ సి) ఏదీకాదు డి) విధానసభలో మాత్రమే
జ: (డి)
11. గవర్నర్ ఎంతమంది ఆంగ్లో-ఇండియన్‌లను విధాన సభకు నామినేట్ చేస్తారు?
ఎ) 1 బి) 2 సి) 1/6వ వంతు డి) 1/12వ వంతు
జ: (ఎ)
12. విధానపరిషత్ సభ్యుల పదవీ కాలం ఎన్నేళ్లు?
ఎ) 5 బి) 6 సి) 7 డి) చెప్పలేం
జ: (బి)
13. ఒక బిల్లు ఆర్థిక బిల్లా, సాధారణ బిల్లా అని నిర్ధారించే అధికారం ఎవరికి ఉంది?
ఎ) గవర్నర్ బి) ముఖ్యమంత్రి సి) స్పీకర్ డి) ఛైర్మన్
జ: (సి)
14. గవర్నర్ విధాన పరిషత్‌కు ఎంత మందిని నామినేట్ చేస్తారు?
ఎ) 1/2వ వంతు బి) 1/6వ వంతు సి) 1/12వ వంతు డి) 1/4వ వంతు
జ: (బి)
15. విధానసభ ఒక సమావేశానికి, మరో సమావేశానికి మధ్య వ్యవధి ఎన్ని నెలలకు మించరాదు?
ఎ) 3 బి) 6 సి) 4 డి) 8
జ: (బి)
16. విధాన పరిషత్ ఆర్థిక బిల్లులను ఎంతకాలం లోపల ఆమోదించాలి?
ఎ) 7 రోజులు బి) 14 రోజులు సి) 24 రోజులు డి) 28 రోజులు
జ: (బి)
17. ఉమ్మడి జాబితాలోని అంశంపై కేంద్రం, రాష్ట్రం రెండూ చట్టం చేసినప్పుడు, కేంద్రం చట్టానికి రాష్ట్ర చట్టం వ్యతిరేకంగా ఉంటే ఏ చట్టం చెల్లుబాటు అవుతుంది?
ఎ) రాష్ట్ర చట్టం బి) కేంద్ర చట్టం సి) రెండూ డి) ఏదీకాదు
జ: (బి)