పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ పథకాలు
పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ పథకాలు
* కాలుష్య నియంత్రణ చర్యలు
* 'స్వచ్ఛ' కార్యక్రమాల అమలు
* అడవుల పెంపకానికి కార్యాచరణ
మానవ మనుగడకు ఆధారభూతమైన పర్యావరణాన్ని దారుణంగా దెబ్బతీస్తున్న కారకాల్లో కాలుష్యం ఒకటి. దీని ప్రభావంతో ప్రకృతిలోని గాలి, నీరు, భూమి కలుషితమై.. ప్రజారోగ్యం పాడైపోతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈదిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. తెలంగాణలో కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు, 'స్వచ్ఛ' కార్యక్రమాలపై టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం అధ్యయన సమాచారం.
కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నవ సామాజిక, ఆర్థిక నిర్మాణంలో ముందడుగు వేస్తున్న క్రమంలో కొన్ని సామాజిక, ఆర్థిక అడ్డంకులను ఎదుర్కోవడం సహజం. ఆ కోణంలో పరిశీలిస్తే తెలంగాణ ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉంది. కాలుష్యాన్ని నివారించే క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో జలహారం, స్వచ్ఛ తెలంగాణ, హరితహారం, మన ఊరు-మన ప్రణాళిక లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలందరి భాగస్వామ్యంలో అమలు చేస్తూ ప్రణాళికలను రూపొందించింది.
మనచుట్టూ ఆవరించి ఉన్న జీవ, నిర్జీవ సమూహాల మొత్తాన్ని పర్యావరణం అంటారు. ఈ పర్యావరణం కాలుష్యం బారిన పడటానికి కారణమయ్యే పరిశ్రమలు అత్యధికంగా హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిద్వారా వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణం బాగా కలుషితమవుతోంది. పారిశ్రామిక, రసాయనిక, జీవ వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతిని, వరుసగా భూమి, జల, వాయు కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం భూగర్భజలం కలుషితమవుతోంది. రసాయన, క్రిమి సంహారక, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు దాదాపు 75 శాతం నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.
మూసీ నదీపరివాహక ప్రాంతాలైన రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో చిన్న కార్ఖానాలు (పరిశ్రమలు) చాలా ఉన్నాయి. వీటి ద్వారా కూడా వ్యర్థ పదార్థాలు ఎక్కువ మోతాదులో విడుదలవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జనాభా కూడా చాలా ఎక్కువ. దీంతో ఈ కలుషితాల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లోని కలుషిత నీటి వల్ల చుట్టూ ఉండే ప్రజలు తీవ్రమైన పర్యావరణ కాలుష్య ప్రభావానికి గురవుతున్నారు.
పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే రకంగా లేవు. అత్యధిక పర్యావరణ కాలుష్యానికి గురిచేసే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
2015లో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సర్వే కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల వివరాలు, శాతాలను ఇటీవల పేర్కొంది. ఆ వివరాలు..
చట్ట వ్యతిరేకంగా అధిక కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్నాయి. ఇవి ఎక్కువగా రసాయన, జీవ వ్యర్థ పదార్థాలను సమీపంలోని కాలువలు, నదులు, డ్రైనేజీల్లోకి విడుదల చేస్తున్నాయి. దాంతో ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లోని దాదాపు 5 వేల గ్రామాల్లో ధ్వని, వాయు, రేడియోధార్మిక కాలుష్యాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమైన భూగర్భ జలాలను వినియోగిస్తున్న ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ రకమైన కలుషిత పదార్థాల వల్ల చర్మ, శ్వాస, గుండె, నేత్ర, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులతోపాటు అల్సర్లు, కీళ్లనొప్పులు వంటివాటి బారిన పడుతున్నారు. భయంకరమైన క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా గురవుతున్నారు.
రాష్ట్రంలో కాలుష్య నివారణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు..
స్వచ్ఛ తెలంగాణ
భారత ప్రభుత్వం 2014, అక్టోబరు 2న స్వచ్ఛభారత్ అభియాన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4,041 పట్టణాల్లో క్లీన్ - స్ట్రీట్, రోడ్ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. దీనికంటే ముందు యూపీఏ ప్రభుత్వం రూ.37,159 కోట్లతో గ్రామీణ శానిటేషన్ కోసం 'నిర్మల్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2015, మే 16న 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్'ను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. 'స్వచ్ఛ తెలంగాణ' కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో 68 పట్టణాల్లో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. రాబోయే అయిదేళ్లలో కాలుష్యరహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్‌లో రూ. 979 కోట్లు కేటాయించారు.
ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 476 నగరాలను సర్వే చేయగా మైసూరు (కర్ణాటక) మొదటిస్థానంలో నిలిచింది. రాజధానులవారీగా చేసిన సర్వేలో ప్రథమ స్థానంలో బెంగళూరు, చివరిస్థానంలో పట్నా(బిహార్) ఉన్నాయి. హైదరాబాద్ 275, వరంగల్ 33 స్థానాల్లో ఉన్నాయి.
జలహారం
ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే జలహారం. దీన్నే 'వాటర్ గ్రిడ్' పథకం అంటారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో 130 లీటర్ల చొప్పున నీటిని అందించాలనేది లక్ష్యం. దీన్ని మొదట నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' లభించింది.
మన ఊరు - మన ప్రణాళిక
తెలంగాణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'మన ఊరు - మన ప్రణాళిక' పేరుతో అయిదేళ్లపాటు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రూ. 22,500 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా చెరువులను పునరుద్ధరించడం ద్వారా జీవవైవిధ్యాన్ని సమతౌల్యం చేయడానికి వీలవుతుంది. దీనివల్ల చెరువుల పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, వివిధ జీవాలను పెంచడం సాధ్యమవుతుంది.
జీవవైవిధ్యం
పర్యావరణాన్ని పెంపొందించడానికి 2002లో రాష్ట్ర అటవీ పథకాన్ని (స్టేట్ ఫారెస్ట్ పాలసీ) తిరిగి ప్రారంభించారు. దీని ప్రకారం విజన్-2020లో వివిధ రకాల అటవీ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫారెస్ట్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రాష్ట్రంలో 3 అంచెల పద్ధతిని ప్రవేశపెట్టారు.
1) రాష్ట్ర స్థాయి - స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎస్ఎఫ్‌డీఏ)
2) డివిజన్ స్థాయి - ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ)
3) గ్రామ స్థాయి - వన సంరక్షణ సమితి (వీఎస్ఎస్)
పర్యావరణంపై అవగాహన
నేటి తరానికి పర్యావరణం పట్ల అవగాహన కలిగించడంలో పర్యావరణ పరిరక్షణ సమూహాలు (ఇకో క్లబ్స్) ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వీటిని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు; విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టారు. ఇవి చేపట్టే వివిధ పర్యావరణ సానుకూల చర్యల కోసం కేంద్ర పర్యావరణ శాఖ నిధులను మంజూరు చేస్తుంది.
సమూహ కార్యక్రమాలు
* పర్యావరణం కలుషితమైన ప్రదేశాలు, పతనావస్థలో ఉన్న ప్రాంతాలు, వన్యప్రాణులున్న జంతు ప్రదర్శన శాలలను దర్శించడం.* వివిధ సంస్థల్లో పర్యావరణ సమస్యలు / అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాలు, చర్చలు, ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేయడం.* బాణాసంచా, లౌడ్ స్పీకర్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం.* కాలుష్య నియంత్రణలో వినూత్న మార్గాలను అన్వేషించి, వాటిని అమలు పరిచే సంస్థలకు అందించడం.* రహదారుల అందాన్ని, పరిశుభ్రతను పెంచేందుకు చెట్లు, పూల మొక్కలు పెంచడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం.
హరితహారం
మిశ్రమ మొక్కల పథకం కింద తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ సమతౌల్యం సాధించడానికి ప్రస్తుతం ఉన్న 25 శాతం అడవులను 33 శాతానికి పెంచడం ఈ పథకం ఉద్దేశం. 'మన ప్రణాళిక' అనే కార్యక్రమం కింద రాష్ట్రంలో 3,889 నర్సరీలను గుర్తించారు. 2015 నాటికి 40 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు.
మొదటగా ఈ పథకాన్ని 2015, జులై 3-7 వరకు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం 2014-15లో సీఏఎమ్‌పీఏ (కాంపన్సేటరీ ఎఫారిస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) కార్యక్రమాన్ని చేపట్టింది.
ముఖ్యాంశాలు
* అంతర్జాతీయ బయో డైవర్సిటీ దినోత్సవాన్ని మే 22న నిర్వహిస్తారు.* ప్రపంచంలో మొత్తం 170 బయోడైవర్సిటీ బోర్డులుండగా.. తెలంగాణలోని 10 జిల్లాలోని 66 మండలాల్లోను, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ బయో డైవర్సిటీ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.* తెలంగాణలో (2014-15) 3 జాతీయ పార్కులు, 9 వన్యప్రాణి కేంద్రాలు, 4 జింకల పార్కులు, 2 జంతు ప్రదర్శన శాలలు, 65 సాక్రెడ్ గ్రూవ్స్ ఉన్నాయి.* కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2015లో తెలంగాణలో 'ప్రాణహిత'ను పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది. ఈ ప్రాంతం చుట్టూ 5 కి.మీ. పరిధిలో పలురకాల జంతువులను పెంచాలని నిర్ణయించింది.
మాదిరి ప్రశ్నలు
1. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?ఎ) జూన్ 5 బి) మార్చి 21 సి) మార్చి 8 డి) మే 22జ: (డి)2. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది?ఎ) మంజీర బి) ప్రాణహిత సి) అలీసాగర్ డి) కిన్నెరసానిజ: (బి) 3. కిందివాటిలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో పర్యావరణంతో సంబంధం లేనిది ఏది?ఎ) ఆసరా బి) జలహారం సి) స్వచ్ఛ తెలంగాణ డి) హరితహారంజ: (ఎ)4. తెలంగాణలో అత్యధిక పారిశ్రామిక, రసాయన కేంద్రాలు ఉన్న జిల్లాలు ఏవి?ఎ) రంగారెడ్డి బి) మెదక్ సి) హైదరాబాద్ డి) పైవన్నీజ: (డి) 5. తెలంగాణ పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో 75% నుంచి 80% రసాయన, క్రిమి, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఏ రకమైన కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలిపింది?ఎ) నీటి బి) వాయు సి) ధ్వని డి) రేడియోధార్మికజ: (ఎ)6. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?ఎ) మే 22 బి) మార్చి 21 సి) డిసెంబరు 10 డి) జూన్ 21జ: (బి) 7. 'ఫ్లోరైడ్ (F2)' సమస్య అధికంగా ఉన్న తెలంగాణ జిల్లా ఏది?ఎ) మెదక్ బి) రంగారెడ్డి సి) నల్గొండ డి) వరంగల్జ: (సి) 8. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిశ్రమల మొత్తంలో కాలుష్యం లేని పరిశ్రమల శాతం ఎంత?ఎ) 29.58% బి) 64.98% సి) 5.43% డి) 0.033%జ: (సి) 9. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?ఎ) ఈఎస్ఎల్ నరసింహన్ బి) కె.చంద్రశేఖర్ రావు సి) కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా డి) రాజీవ్ శర్మజ: (ఎ)10. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఏ రోజున చేపట్టారు?ఎ) 2015, మే 10 - 14 బి) 2015, మే 16 - 20 సి) 2015, మే 20 - 24 డి) 2015, మే 1 - 4జ: (బి) 11. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' కిందివాటిలో దేనికి లభించింది?ఎ) హరితహారం బి) స్వచ్ఛ తెలంగాణ సి) జలహారం డి) మన ఊరు - మన ప్రణాళికజ: (సి) 12. 'క్లీన్ ఇండియా మిషన్'లో ఇటీవల భారతదేశ 476 నగరాల్లో తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ నగరం ఎన్నో స్థానం దక్కించుకుంది?ఎ) 275 బి) 34 సి) 33 డి) 13జ: (సి) 13. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు?ఎ) 2015, జులై 3 - 7 బి) 2015, జులై 7 - 10 సి) 2015, ఆగస్టు 3 - 7 డి) 2015, సెప్టెంబరు 7-10జ: (ఎ)
పర్యావరణ అంశాలు- వరద విపత్తులు
భారత ఉపరాష్ట్రపతులు - ప్రత్యేకతలు
తెలంగాణలో 1969 నాటి పరిణామాలు
Complete GK Material For TSPSC Exams 2018