Central Govt Schemes In Telugu: జన్‌ధన్ యోజన

జన్‌ధన్ యోజన


  • సాంకేతికంగా అధునాతన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న మన దేశంలో 2014 వరకు కనీసం 42 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు కూడా లేవు. ఖాతాలు లేని వారిలో ఎక్కువ శాతం పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలే. వీరిలో చాలామంది తమ ఆర్థిక అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద ఏడాదికి 24 శాతం, అంతకంటే ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వేసే చక్ర వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలు కూడా లేకపోవడం వల్ల ప్రభుత్వం వారి కోసం వెచ్చించే అనేక సంక్షేమ పథకాల నిధులు, సబ్సిడీలు పక్కతోవ పడుతున్నాయి. చేరాల్సిన వాళ్లకు చేరకుండా దళారుల పాలవుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు.. దేశంలోని పేద, దిగువ మధ్య తరగతి వర్గాలు సైతం బ్యాంకింగ్ ఫలాలను అనుభవించేలా, ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి బ్యాంకు ఖాతా ఉండేలా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరిచేలా ఈ పథకాన్ని రూపొందించారు.
  • 2014, ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ఈ పథకం బృహత్తర లక్ష్యాలను వివరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ఆగస్టు 23న ప్రారంభించారు. ప్రారంభించిన నాడే 77,000 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపుల ద్వారా కోటీ యాభై లక్షల బ్యాంకు ఖాతాలను పేద, మధ్య తరగతి వారితో తెరిపించారు. జన్‌ధన్ యోజన ఖాతా తెరిచే ప్రతి ఒక్కరికీ రూపే డెబిట్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా తెరిచిన ఆరు నెలల్లో 5,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించారు. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ద్వారా లక్ష రూపాయల బీమా, ఎల్ఐసీ ద్వారా 30,000 రూపాయల జీవిత బీమా కూడా కల్పించడం ఈ పథకం బృహత్తర లక్ష్యాలకు అద్దం పడుతుంది.

  • గిన్నీస్ రికార్డు

  • ఈ పథకం అమలైన వారం రోజుల్లోనే ప్రపంచ గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించి రికార్డు సృష్టించింది. ఆర్థిక సమానత్వం కోసం చేపట్టిన ఈ యోజన ద్వారా ఆగస్టు 23 నుంచి 29 వరకు వారం రోజుల వ్యవధిలో అత్యధికంగా 1,80,96,130 మందికి ప్రభుత్వం బ్యాంకు ఖాతాలు తెరిచినట్టు గిన్నీస్‌బుక్ పేర్కొంది. ఇలా రికార్డులకెక్కిన ఈ యోజన ద్వారా అక్టోబరు 15 నాటికి 18 కోట్ల ఖాతాలు తెరిచారు. వీటిలో 49 శాతం ఖాతాలు మహిళలవి కావడం గమనార్హం. జన్‌ధన్ ద్వారా ఖాతా తెరిచిన ప్రజలు తమ ఖాతాల్లో మొత్తం 25 వేల కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ పథకం కింద ఇప్పటికే 95 శాతం పైగా కుటుంబాలను బ్యాంకింగ్‌కు అనుసంధానం చేశారు. పేదల కోసం వెచ్చించే లక్షల కోట్ల వనరులు, సబ్సిడీల్లో అక్రమాలను అరికట్టడానికి.. వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయడానికి జన్‌ధన్ యోజన దోహదపడింది.