కర్ణాటక యుద్ధాలు
భారతదేశానికి వర్తకం పేరుతో వచ్చిన డచ్, పోర్చుగీస్ తదితర దేశాలవారు అనేక కారణాలతో నిష్క్రమించినా మిగిలిన రెండు ప్రధాన ఐరోపా వర్తక కంపెనీల (బ్రిటిష్, ఫ్రెంచ్) మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. 1740 తర్వాత మన దేశంలో ఆధిపత్యం కోసం ఫ్రెంచ్, బ్రిటిషర్లు ఎన్నో యుద్ధాలకు కారకులయ్యారు. వీటిలో కర్ణాటక, ప్లాసీ, బక్సార్, మైసూర్ యుద్ధాలు ప్రధానమైనవి. వీటిపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.భారతదేశపు ఆగ్నేయ తీరంలోని ఆర్కాట్ రాజధానిగా సాదతుల్లా ఖాన్ స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు కర్ణాటక రాజ్యం దక్కన్‌లోని ఒక మొగల్ సుబాగా.. హైదరాబాద్ నిజాం నామమాత్రపు నియంత్రణలో ఉండేది. ఈ ప్రాంతంలో జరిగిన అంతర్యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచివారు చెరో వర్గాన్ని సమర్థించారు. చివరకు బ్రిటిషర్లు ఫ్రెంచివారిపై ఆధిపత్యం సాధించారు.
మొదటి కర్ణాటక యుద్ధం (1745-1748)
ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో బ్రిటిషర్లకు, ఫ్రెంచివారికి మధ్య పోరు మొదలైంది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచి పడవలను స్వాధీనం చేసుకుంది. దానికి ప్రతీకారంగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం మద్రాసును ఆక్రమించింది. తమను ఫ్రెంచివారి నుంచి రక్షించాల్సిందిగా బ్రిటిషర్లు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. ఈ మేరకు నవాబు చేసిన ఆజ్ఞలను ఫ్రెంచివారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచివారికి, అన్వరుద్దీన్‌కు మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నవాబు ఘోరంగా ఓడిపోయాడు. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగియడంతో భారతదేశంలో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య యుద్ధం కూడా ముగిసింది.
రెండో కర్ణాటక యుద్ధం (1749-1754)
వారసత్వ యుద్ధ సమయంలో ఫ్రెంచివారు హైదరాబాద్‌లో ముజఫర్‌జంగ్‌కు, కర్ణాటకలో చందాసాహెబ్‌కు మద్దతు పలికారు. బ్రిటిషర్లు హైదరాబాద్‌లో నాజర్‌జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్‌కు, తర్వాత అతడి కుమారుడు మహమ్మద్ అలీకి మద్దతిచ్చారు. 1749లో ఫ్రెంచివారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్ఠించేలా చేశారు. అయితే బ్రిటిషర్లు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహమ్మద్ అలీ వశమైంది.
మూడో కర్ణాటక యుద్ధం (1758-1763)
ఐరోపాలో ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ల మధ్య 1756లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచి గవర్నరు కౌంట్ డి లాలీ బ్రిటిష్ జనరల్ సర్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు. ఫ్రెంచివారి స్థానంలో బ్రిటిషర్లు నిజాం సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. 1763లో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య సంధి కుదిరింది.
బెంగాల్ ఆక్రమణ
మొగల్ సామ్రాజ్య పతనం తర్వాత ముర్షిద్ కులీఖాన్ బెంగాల్‌లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ముర్షిద్ కులీఖాన్ తర్వాత అతడి అల్లుడు షుజాఉద్దీన్ సింహాసనాన్ని ఆక్రమించాడు. అతడి కుమారుడు సర్ఫరాజ్ పరిపాలనాకాలంలో బీహార్ డిప్యూటీ గవర్నరు అలీవర్దీఖాన్ 1740లో బెంగాల్ నవాబుగా ప్రకటించుకున్నాడు. ఇతడి కాలంలో బెంగాల్‌పై మరాఠాలు అనేక సార్లు దండయాత్రలు చేశారు. 1751లో బెంగాల్ నవాబుకు, మరాఠాలకు మధ్య సంధి కుదిరింది. ఈ సంధి ప్రకారం బెంగాల్ నవాబు మరాఠాలకు సంవత్సరానికి రూ.12 లక్షల చౌత్ చెల్లించడానికి అంగీకరించాడు. అలీవర్దీఖాన్ 1752లో తన మనవడు సిరాజ్-ఉద్-దౌలాను తన వారసుడిగా ప్రకటించాడు. సిరాజ్ సమీప బంధువు షౌకత్ జంగ్, పిన్ని గసితి బేగం, అలీవర్ద్దీఖాన్ సోదరి భర్త, సర్వసైన్యాధ్యక్షుడైన మీర్జాఫర్‌లు బెంగాల్ సింహాసనానికి ప్రధాన పోటీదారులు. వీరిని బలహీనపరచడానికి సిరాజ్ అనేక చర్యలు చేపట్టాడు. గసితి బేగం సంపదను లాక్కున్నాడు. మీర్జాఫర్ స్థానంలో మీర్‌మదన్‌ను సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. షౌకత్ జంగ్ తిరుగుబాటును అణచివేయడమే కాకుండా అతడిని చంపేశాడు.
సిరాజ్-ఉద్-దౌలా బ్రిటిషర్లతో వైరం పెంచుకోవడానికి కారణాలు..
* చట్టానికి విరుద్ధంగా బ్రిటిషర్లు నవాబు ఆధీనంలోని భూభాగంలో కోటలు నిర్మించడంతోపాటు పెద్ద కందకాన్ని తవ్వడం.
* ఆంగ్లేయులు దస్తక్ / ఉచిత పాసులను అనర్హులకు కేటాయించి దుర్వినియోగం చేయడం ద్వారా నవాబు ఆదాయానికి గండికొట్టడం.
* నవాబుకు అవిధేయులు, లంచగొండులైన అధికారులకు ఆంగ్లేయులు రక్షణ కల్పించడం.
* తన పూర్వికుల్లా తాను కూడా బ్రిటిషర్లపై నియంత్రణ కలిగి ఉండాలని భావించడం.
ప్లాసీ యుద్ధం
ప్లాసీ అనేది ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. అక్కడ 1757 జూన్ 23న బ్రిటిషర్లకు, నవాబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించాయి. నవాబు సైన్యంలోని అయిదుగురు సేనానుల్లో మీర్ మదన్, మదన్‌లాల్ మాత్రమే యుద్ధం చేశారు. మిగతా ముగ్గురు మీర్జాఫర్, యార్‌లతుఫ్ ఖాన్, రాయ్‌దుర్లబ్‌రామ్ కంపెనీ ఏజెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని ప్రేక్షకపాత్ర వహించారు.
ప్లాసీ యుద్ధం మొదట బెంగాల్‌లో, చివరికి దేశమంతటా బ్రిటిష్ వారి ఆధిపత్య స్థాపనకు దారితీసింది. భారతదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలింపు ప్రారంభమైంది. సిరాజ్-ఉద్-దౌలా స్థానంలో మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఆ తర్వాత మీర్‌ఖాసిం బెంగాల్ నవాబు అయ్యాడు.
బక్సార్ యుద్ధం (1764)
బక్సార్ యుద్ధం 1764 అక్టోబరు 22న మేజర్ హెక్టర్ మన్రో నాయకత్వంలోని బ్రిటిష్ సేనలకు - మీర్‌ఖాసిం, అవధ్ నవాబు షుజా-ఉద్-దౌలా, మొగలు చక్రవర్తి రెండో షా ఆలం ఉమ్మడి సేనలకు మధ్య జరిగింది. బక్సార్ అనే ఈ ప్రదేశం పాట్నా నగరానికి పశ్చిమంగా 120 కి.మీ.ల దూరంలో ఉంది.
కారణాలు
* సార్వభౌమాధికారం కోసం బ్రిటిషర్లు - బెంగాల్ నవాబు మీర్‌ఖాసిం మధ్య పోరు.
* 1717లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను బ్రిటిషర్లు దుర్వినియోగం చేయడం.
* నవాబు బెంగాల్‌లో అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులను తొలగించడం.
* నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం.
ఈ యుద్ధం భారతీయ పాలకుల ఓటమితో ముగిసింది. మూడు రాజ్యాల సేనల మధ్య సమన్వయం లేకపోవడమే బ్రిటిషర్ల విజయానికి ప్రధాన కారణం.
అలహాబాద్ ఒప్పందం
బక్సార్ యుద్ధం తర్వాత 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో బ్రిటిష్ ఆధిపత్య స్థాపన మొదలైంది. అవధ్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారాడు. మొగలు చక్రవర్తి రెండో షా ఆలం కంపెనీ పెన్షనర్ అయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఔన్నత్యం పెరిగింది.
మైసూరు రాజ్యం
తూర్పు, పశ్చిమ కనుమలకు మధ్య నెలకొన్న మైసూరు రాజ్యాన్ని ఒడయార్ వంశం పరిపాలించేది. క్రీ.శ. 1731-1734 మధ్య సర్వసైన్యాధ్యక్షుడైన దేవరాజ, సర్వాధికారి (ఆర్థికమంత్రి) ననరాజ అనే సోదరులు మైసూరు రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. మరాఠాలు, నిజాం, బ్రిటిషర్లు, ఫ్రెంచివారు మైసూరు రాజ్యంపై వరుస దాడులు ప్రారంభించారు. రెండో కర్ణాటక యుద్ధం సమయంలో ననరాజ తిరుచిరాపల్లిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆంగ్లేయుల పక్షం వహించాడు. తర్వాత అతడు ఫ్రెంచివారి పక్షాన చేరాడు. మైసూరు రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడైన హైదర్ అలీ తిరుచిరాపల్లి దండయాత్ర సందర్భంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. క్రీ.శ. 1758 తర్వాత మరాఠాలు మైసూరుపై దండెత్తినప్పుడు హైదర్ అలీ ననరాజ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుని మైసూరు పాలకుడయ్యాడు. అయితే ఇది నచ్చని కొంతమంది హైదర్ అలీపై దండెత్తవలసిందిగా మరాఠాలను ఆహ్వానించారు. ఇందులో హైదర్ అలీ ఓడిపోయాడు. మరాఠాలు మూడో పానిపట్టు యుద్ధంలో తలమునకలై ఉన్న సమయంలో హైదర్ అలీ తన అధికారాన్ని మళ్లీ సుస్థిరం చేసుకున్నాడు.
'కలకత్తా చీకటి గది' ఉదంతం
సిరాజ్-ఉద్-దౌలా 1756 జూన్‌లో ఆంగ్లేయుల ఆధీనంలోని కలకత్తాను ఆక్రమించాడు. బెంగాల్ గవర్నరు రోజర్ డ్రేక్, ఇతర అధికారులు కలకత్తా నగరం వదిలి పారిపోయారు. హాల్‌వెల్‌తో సహా అనేక మంది ఐరోపావారు నవాబుకు లొంగిపోయారు. వీరిని ఒక చిన్న గదిలో రాత్రంతా బంధించడంతో తెల్లవారేసరికి 16 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఈ సంఘటనను 'కలకత్తా చీకటి గది' ఉదంతంగా పేర్కొన్నారు. అయితే దీనికి సిరాజ్-ఉద్-దౌలా స్వయంగా బాధ్యుడు కాడు. రాబర్ట్ క్లైవ్ 1757 జనవరి 2న అడ్మిరల్ వాట్సన్ సహాయంతో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటిషర్లకు, నవాబుకు మధ్య అదే ఏడాది ఫిబ్రవరి 9న అలీనగర్ సంధి కుదిరింది. క్లైవ్ మార్చిలో ఫ్రెంచివారికి చెందిన చంద్రనగర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. సిరాజ్-ఉద్-దౌలా ఆస్థానంలోని మీర్జాఫర్, రాయ్‌దుర్లబ్‌రామ్, అమీన్‌చంద్, జగత్‌సేఠ్‌లకు నవాబు వ్యవహార శైలి నచ్చలేదు. వారు అతడిని నవాబు పదవి నుంచి తొలగించాలని కుట్రపన్నారు. అమీన్‌చంద్ ఈ విషయాన్ని బ్రిటిషర్లకు తెలియజేయడంతో వారు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
మైసూరు యుద్ధాలు
మొదటి మైసూరు యుద్ధం (1766-1769)
మైసూరు పాలకుడు హైదర్ అలీ బ్రిటిషర్లను కర్ణాటక ప్రాంతంతోపాటు భారతదేశం నుంచి కూడా తరిమివేయాలని భావించాడు. హైదర్ అలీ వల్ల తమ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లనుందని గ్రహించిన బ్రిటిషర్లు నిజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో బ్రిటిషర్లపై విజయం సాధించిన హైదర్ అలీ మద్రాసుకు 5 కి.మీ.ల మేర దండయాత్ర కొనసాగించాడు. 1769లో జరిగిన మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది.
రెండో మైసూరు యుద్ధం (1780-1784)
మరాఠాలు 1771లో హైదర్ అలీపై దాడి చేసినప్పుడు బ్రిటిషర్లు హైదర్ అలీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. అమెరికా స్వాతంత్య్ర యుద్ధం సందర్భంగా ఇంగ్లండ్‌కు, హైదర్ అలీ మిత్రదేశమైన ఫ్రాన్సుకు మధ్య తగాదా తలెత్తింది. హైదర్ అలీ ఆధీనంలోని ఫ్రెంచి భూభాగమైన మహేను బ్రిటిషర్లు ఆక్రమించారు. ఇవే ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు. 1780లో జరిగిన యుద్ధంలో కల్నల్ బైలీని హైదర్ అలీ ఓడించాడు. 1781లో పోర్టోనోవో యుద్ధంలో ఐర్ కూట్ చేతిలో పరాజయం పొందాడు. 1782లో కల్నల్ బ్రైట్ వైట్‌ను ఓడించాడు. ఈ యుద్ధం జరుగుతుండగానే హైదర్ అలీ మరణించాడు. దీంతో అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. ఈ యుద్ధం 1784లో జరిగిన 'మంగళూరు సంధి'తో ముగిసింది.
మూడో మైసూరు యుద్ధం (1790-1792)
అంతర్గత సంస్కరణల ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడం.. టర్కీ, ఫ్రాన్సులకు రాయబారులను పంపడం ద్వారా వారి సహాయం పొందడానికి ప్రయత్నించడం.. బ్రిటిషర్ల మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్య భూభాగాలను ఆక్రమించడం.. ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు. బ్రిటిష్ సైన్యానికి స్వయంగా గవర్నరు జనరల్ కారన్ వాలిస్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు. 1792లో జరిగిన శ్రీరంగ పట్టణం సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగం భూభాగాన్ని బ్రిటిషర్లకు ఇవ్వడానికి అంగీకరించాడు. యుద్ధ నష్టపరిహారం కింద రూ. 3.6 కోట్లు చెల్లించడానికి అంగీకరించి రూ. 1.6 కోట్లు వెంటనే చెల్లించాడు.
నాలుగో మైసూరు యుద్ధం (1799)
టిప్పు సుల్తాన్ తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, బ్రిటిష్ గవర్నరు జనరల్ వెల్లస్లీ బ్రిటిష్ సామ్రాజ్యానికి టిప్పు సుల్తాన్ నుంచి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించాలనుకోవడం ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాలు. శ్రీరంగ పట్టణంలో జరిగిన ఈ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడుతూ 1799 మేలో టిప్పు సుల్తాన్ మరణించాడు. గవర్నరు జనరల్ సోదరుడు సర్ ఆర్ధర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతడే 1815లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించాడు. టిప్పు సుల్తాన్ మరణంతో మైసూరు రాష్ట్రంలోని చాలా భూభాగాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. కొంత భూభాగానికి ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ అనే బాలుడిని రాజుగా చేసి మైసూరు రాజవంశాన్ని పునరుద్ధరించారు.
హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ గొప్ప పరిపాలకులు. ఇద్దరూ పరమత సహనాన్ని పాటించారు. హైదర్ అలీ ఎప్పుడూ బహిరంగంగా రాజరిక బిరుదులు ధరించలేదు. ఇతడికి, రాజవంశానికి మధ్య సంబంధం మరాఠా చక్రవర్తికి, పీష్వాకు మధ్య సంబంధంలా ఉండేది. అయితే టిప్పు సుల్తాన్ మైసూరు రాజును పదవీచ్యుతుడిని చేసి 1789లో సుల్తాన్ బిరుదు ధరించాడు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌లు తమ నాణేల మీద హిందూ దేవతల బొమ్మలు ముద్రించారు. టిప్పు సుల్తాన్‌కు శృంగేరి పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్యులపై ఎనలేని గౌరవం ఉండేది. శంకరాచార్యులకు దేవాలయ మరమ్మతుల కోసం భారీగా నిధులు ఇచ్చాడు. పరిపాలనలో పాశ్చాత్య పద్ధతులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాజుగా టిప్పుసుల్తాన్ పేరుగాంచాడు. ఇతడు స్వదేశీ, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. న్యాయ పరిపాలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాడు. అధికారుల ఎంపికలో కుల, మత, సాంఘిక తారతమ్యాలు చూపకుండా ప్రతిభకు పట్టం కట్టాడు. సమకాలీన భారతదేశ చరిత్రలో వీరి పరిపాలన అందరిమన్ననలు పొందింది.
మాదిరి ప్రశ్నలు
1. కిందివారిలో స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
ఎ) సఫ్దర్ అలీ బి) దోస్త్ అలీ సి) సాదతుల్లా ఖాన్ డి) అన్వరుద్దీన్
జ: సి(సాదతుల్లా ఖాన్)
2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
జ: ఆర్కాట్
3. హైదర్ అలీ ఏ మైసూరు యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో
4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజ్-ఉద్-దౌలాను బంధించి చంపిన వ్యక్తి ఎవరు?
జ: మీరాన్
5. బక్సార్ యుద్ధ వీరుడు ఎవరు?
జ: హెక్టర్ మన్రో
6. చీకటి గది ఉదంతం గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరు?
జ: హాల్‌వెల్
7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్
8. టిప్పు సుల్తాన్ ఎప్పుడు మరణించాడు?
జ: 1799
9. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు
10. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్‌కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరు?
జ: అమీన్‌చంద్
No comments:
Post a Comment