భారత ఉపరాష్ట్రపతులు - ప్రత్యేకతలు
రాజ్యాంగంలోని 63వ అధికరణప్రకారం దేశానికి ఉపరాష్ట్రపతి ఉంటారు. ఈ పదవి భారత్లో రెండో అత్యున్నత రాజ్యాంగ స్థానం. భారత రాజ్యాంగంలోని 66వ అధికరణ ప్రకారం పార్లమెంట్ సభ్యులు రహస్య బాలెట్ విధానం ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
|
ఈ పదవి చేపట్టిన వారు రాజ్యసభ చైర్మన్గాను వ్యవహరిస్తారు. ఏదైనా కారణంతో రాష్ట్రపతి పదవి ఖాళీ అయినా, లేదా రాష్ట్రపతి విధులకు హాజరుకాలేని పరిస్థితిలో ఉన్నా.. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులను నిర్వర్తిస్తారు. ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 ఏళ్లు.
ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వారు ఈ పదవి నిర్వర్తించినందుకు గాను ఎలాంటి వేతనం పొందరు. రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రం నెలకు రూ. 1,25,000 వేతనం అందుతుంది. రవాణా, వసతి, వైద్యం తదితర భత్యాలు అదనంగా ఉంటాయి. ఇటీవల వేతనాన్ని రూ. 3.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. భారత ఉప రాష్ట్రపతులు 1. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని చెన్నై(మద్రాస్)కు చెందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత మొదటి ఉపరాష్ట్రపతిగా 1952 మే 13న బాధ్యతలు చేపట్టారు. రెండు పర్యాయాలు (1952, 1957) ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఆయన 1962 మే 12 వరకు పదవిలో ఉన్నారు. భారత 2వ రాష్ట్రపతిగాను పనిచేశారు. 1954లో ఆయన ప్రభుత్వం నుంచి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు. రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. 2. డా. జాకీర్ హుస్సేన్ అప్పటి హైదరాబాద్ సంస్థానంలో జన్మించిన జాకీర్ హుస్సేన్ భారత రెండో ఉపరాష్ట్రపతిగా 1962 మే 13న బాధ్యతలు చేపట్టారు. 1967 మే 12 వరకు ఈ పదవిలో ఉన్నారు. 1967 మే 13 నుంచి 1969 మే 3 వరకు ఆయన భారత 3వ రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్రపతి పదవిలో ఉండగానే మరణించిన మొదటి వ్యక్తి జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్.. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 1963లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. 3. వరాహగిరి వెంకటగిరి ఒడిశాకు చెందిన వరాహగిరి వెంకటగిరి 1967 మే 13 - 1969 మే 3 వరకు భారత 3వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణంతో.. వెంకటగిరి రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టారు. 1975లో ఆయన భారతరత్న అందుకున్నారు. 4. గోపాల్ స్వరూప్ పాథక్ ఉత్తరప్రదేశ్కు చెందిన గోపాల్ స్వరూప్ పాథక్ 1969 ఆగస్టు 31న ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు. 1960-1966 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. 5. బసప్ప దానప్ప జట్టి కర్ణాటకకు చెందిన బసప్ప దానప్ప జట్టి.. 1974 ఆగస్టు 31న భారత 5వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 1979 ఆగస్టు 30 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. 1977లో అప్పటి రాష్ట్రపతి డా. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణంతో దానప్ప జట్టి స్వల్ప కాలం (ఫిబ్రవరి - జూలై) తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యత లు నిర్వర్తించారు. 6. జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా భారత 6వ ఉపరాష్ట్రపతిగా 1979 ఆగస్టు 31 - 1984 ఆగస్టు 30 వరకు పనిచేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయన 1969 జూలై 20 - 1969 ఆగస్టు 24, 1982 అక్టోబర్ 6 - 1982 అక్టోబర్ 31 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగాను సేవలందించారు. 11వ భారత ప్రధాన న్యాయమూర్తిగాను పనిచేశారు. 7. డా. రామస్వామి వెంకటరామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన డా. రామస్వామి వెంకటరామన్ 1984 ఆగస్టు 31 - 1987 జూలై 24 వరకు భారత 7వ ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన 1942లో జైలుకెళ్లారు. జూలై 1987 నుంచి జూలై 1992 వరకు భారత 8వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. 8. డా.శంకర్ దయాల్ శర్మ డా. శంకర్ దయాల్ శర్మ 1987 సెప్టెంబర్ 3 - 1992 జూలై 24 వరకు భారత 8వ ఉపరాష్ట్రతిగా సేవలందించారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పనిచేశారు. మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్గా వ్యవహరించారు. 9. కె.ఆర్. నారాయణన్ దేశంలో రెండో అత్యున్నత స్థానమైన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన మొదటి దళిత వ్యక్తి.. కొచెరిల్ రామన్ నారాయణన్. కేరళ రాష్ట్రానికి చెందిన ఈయన 1992 ఆగస్టు 21 - 1997 జూలై 24 వరకు భారత 9వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1997లో భారత 10వ రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టారు. 10. కృషన్ కాంత్ పంజాబ్కు చెందిన కృషన్ కాంత్ 1997 ఆగస్టు 21 - 2002 జూలై 27 వరకు భారత 10వ ఉపరాష్ట్రతి పదవిలో ఉన్నారు. 1989లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన ఆయన ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. తద్వారా సుదీర్ఘ కాలం పాటు గవర్నర్గా పనిచేసిన వారిలో ఒకరిగా నిలిచారు. 11. బైరాన్ సింగ్ శెఖావత్ రాజస్తాన్కు చెందిన బైరాన్ సింగ్ శెఖావత్ భారత 11వ ఉపరాష్ట్రపతిగా 2002 - 2007 వరకు పనిచేశారు. అంతకముందు ఆయన 3 సార్లు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన శెఖావత్.. రాజస్తాన్ ఏకైక సింహం అనే బిరుదుని దక్కించుకున్నారు. 12. మహమ్మద్ హమీద్ అన్సారీ పశ్చిమబెంగాల్ నుంచి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన మహమ్మద్ హమీద్ అన్సారీ.. 2007 ఆగస్టు 11 నుంచి 2017 ఆగస్టు 10 వరకు(రెండు పర్యాయాలు - 2007, 2012) ఈ పదవిలో ఉన్నారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత భారత ఉపరాష్ట్రపతి పదవికి రెండోసారి ఎన్నికైన వ్యక్తి.. మహమ్మద్ అన్సారీ. అలాగే.. ముగ్గురు రాష్ట్రపతుల(ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్) పదవీ కాలంలో పనిచేసిన మొదటి ఉపరాష్ట్రపతిగా ఆయన గుర్తింపు పొందారు. 13. ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు.. 2017 ఆగస్టు 11న భారత 13వ రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టారు. అంతకముందు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వాజ్పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002-2004 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. |