భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పాలన, ప్రభుత్వ విధానం



రాజ్యాంగ చరిత్ర

* వందల ఏళ్ల క్రితమే పునాదులు
* తొలి మూడు దశల విశేషాలు 

  • భారత రాజ్యాంగం - ఒక సమున్నత లక్ష్య సాధనకు చేసిన మేధో సాగర మథనం.. స్వతంత్ర భారతావని ఉజ్వల భవిష్యత్తు స్వప్న సాకారానికి సుందర రూపం.. స్వతంత్ర ఫలాల మాధుర్య ఫలితాలు, భారతీయుల ఆశలు - ఆకాంక్షలకు అక్షర రూపం.. తరతరాల ప్రగతికాముక భవిత నిర్దేశిత ప్రణాళికా సౌధం.. ఇంతటి అద్భుత లిఖిత రాజ్యాంగ నిర్మాణం వెనుక విశేషమైన చరిత్ర ఉంది. భారత ప్రముఖుల అనిర్వచనీయ కృషి ఉంది. వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. 5 దశలుగా చెప్పుకొనే రాజ్యాంగ నేపథ్య చరిత్రలో మొదటి 3 దశలివి.. క్రీ.శ. 1600 నుంచి 1919 భారత ప్రభుత్వ చట్టం వరకు.. ఉన్న చారిత్రక అంశాలను తెలుసుకుందాం.
  • ప్రజాస్వామ్య రాజ్యాల అవతరణతో వ్యక్తుల పాలన కాకుండా ప్రజలకు చట్టబద్ధపాలన అందిచాలన్న సూత్రం ప్రాతిపదికగా ఆధునిక రాజ్యాంగబద్ధ పాలనకు పునాదులు ఏర్పడ్డాయి. రాజనీతి శాస్త్ర పితామహుడిగా భావించే అరిస్టాటిల్ క్రీస్తుపూర్వమే (384-322) రాజ్యాంగం ప్రాధాన్యం, విశిష్టతలను తెలియజెప్పాడు. ఆయన ఆనాడే చెప్పిన మాటలు రాజ్యాంగబద్ధ పాలనకు స్ఫూర్తిగా నిలిచాయి.
  • భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం

  • బ్రిటిష్ రాజ్యాంగవేత్త, సర్ ఐవర్ జెన్నింగ్స్ అభిభాషణ ప్రకారం - రాజ్యాంగాలు గతానికి వారసులు, భవిష్యత్తుకు వీలునామాలు. భారత రాజ్యాంగ చరిత్ర పరిణామక్రమాన్ని పరిశీలిస్తే.. భారత రాజ్యాంగం కూడా గత అనుభవాల నుంచి క్రోడీకరించి దేశ భవిష్యత్తు కోసం రూపొందించిన ఒక మహత్తర శాసనపత్రం. భారత రాజ్యాంగ చరిత్రకు విశేష, విశిష్ట నేపథ్యం ఉంది. ఆంగ్లేయులు క్రీ.శ. 1600 సంవత్సరంలో భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి.. ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి చట్టబద్ధ అనుమతి ఇవ్వడంతో - వారి ప్రవేశంతోనే భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైంది. అనంతరం రూపుదిద్దుకున్న అనేక సామాజిక, రాజకీయ పరిణామాలు.. ఉద్యమాలు, సంస్కరణలు.. కాలగమనంలో చేసిన ఎన్నో చట్టాలతో కొనసాగింది. చివరిగా భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమల్లోకి వచ్చే వరకు ఇదంతా భారత రాజ్యాంగ చరిత్రే.
  • విస్తరణ క్రమం
  • భారత రాజ్యాంగ విస్తరణ పరిణామ క్రమాన్ని 5 దశలుగా విభజించవచ్చు.
  •   మొదటి దశ 1600-1765
      రెండో దశ 1765-1858
      మూడో దశ 1858-1919
      నాలుగో దశ 1919-1947
      అయిదో దశ 1947-1950
    మొదటి దశ
  • భారత రాజ్యాంగ విస్తరణ పరిణామ క్రమంలో మొదటి దశ ప్రధానాంశాలివి..
  • * ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి మొదటి ఎలిజబెత్ మహారాణి 1600, డిసెంబరు 31 చార్టర్ ప్రకారం అనుమతి ఇవ్వడం.
    * మొగల్ సామ్రాజ్య విచ్ఛినం, ఔరంగజేబు మరణానంతర పరిస్థితుల్లో.. ఇదే అవకాశంగా ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను 1757 ప్లాసీ యుద్ధంలో ఓడించడంతో భారతదేశంలో ఆంగ్లేయుల పాలనకు తెరలేచింది.
    రెండో దశ
  • రెండో దశలోని ప్రధాన పరిణామాలు..
  • * 1773 రెగ్యులేటింగ్ చట్టం - భారతదేశానికి సంబంధించి దీన్ని 'మొదటి లిఖిత రాజ్యాంగ చట్టం'గా పేర్కొంటారు. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారిగా రాజకీయ, పరిపాలనా అధికారాలను కట్టబెట్టింది.
    * కలకత్తాలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ఏర్పాటైంది. ప్రధాన న్యాయమూర్తిగా ఎలీజా ఇంఫే ను నియమించారు.
    * ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు వ్యాపారం కొనసాగించడానికి అనుమతి.
    * బెంగాల్ గవర్నర్ హోదాను 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌'గా మార్పు. 1772, ఏప్రిల్ 13న వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా నియామకం.
    * కంపెనీ అధికారుల అసమర్ధ నిర్వహణ, బాధ్యతా రాహిత్యం, అవినీతి కార్యకలాపాల నియంత్రణకు చర్యలు.
    * పిట్స్ ఇండియా చట్టం 1784 - నాటి బ్రిటన్ ప్రధాని విలియం పిట్ ప్రతిపాదించిన చట్టం ఇది. రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి చేసిన చట్టం.
    * ఈస్ట్ ఇండియా కంపెనీలో మొదటిసారిగా ద్వంద్వ పాలన ప్రవేశ పెట్టారు. కంపెనీ కార్యకలాపాలను వాణిజ్య, రాజకీయ వ్యవహారాలుగా వేరు చేశారు.
    * కంపెనీ రాజకీయ, సైనిక, రెవెన్యూ వ్యవహారాలను ఇంగ్లండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌'కు అప్పగించారు.
    * బోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ను వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు.
    * బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రెండు సంస్థలూ కంపెనీ పాలనను నియంత్రించడం వల్ల ఈ చట్టం ద్వంద్వ పాలన విధానానికి నాంది పలికింది.
    1813 చార్టర్ చట్టం 
    * ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించారు.
    * కంపెనీకి వర్తకంపై ఉన్న గుత్తాధిపత్యం తొలగింపు. భారత్‌లో వ్యాపారం చేసుకోవ డానికి అందరికీ అవకాశం.
    * స్థానిక సంస్థలకు పన్నులు విధించడానికి.. పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారాలు కల్పించారు.
    * భారతదేశంలో మిషనరీలు ప్రవేశించడానికి అనుమతిచ్చారు.
    1833 చార్టర్ చట్టం
    * ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మరో 20 సంవత్సరాలు పొడిగించారు.
    * గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హోదాను 'భారత గవర్నర్ జనరల్‌'గా మార్చారు. దీంతో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ అయ్యారు.
    * భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి భారతీయ 'లా' కమిషన్‌ను నియమించారు. దానికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
    * ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా పేర్కొన్నారు.
    1853 చార్టర్ చట్టం - ప్రధానాంశాలు 
    * బ్రిటిష్ పార్లమెంటు అనుమతి ఉన్నంత వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిర్వహణకు అవకాశం.
    * ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటైంది. దాని ద్వారా గవర్నర్ జనరల్‌కి శాసనాలు రూపొందించే అధికారం కల్పించారు.
    * కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు.
    * వివిధ 'లా' కమిషన్ల సిఫార్సుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), భారతీయ శిక్షాస్మృతి (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1861) చట్టాలు రూపొందించారు.
    * సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతి ప్రవేశపెట్టారు.
    మూడో దశ
  • మూడో దశలో ప్రధాన పరిణామాలు..
  • * భారత ప్రభుత్వ చట్టం 1858 - భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు పర్యవసానంగా చేసిన ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమై బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన ప్రవేశ పెటారు. 1858, నవంబరు 1న బ్రిటిష్ రాణి భారత పరిపాలన అధికారాన్ని చేపట్టింది.
    * గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి వైస్రాయ్ కానింగ్. అయితే బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్‌గానూ, స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయ్‌గానూ వ్యవహరించేవారు.
    * ద్వంద్వ పాలన రద్దయింది.
    * భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు. మొదటి కార్యదర్శి లార్డ్ స్టాన్లీ.
    భారత కౌన్సిల్ చట్టం 1861
  • ఈ చట్టం ద్వారా భారతీయులకు శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం వచ్చింది.
  • * 1862లో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో హైకోర్టులు ఏర్పాటయ్యాయి.
    * బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు.
    భారత కౌన్సిల్ చట్టం 1909
       (మార్లే-మింటో సంస్కరణలు)
  • భారతదేశంలో నాటి తీవ్రవాద, జాతీయవాదాల్లో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే, భారత్ వైస్రాయ్ మింటో పేర్లతో ఈ చట్టం రూపొందింది.

  • * కేంద్ర, రాష్ట్ర శాసన మండళ్లలో సభ్యుల సంఖ్య పెంచారు.
    * ఈ చట్టం ఎన్నికల వ్యవస్థను ప్రవేశ పెట్టింది.
    * మహమ్మదీయులకు, వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించారు.
    భారత ప్రభుత్వ చట్టం 1919
        (మాంటేగ్ - ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు)
    * 1917, ఆగస్టు 20న బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రకటించింది. ఈదిశగా, భారత రాజ్య కార్యదర్శి ఎడ్సిన్ మాంటేగ్, వైస్రాయ్ లార్డ్ ఛేమ్స్‌ఫర్డ్ 1917 నవంబరు భారతీయ నాయకులతో చర్చలు జరిపి బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుకు సంస్కరణలు ప్రవేశపెట్టారు.
    * ఈ చట్టం భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసింది.
    * కేంద్ర, రాష్ట్రాల మధ్య పాలనాంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనే రెండు జాబితాలుగా రూపొందించారు.
    * రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశ పెట్టారు.
    * ఈ చట్టం ద్వారా కేంద్రంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు.
    * భారతదేశంలో పరిమితమైన ప్రత్యక్ష ఎన్నికల పద్థతిని ప్రవేశపెట్టారు.
    * ఆస్తి, పన్ను చెల్లింపు ప్రతిపాదికలుగా పరిమితమైన ఓటుహక్కు కల్పించారు.
    * ఈ సంస్కరణలు భారతీయులను నిరాశ, అసంతృప్తికి గురిచేసినా భారతదేశంలో స్వపరిపాలన దిశగా ప్రముఖమైన ముందంజగా, భారత రాజ్యాంగ చరిత్రలో ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు.
    * మన రాజ్యాంగం
    * బ్రిటిష్ సవాల్‌కు దీటైన సమాధానం
    * మలి రెండు దశల పరిణామక్రమం 

  • సువిశాల భారతావని సుందర భవిష్యత్తుకు మార్గదర్శనం చేసే అద్భుత అక్షర స్వరూప మైన రాజ్యాంగం రూపకల్పన ఓ మహత్తర ప్రక్రియ. రాజ్యాంగ రచనపై భారతీయుల సామర్థ్యాన్ని శంకిస్తూ బ్రిటన్ మంత్రి విసిరిన సవాల్‌కు భారత ప్రముఖులు చెప్పిన దీటైన సమాధానం. మన రాజ్యాంగ సుదీర్ఘ నేపథ్య చరిత్రలో కీలకమైన చివరి రెండు దశల్లో ఈ అద్భుతం సాకారమైంది. 1919 నుంచి 1950 జనవరి 26 దాకా అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రూపకల్పన వెనుక చోటు చేసుకున్న పరిణామాలు.. నేతల కృషి.. దూరదృష్టి.. తదితర అంశాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
  • క్రీ.శ. 1600 నుంచి ప్రారంభమైన భారత రాజ్యాంగ నేపథ్య చరిత్రకు సంబంధించిన 5 దశల్లో చివరి 2 దశలూ ఎంతో కీలకమైనవి. 1919 నుంచి.. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 వరకు ఉన్న 4, 5 దశల్లోనే ప్రధానమైన అంశాలెన్నో చోటు చేసుకున్నాయి. వీటిలో 1919-1947 మధ్య కాలం నాలుగో దశ కాగా.. 1947-1950 మధ్య కాలం అయిదో దశ..
  • నాలుగో దశ
  • నాలుగో దశ ప్రధాన పరిణామాలివి..
  • సైమన్ కమిషన్-1927: భారత ప్రభుత్వ చట్టం-1919 ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబరులో ఆరుగురు సభ్యులతో కూడిన ఒక కమిషన్‌ను సర్ జాన్ సైమన్ నాయకత్వంలో భారతదేశానికి పంపించింది. ఇందులోని సభ్యులంతా ఆంగ్లేయులే కావడం, ఒక్క భారతీయుడూ లేకపోవడంతో భారతీయులు ఈ కమిషన్‌ని పూర్తిగా వ్యతిరేకించారు.
  • సైమన్ కమిషన్ 1930లో సమర్పించిన నివేదికలోని ముఖ్యాంశాలు..
    * రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన రద్దు.
    * సమాఖ్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం.
    * కమ్యూనల్ ప్రాతినిధ్యానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొనసాగింపు.
    * మొదటిసారిగా సమాఖ్య వ్యవస్థకు సూచన.
    నెహ్రూ నివేదిక - 1928
  • కాంగ్రెస్ నాయకులు సైమన్ కమిషన్‌ను బహిష్కరించిన తరుణంలో బ్రిటన్‌లోని భారత వ్యవహారాల మంత్రి లార్డ్ బెర్కెస్ హెడ్ భారతీయుల రాజ్యాంగ రచనా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ 'భారతీయులు.. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచనను స్వయంగా చేసుకోగలరా?' అని విసిరిన సవాల్‌ను స్వీకరించిన నేపథ్యంలో.. 1928, మే 19న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 1928, ఆగస్టు 10న మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 8 మంది సభ్యులతో ఒక ఉపసంఘం ఏర్పాటైంది. ఆ ఉపసంఘం ఇచ్చిన నివేదికనే నెహ్రూ నివేదిక అంటారు.
  • నెహ్రూ నివేదిక ప్రధానాంశాలు:
    * భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం.
    * కార్య నిర్వాహక శాఖ శాసనసభకు బాధ్యత వహించడం.
    * ప్రాథమిక హక్కుల ప్రస్తావన.
    మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
       (1930, నవంబరు 12 - 1931, జనవరి 19)
  • భారత్‌కు త్వరలో 'స్వతంత్ర ప్రతిపత్తి' కల్పించడం బ్రిటిష్ విధానమని నాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ 1929, అక్టోబరు 31న చేసిన ప్రకటన (దీన్ని దీపావళి ప్రకటన అని అంటారు)కు అనుగుణంగా లండన్‌లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనిలో కాంగ్రెస్ పాల్గొనలేదు. ఈ సమావేశంలో భావి భారత రాజ్యాంగం సమాఖ్యగా ఉండాలా? (లేదా) ఏక కేంద్రంగా ఉండాలా? అన్న అంశంపై చర్చించారు.
  • గాంధీ-ఇర్విన్ ఒప్పందం 
       ((1931, మార్చి 5)
  • భారత రాజ్యాంగ సమావేశాలపై జరిగే చర్చలు.. అందుకుగాను నిర్వహించే రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీజీని ఒప్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం వైస్రాయ్ ఇర్విన్‌ను ఆదేశించింది. ఈ మేరకు 1931, మార్చి 5న గాంధీ - ఇర్విన్‌ల మధ్య జరగిన సమావేశాన్ని గాంధీ-ఇర్విన్ ఒప్పందం అంటారు.
  • ఒప్పందంలోని ముఖ్యాంశాలు
    * రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.
    * శాసనోల్లంఘన ఉద్యమాన్ని కాంగ్రెస్ నిలిపివేసి, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం.
    రెండో రౌండ్ టేబుల్ సమావేశం
       (1931, సెప్టెంబరు 7 - డిసెంబరు 7)
    * కాంగ్రెస్ తరపున ఈ సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు. అన్ని స్వదేశీ సంస్థానాలతో సహా 107 మంది పాల్గొన్నారు.
    * సమావేశంలో ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రావిన్స్ (నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్, సింధ్)లను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటిష్ వారు ప్రకటించడంతో.. గాంధీజీ దాన్ని 'విభజించు, పాలించు' అనే విధానంగా భావించి తీవ్రంగా వ్యతిరేకించారు.
    కమ్యూనల్ అవార్డు (1932)
    * 1932, ఆగస్టు 4న అప్పటి బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్ డొనాల్డ్ మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికిగాను చేసిన ఒక ప్రతిపాదనను కమ్యూనల్ అవార్డు అంటారు. దాని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ 1932, సెప్టెంబరు 20న పుణెలోని ఎరవాడ కారాగారంలో ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు.
    మూడో రౌండ్ టేబుల్ సమావేశం
       (1932, నవంబరు 17 - డిసెంబరు 24)
    * మూడో రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో జరిగింది. కాంగ్రెస్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ సమావేశంలో చేసిన సిఫార్సుల్లో ఎక్కువ అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టంలో చోటు దక్కించుకున్నాయి.
    భారత ప్రభుత్వ చట్టం-1935: బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాల్లోకెల్లా దీన్ని ఒక చారిత్రక చట్టంగా పేర్కొనవచ్చు. రాజ్యాంగ సంస్కరణల కోసం బ్రిటిష్‌వారు చేసిన చట్టాల్లో ఇది అతి వివరణాత్మకమైన, సుదీర్ఘమైన చట్టం. ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని ఈ చట్టం నమూనాగా వర్ణిస్తారు. దీన్ని ప్రస్తుత రాజ్యాంగానికి మాతృక లేదా మూలాధారంగా పేర్కొనవచ్చు.
    ప్రధానాంశాలు
    * అఖిల భారత సమాఖ్య ఏర్పాటు.
    * రాష్ట్రాల్లో ఉన్న ద్వంద్వ ప్రభుత్వ విధానం రద్దు. కేంద్రంలో ద్వంద్వ పరిపాలనకు ప్రతిపాదన.
    * రాష్ట్రస్థాయిలో ద్విసభాపద్ధతి ప్రవేశ పెట్టడం.
    * కేంద్ర శాసనసభల పరిమాణం పెంచడం. కేంద్ర ఎగువసభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ్యత్వ సంఖ్యను 260కి, దిగువసభ అయిన లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యత్వ సంఖ్యను 375కి పెంచడం.
    * ఓటుహక్కు విస్తృత పరచడం.
    * కేంద్ర, రాష్ట్రాల మధ్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టు (సుప్రీంకోర్టు) ఏర్పాటు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఈ కోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ మౌలిస్ గ్వయిర్.
    * మొదటిసారిగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు. ప్రాంతీయ స్వపరిపాలన భావన.
    * కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు.
    * కేంద్ర, రాష్ట్రాల మధ్య 3 జాబితాల ప్రకారం అధికార విభజన. అవి 1. కేంద్ర జాబితా - 59 అంశాలు, 2. రాష్ట్ర జాబితా - 54 అంశాలు, 3. ఉమ్మడి జాబితా - 36 అంశాలు
    క్రిప్స్ ప్రతిపాదనలు (1942)
  • భారత రాజ్యాంగ సమస్యల విషయంలో భారతీయులతో సంప్రదింపులు జరపడానికి బ్రిటిష్ కేబినెట్ మంత్రి సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ భారతదేశానికి వచ్చాడు.
  • 1942, మార్చి 22న క్రిప్స్ చేసిన ప్రతిపాదనలోని ముఖ్యాంశాలివి..
    * భారతదేశానికి అవసరమైన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఎన్నికల ద్వారా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు.
    * వీలైనంత త్వరలో భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం. క్రిప్స్ ప్రతిపాదనలను గాంధీజీ 'దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీన వేసిన ఒక చెక్కు' అని వ్యాఖ్యానించారు.
    కేబినెట్ మిషన్ ప్రణాళిక-1946
  • బ్రిటిష్ కేబినెట్ మంత్రి సర్ పెథిక్ లారెన్స్ ఛైర్మన్‌గా ఇద్దరు ఇతర కేబినెట్ మంత్రులు సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్‌లు సభ్యులుగా ఒక బృందం ఏర్పాటైంది. ఆ బృందం భారత్‌లో పర్యటించి భారతదేశ రాజ్యాంగ నిర్మాణం, స్వాతంత్య్రం ఇచ్చే ప్రతిపాదన అంశాలకు సంబంధించి 1946, మే 16న ఒక ప్రణాళికను వెల్లడించింది. దానినే కేబినెట్ మిషన్ ప్రణాళిక అంటారు.
  • ముఖ్యాంశాలివి..
    * బ్రిటిష్ పాలిత భారతదేశం, స్వదేశీ సంస్థానాలు కలిపి ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పాటు.
    * పరిపాలనా నిర్వహణ కోసం 14 మంది సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు.
    * రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు.
    భారత స్వాతంత్య్ర చట్టం - 1947
  • భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టానికి ముగింపు పలికిన చట్టం భారత స్వాతంత్య్ర చట్టం-1947. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు 1947, జులై 18న ఆమోదించింది. ఈ చట్టం 1947, ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమల్లో వచ్చింది.
  • చట్టంలోని ప్రధాన అంశాలు..
    * ఇండియా, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్య్ర దేశాల ఏర్పాటు. ఇరు దేశాలకూ రాజ్యాంగ నిర్మాణానికి రెండు వేర్వేరు రాజ్యాంగ పరిషత్తుల ఏర్పాటు.
    * స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం.
    * 562 సంస్థానాలకు స్వేచ్ఛ, స్వాత్రంత్య్రాలు కల్పిస్తూ వీటికి ఇండియన్ యూనియన్‌లో గానీ, పాకిస్థాన్ యూనియన్‌లో గానీ కలిసే అవకాశం.
    రాజ్యాంగ పరిషత్తు కమిటీలు
  • రాజ్యాంగ రచనలో వివిధ అంశాలకు సంబంధించి అధ్యయనం చేసేందుకు 22 కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో 12 విషయ నిర్ణాయక కమిటీలు, 10 విధాన నిర్ణాయక కమిటీలు. వీటికి అనుబంధంగా 7 ఉపకమిటీలు, 12 మైనర్ కమిటీలను ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైన కమిటీ - ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ. 1947, ఆగస్టు 29న ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీకి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధ్యక్షులుగా నియమితులయ్యారు.
  • * ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్ట్‌లను రూపొందించింది.
    * ముసాయిదా 1948, ఫిబ్రవరి 21న ప్రచురితమైంది.
    * ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తు 1949, నవంబరు 26న ఆమోదించింది.
    * 1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే 1949, నవంబరు 26వ తేదీనే రాజ్యాంగంలోని కొన్ని అంశాలు తక్షణం అమల్లోకి వచ్చాయి. ఇందులో పౌరసత్వం, రాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక లాంటివి ఉన్నాయి.
  • భారత రాజ్యాంగ పరిషత్తు.. రాజ్యాంగ రచనతోపాటు కొన్ని సాధారణ చట్టాలను కూడా ఆమోదించింది. వాటిలో ముఖ్యమైనవి..
  • * 1947, జులై 22న రూపొందించిన జాతీయ జెండాకు ఆమోదం.
    * భారత రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగు గుర్తింపు.
    * 1949, సెప్టెంబరు 14న దేవనాగరి లిపిలో ఉన్న హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా గుర్తింపు.
    * 1950, జనవరి 24న జాతీయ గీతం, జాతీయ గేయాలకు ఆమోదం.
    అయిదో దశ
  • భారత రాజ్యాంగ నిర్మాణ చరిత్రలో అయిదో దశ చివరి, కీలకమైన ఘట్టం.. స్వాతంత్య్రం లభించిన వెంటనే దేశ నాయకుల ముందున్న అతిపెద్ద సవాల్. జాతి పునర్నిర్మాణం.. భవిష్యత్తు తరాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేకూర్చడం.. పౌరుల ప్రాథమిక హక్కులను గుర్తిస్తూ వాటి పరిరక్షణకు హామీ కల్పించడం.. లాంటివి రాజ్యాంగ రచనలో ప్రధానాంశాలు. చివరి దశలోని ప్రధానాంశాలివి..
  • రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు) ఏర్పాటు: 1945 సెప్టెంబరులో భారతీయుల కోసం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ మిషన్ ప్రణాళిక 1946 సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది. 1946 జులై, ఆగస్టులలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి.
    * రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389.
    * వీరిలో 292 మంది బ్రిటిష్ ఇండియా నుంచి (ఎన్నిక), 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి (నామినేట్), నలుగురు సభ్యులను చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన దిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్థాన్ నుంచి తీసుకున్నవారు ఉంటారు.
    * రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం 1946, డిసెంబరు 9న దిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌హాలులో నిర్వహించారు.
    * డిసెంబరు 11న డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
    * అంతర్జాతీయ న్యాయవాది బెనగళ్ నరసింగరావు రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు.
    * 1946, డిసెంబరు 13న జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని 1947, జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించారు.


    భారత ఉపరాష్ట్రపతులు - ప్రత్యేకతలు
    భారత రాష్ట్రపతులు - ప్రత్యేకతలు