లిపిడ్‌లు.. ప్రోటీన్‌లు

లిపిడ్‌లు.. ప్రోటీన్‌లు

* స్థూల పోషక పదార్థాలు
* శరీరానికెంతో అవసరం

  • మాన‌వ శ‌రీరం నిర్వహించాల్సిన విధుల‌కు, ఆరోగ్యక‌ర జీవ‌నానికి అనేక రకాల పోష‌క ప‌దార్థాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. వీటిలో ప్రధాన‌మైన స్థూల పోష‌క ప‌దార్థాలు లిపిడ్‌లు, ప్రోటీన్‌లు...శ‌రీరానికి ఎక్కువ మొత్తంలో వీటి అవ‌స‌రం ఉంటుంది. కొవ్వులు శ‌రీర నిర్మానానికి తోడ్పడ‌గా, ప్రోటీన్‌లు శ‌క్తిని అందివ్వడానికి దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇంత‌టి ప్రాధాన్యం ఉన్న లిపిడ్‌లు, ప్రోటీన్‌ల నిర్మాణం... అవి దొరికే ప‌దార్థాలు..శ‌రీరంలో అవి ఉండే ప్రాంతాలు..వాటి విధులు..త‌దిత‌ర అంశాల‌ను తెలుసుకుందాం.
  • లిపిడ్‌లు (Lipids)
  • కొవ్వులు స్థూలపోషక పదార్థాలు. మన శరీరానికి ఎక్కువ మొత్తంలో ఇవి అవసరం. ఇవి కర్బన ద్రావణంలో కరుగుతాయి. శరీర నిర్మాణానికి, కణత్వచాలు ఏర్పడటానికి, శరీరానికి శక్తిని అందించడానికి, కొన్ని హార్మోన్ల సంశ్లేషణకు, మెదడు, నాడీవ్యవస్థ సరిగా పనిచేయడానికి, కొవ్వులో కరిగే విటమిన్ల (ఎ, డి, ఇ, కె) శోషణకు ఇవి అవసరం.
  • మన శరీరంలోని కాలేయంలో, చర్మం కింద, ఇతర భాగాల్లో కొవ్వులు నిల్వ ఉంటాయి. వివిధ భాగాల్లో పసుపు కొవ్వు అడిపోజ్ కణజాల రూపంలో ఉంటుంది. కొవ్వులను లేదా నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల స్థూలకాయం వస్తుంది. దీనివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు వస్తాయి.
  • లిపిడ్‌లు మూడు రకాలు
    1. సరళ లిపిడ్‌లు: కొవ్వులు, నూనెలు, మైనం (waxes).
    2. సంయుక్త లిపిడ్‌లు (compound lipids): ఫాస్ఫో లిపిడ్‌లు, గ్లైకో లిపిడ్‌లు, సల్ఫో లిపిడ్‌లు, లిపో ప్రోటీన్‌లు.
    3. ఉత్పన్న లిపిడ్‌లు (derived lipids): విటమిన్‌లు ఎ, డి, ఇ, కె 
  • లిపిడ్‌ల నిర్మాణాత్మక ప్రమాణాలు కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ ఆసిడ్స్). సరళ లిపిడ్‌లలో కొవ్వు ఆమ్లాలతోపాటు గ్లిజరాల్, సంయుక్త లిపిడ్‌లలో కొవ్వు ఆమ్లాలు ఇతర పదార్థాలతో కలిసి ఉంటాయి.
  • కొవ్యులు, నూనెలు లభించే ఆహార పదార్థాలు:
  • మన శరీరానికి కొవ్వులు, నూనెలు జంతువుల కొవ్వు, పాలు, వెన్న, నెయ్యి, వనస్పతి, కోడిగుడ్డు (పచ్చసొన); మొక్కల నూనెలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయా, ఆలివ్, పత్తిగింజల నూనె, కొబ్బరినూనె.. ద్వారా లభిస్తాయి. వీటిలో వనస్పతి నేరుగా లభించదు. మొక్కల శాఖీయ నూనెలను హైడ్రోజనీకరణం ద్వారా వనస్పతిగా మారుస్తారు.
    ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు: లినోలిక్ ఆమ్లం (Linoleic acid), లినోలెనిక్ ఆమ్లం (Linolenic acid), అరాఖిడోనిక్ ఆమ్లం (Arachidonic acid) లాంటి కొవ్వు ఆమ్లాలను ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు అంటారు. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. కాబట్టి తప్పనిసరిగా ఆహారం ద్వారా తీసుకోవాలి. వీటిలో లినోలెనిక్ ఆమ్లాన్ని ఒమెగా-3-కొవ్వు ఆమ్లం (Omega-3-fatty acid) అంటారు. ఇది నాడీవ్యవస్థ అభివృద్ధికి, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచడానికి అవసరం.
    కొవ్వులు, నూనెల రకాలు: కొవ్వు ఆమ్లాల్లోని కార్బన్ పరమాణువుల మధ్య ఉండే బంధాలను బట్టి వీటిని 2 రకాలుగా విభజించారు. అవి..
  • 1. సంతృప్త కొవ్వులు (Saturated fats)
  • వీటి కొవ్వు ఆమ్లాల్లోని కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధాలు ఉండవు. జంతువుల నుంచి లభించే కొవ్వులైన మీగడ, నెయ్యి, జంతుమాంసంలో ఉండే కొవ్వు, కోడిగుడ్డు పచ్చసొన, వెన్న లాంటి వాటిలో ఉండే కొవ్వులు; మొక్కల నూనెలైన పామాయిల్, కొబ్బరినూనె వీటికి ఉదాహరణ. సంతృప్త కొవ్వులు చెడ్డ కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తాయి. లో డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL), వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ (VLDL) లను చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు.
    చెడ్డ కొలెస్ట్రాల్ వల్ల హాని: చెడ్డ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో.. ముఖ్యంగా ధమనుల్లో పేరుకుపోవడం వల్ల ధమని వ్యాసం తగ్గి క్రమంగా గట్టిపడుతుంది. ఈ పరిస్థితినే అథిరోస్ల్కీరోసిస్ (Atherosclerosis) అంటారు.
  • గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనిలో చెడ్డ కొలెస్ట్రాల్ జమకూడి అథిరోస్ల్కీరోసిస్‌కు గురైనప్పుడు గుండెకు తగినంత రక్తం సరఫరా కాకపోవడంతో గుండెపోటు రావచ్చు. ఇదేవిధంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో అథిరోస్ల్కీరోసిస్ జరిగి చెడ్డకొలెస్ట్రాల్ జమ కూడటం వల్ల మెదడులోని భాగాలకు రక్తప్రసరణ జరగక పక్షవాతం రావచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి చెడ్డకొలెస్ట్రాల్‌ను పెంపొందించే కొవ్వులను తక్కువగా తీసుకోవాలి. నడక, వ్యాయామం, శారీరక శ్రమ లాంటివాటి వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
  • 2. అసంతృప్త కొవ్వులు (Unsaturated fats)
  • వీటిలో ఉన్న అణువుల మధ్య ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలుంటాయి. ఇవి రెండు రకాలు.
    1. ఏక అసంతృప్త కొవ్వులు: వీటిలో ఒకే ద్విబంధం ఉంటుంది.
    ఉదా: వేరుశనగ నూనె, ఆలివ్ నూనె.
    2. బహుళ అసంతృప్త కొవ్వులు: వీటిలో అణువుల మధ్య రెండు లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలుంటాయి.
    ఉదా: సన్‌ఫ్లవర్ నూనె, సోయాబీన్ నూనె.
  • అసంతృప్త కొవ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అయిన హైడెన్సిటీ లిపో ప్రొటీన్ (HDL)పెరుగుతుంది. ఇది చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి వీటిని ఆహారం ద్వారా తీసుకోవడం శ్రేయస్కరం.
  • ప్రోటీన్‌లు
  • ప్రోటీన్‌లు కూడా స్థూల పోషక పదార్థాలు. అందువల్ల ఇవి కూడా శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం. మన శరీర పెరుగుదలకు, అభివృద్ధికి; గాయాలు మానడానికి, కణంలో ప్రోటీన్‌ల తయారీకి, శక్తిని ఇవ్వడానికి ఇవి అవసరం. శరీరంలో వివిధ జీవక్రియలకు ఉపయోగపడే ఎంజైమ్‌లన్నీ ప్రోటీన్‌లతో ఏర్పడతాయి. నియంత్రణ, సమన్వయానికి ఉపయోగపడే హార్మోన్లలో ఎక్కువభాగం ప్రోటీన్‌ల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి.
  • ప్రోటీన్‌ల నిర్మాణాత్మక ప్రమాణాలు అమైనో ఆమ్లాలు. అంటే ప్రోటీన్‌లన్నీ అమైనో ఆమ్లాలతో నిర్మితమై ఉంటాయి. రెండు అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాలతో కలిపి ఉంటాయి. అనేక అమైనో ఆమ్లాలు, పెప్టైడ్ బంధాలు కలిసి పాలీపెప్టైడ్ గొలుసును ఏర్పరుస్తాయి. పాలీపెప్టైడ్ గొలుసు ముడతలు పడి ప్రోటీన్‌ను ఏర్పరుస్తుంది. ఒక ప్రోటీన్‌లో కనీసం ఒక పాలీపెప్టైడ్ గొలుసు ఉంటుంది.
  • మన శరీరానికి అవసరమయ్యే విధానాన్ని బట్టి అమైనో ఆమ్లాలు రెండు రకాలు. అవి.. 1. ఆవశ్యక అమైనో ఆమ్లాలు 2. అనావశ్యక అమైనో ఆమ్లాలు.
    ఆవశ్యక అమైనో ఆమ్లాలు: ఇవి మన శరీరంలో తయారు కావు. వీటిని మనం ఆహారం ద్వారా తీసుకోవాలి. జంతువుల ప్రోటీన్‌లలో అన్ని ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి వీటిని జీవశాస్త్రీయ పరిపూర్ణ ప్రోటీన్‌లు అంటారు. ఉదా: థ్రియోనైన్, ఫీనైల్ఎలనైన్, ట్రిప్టోఫాన్, వాలిన్, లైసిన్, ల్యూసిన్, మిథియోనైన్, ఐసోల్యూసిన్.
    అనావశ్యక అమైనో ఆమ్లాలు: ఇవి మన శరీరంలో తయారవుతాయి. వీటిని మనం ఆహారం ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉదా: గ్లైసిన్, అలనైన్, సీరైన్, సిస్టీన్, సిస్త్టెన్, ఆస్పార్టిక్ ఆమ్లం, ఆర్జినైన్, హిస్టడైన్, టైరోసిన్, ప్రోలీన్, హైడ్రాక్సి ప్రోలిన్.
    లభించే ఆహార పదార్థాలు: ప్రోటీన్‌లు మనకు మాంసం, పాలు, గుడ్డులోని తెల్లసొన, పప్పులు, నట్స్ వంటి వాటి ద్వారా లభిస్తాయి. సోయాలో అత్యధిక ప్రోటీన్‌లు ఉంటాయి. దీనిలో ప్రోటీన్‌లతోపాటు లిపిడ్‌లు, కార్బోహైడ్రేట్‌లు కూడా ఉంటాయి.

    వర్గీకరణ: ప్రోటీన్‌ల రసాయనిక స్వభావాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. అవి. 1. సామాన్య ప్రొటీన్‌లు, 2. సంయుగ్మ ప్రొటీన్‌లు, 3. ఉత్పన్న ప్రోటీన్‌లు. వీటిలో కొన్ని ప్రోటీన్‌లు వివిధ ఆహార పదార్థాల్లో ఉంటాయి. మరికొన్ని మన శరీరంలోని వివిధ భాగాల్లో నిర్మాణాత్మకంగా ఉంటాయి.
  • మాదిరి ప్రశ్నలు
    1. లిపిడ్‌లు మన శరీరానికి ఏ విధంగా అవసరమవుతాయి?
    ఎ) శరీర నిర్మాణానికి బి) కణత్వచాల నిర్మాణానికి సి) శక్తిని ఇవ్వడానికి డి) పైఅన్ని విధాలుగా
    జ: (డి)
    2. మన శరీరంలో పసుపు రంగు కొవ్వు ఏ రూపంలో నిల్వ ఉంటుంది?
    ఎ) అడిపోజ్ కణజాలం బి) తంతుయుత కణజాలం సి) బంధన కణజాలం డి) స్థితిస్థాపక (ఎలాస్టిక్) కణజాలం
    జ: (ఎ)
    3. కొవ్వు ఆమ్లాలు ఇతర పదార్థాలతో కలిసి ఏర్పరిచే సంయుక్త లిపిడ్‌లకు ఉదాహరణ ... ?
    ఎ) ఫాస్ఫో లిపిడ్‌లు బి) గ్లైకో లిపిడ్‌లు సి) సల్ఫో లిపిడ్‌లు డి) పైవన్నీ
    జ: (డి)
    4. కింది వాటిలో హైడ్రోజనీకరణం ద్వారా తయారయ్యే పదార్థం?
    ఎ) నెయ్యి బి) వెన్న సి) వనస్పతి డి) పామ్ఆయిల్
    జ: (సి)
    5. నాడీవ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడే ఓమేగా-3-కొవ్వు ఆమ్లానికి ఉదాహరణ ?
    ఎ) బ్యుటరిక్ బి) లినోలెనిక్ సి) స్టియరిక్ డి) పామిటిక్
    జ: (బి)
    6. చెడ్డ కొలెస్ట్రాల్‌ను పెంపొందించే సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండే ఆహారం ఏది?
    ఎ) కోడిగుడ్డు పచ్చసొన బి) వెన్న సి) వనస్పతి డి) పైవన్నీ
    జ: (డి)
    7. ఆరాఖిడిక్ కొవ్వు ఆమ్లం కింది ఏ నూనెలో ఎక్కువగా ఉంటుంది?
    ఎ) వేరుశనగ బి) కొబ్బరి సి) సోయా డి) అవిసె
    జ: (ఎ)
    8. గుండె జబ్బులు ఉన్నవారు కింది ఏ నూనెను ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం మంచిది కాదు?
    ఎ) సన్‌ఫ్లవర్ బి) సోయానూనె సి) పామ్ఆయిల్ డి) ఆలివ్‌నూనె
    జ: (సి)
    9. కింది ఏ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అథిరోస్ల్కీరోసిస్ వస్తుంది?
    ఎ) కార్బోహైడ్రేట్‌లు బి) ప్రోటీన్‌లు సి) చెడ్డకొలెస్ట్రాల్ ఉన్న కొవ్వు డి) ఆల్కహాల్
    జ: (సి)
    10. కరోనరీ ధమనుల్లో చెడ్డ కొలెస్ట్రాల్ జమకూడటం వల్ల ఎలాంటి హాని కలుగుతుంది?
    ఎ) గుండెపోటు రావచ్చు బి) పక్షవాతం రావచ్చు సి) మూత్రపిండాల వైఫల్యం డి) కాలేయం దెబ్బతింటుంది
    జ: (ఎ)
    11. మన శరీరానికి ప్రోటీన్‌లు ఏ విధంగా అవసరమవుతాయి?
    ఎ) పెరుగుదల, అభివృద్ధికి బి) గాయాలు మానడానికి సి) ప్రోటీన్‌ల తయారీకి డి) పైఅన్ని విధాలుగా
    జ: (డి)

    జీవ పరిణామసిద్ధాంతాలు


    No comments:

    Post a Comment